స్వలింగ సంపర్కుల్లో చిగురించిన కొత్త ఆశలు

22 Apr, 2014 20:33 IST|Sakshi
స్వలింగ సంపర్కుల్లో చిగురించిన కొత్త ఆశలు

న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కం నేరమంటూ సుప్రీంకోర్టు గత ఏడాది ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ గే హక్కుల కార్యకర్తలు దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్లను బహిరంగ కోర్టులో విచారించేందుకు సుప్రీం కోర్టు ఈ రోజు అంగీకరించింది. దీనిని వచ్చేవారం చేపట్టే విచారణల జాబితాలో చేర్చాలని పేర్కొంటూ  సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పి.సదాశివం నేతృత్వంలోని నలుగురు సభ్యుల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

దీంతో గే సెక్స్ నేరమంటూ ఇచ్చిన తీర్పును కోర్టు సవరించుకోవచ్చని భావిస్తున్న ఎల్‌జీబీటీ(లెస్బియన్, గే, బెసైక్సువల్, ట్రాన్స్‌జెండర్) వర్గాల్లో కొత్త ఆశలు చిగురించాయి. గే సెక్స్ నేరమని, అందుకు జీవిత ఖైదు వరకూ శిక్ష విధించవచ్చని పేర్కొనే ఐపీసీ సెక్షన్ 377(అసహజ శృంగార నేరాలు) చట్టబద్ధతను సమర్థిస్తూ గత ఏడాది డిసెంబరు 11న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.  ఈ తీర్పును సవాల్ చేస్తూ నాజ్ ఫౌండేషన్, ప్రముఖ సినీ దర్శకుడు శ్యాం బెనెగల్, గే హక్కుల కార్యకర్తలు సుప్రీంలో క్యూరేటివ్ పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్లను ఓపెన్ కోర్టులో విచారించాలంటూ పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు కోరగా వారి విజ్ఞప్తిని పరిశీలిస్తామని సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. బహిరంగ కోర్టులో విచారించేందుకు సుప్రీం కోర్టు ఈ రోజు ఆమోదించింది.

  కోర్టు తీర్పులపై అప్పీళ్లలో క్యూరేటివ్ పిటిషన్ వేయడం అనేది న్యాయపరంగా ఆఖరి ప్రక్రియ. సాధారణంగా క్యూరేటివ్ పిటిషన్లపై ఎలాంటి వాదనలకూ అవకాశం ఇవ్వకుండా న్యాయమూర్తులు ఇన్-చాంబర్ కోర్టులోనే పిటిషన్లను విచారిస్తారు. అరుదైన సందర్భాల్లో మాత్రమే ఇలా బహిరంగ కోర్టులో విచారించేందుకు అంగీకరిస్తారు.

మరిన్ని వార్తలు