ఎన్‌జేఏసీపై కీలకతీర్పు నేడు

16 Oct, 2015 01:03 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎన్డీయే ప్రభుత్వం తెచ్చిన జాతీయ జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్ (ఎన్‌జేఏసీ) రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌లపై సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించనుంది. హైకోర్టులు, సుప్రీంకోర్టుల్లో జడ్జిల నియామకాలను సుప్రీం చీఫ్ జస్టిస్ సారథ్యంలోని కొలీజియం చూసేది.  కొలీజియం వ్యవస్థలో లోపాలున్నాయని పేర్కొంటూ మోదీ ప్రభుత్వం 99వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎన్‌జేఏసీని ఏర్పాటు చేసింది. జస్టిస్ జే.ఎస్.ఖేహర్ నేతృత్వంలోని జస్టిస్ జె.చలమేశ్వర్, జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ అదర్శ్‌కుమార్ గోయల్ సభ్యులుగా ఉన్న ధర్మాసనం ఈ రాజ్యాంగ సవరణను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను 31రోజుల పాటు విచారించింది. ఈఏడాది జూలై15న తీర్పును రిజర్వు చేసింది.
 
ఎన్‌జేఏసీలో సుప్రీంకోర్టు సీజే, సర్వోన్నత న్యాయస్థానంలోని ఇద్దరు అత్యంత సీనియర్ న్యాయమూర్తులు, న్యాయశాఖ మంత్రితో పా టు ఇద్దరు ప్రముఖులు సభ్యులుగా ఉంటారు. ఈ ఇద్దరు ప్రముఖుల పేరిట న్యాయ నియామకాల్లో బయటి జోక్యం పెరుగుతుందని, న్యాయవ్యవస్థ స్వతంత్రను దెబ్బతీసే ఉద్దేశంతోనే ఎన్‌జేఏసీ ఏర్పాటు జరిగిందని.... దీనిని వ్యతిరేకించిన రాంజెఠ్మలానీ, ఫాలీ నారిమన్, అనిల్ దివాన్ లాంటి లాయర్లు వాదించారు.

న్యాయపరిజ్ఞానం లేని వారిని జడ్జిల నియామకాల్లో భాగస్వామ్యం చేయడం వల్ల ఉపయోగం ఉండదని వాదనల సందర్భంగా ధర్మాసనం కూడా అభిప్రాయపడింది. ఇతర కమిషన్లు, ట్రిబ్యునళ్లలో ప్రముఖులు (సంబంధిత చట్టాలపై పరిజ్ఞానం లేకున్నప్పటికీ) ఉంటున్నపుడు జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్‌లో ఎందుకు ఉండకూదని అటార్నీ జనరల్ ముకుల్ రోహ్తగీ వాదించారు.

>
మరిన్ని వార్తలు