కౌన్‌ బనేగా యూపీ సీఎం!

18 Mar, 2017 10:14 IST|Sakshi
కౌన్‌ బనేగా యూపీ సీఎం!
  • రేసులో ముగ్గురి పేర్లు
  • పూజలు చేసిన మనోజ్‌ సిన్హా
  • మీడియా కథనాలు అవాస్తవమన్న వెంకయ్య

  • న్యూఢిల్లీ/లక్నో: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉంది. ఈ రోజు (శనివారం) సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి ఎవరు తేలిపోనుందని.. బీజేపీ స్పష్టం చేసినప్పటికీ.. రేసులో పలువురి పేర్లు వినిపిస్తుండటంతో ఎవరు సీఎం అవుతారన్నది ఇంకా స్పష్టత రాలేదు.  కేంద్రమంత్రులు రాజ్‌నాథ్, మనోజ్‌ సిన్హా, బీజేపీ యూపీ అధ్యక్షుడు కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య, ఎంపీ యోగి ఆదిత్యానాథ్‌ పేర్లు సీఎం రేసులో ప్రధానంగా వినబడుతున్నా.. పూర్తిగా కొత్త పేరు కూడా తుదిదశలో తెరపైకి రావొచ్చునని పార్టీ వర్గాలు అంటున్నాయి. లక్నోలో శనివారం సాయంత్రం 4 గంటలకు కేంద్ర పరిశీలకులు వెంకయ్య, భూపీంద్ర సింగ్‌ సమక్షంలో భేటీ అవ్వనున్న పార్టీ ఎమ్మెల్యేలు సీఎంను నిర్ణయిస్తారని మౌర్య స్పష్టం చేశారు.  మార్చి 19న (ఆదివారం) పార్టీ జాతీయ నాయకుల సమక్షంలో సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందన్నారు.

    మనోజ్‌ సిన్హా పూజలు!
    యూపీ సీఎం రేసులో ముందంజలో ఉన్నట్టు భావిస్తున్న సీనియర్‌ నేత, కేంద్రమంత్రి మనోజ్‌ సిన్హా శనివారం కాల భైరవ, కాశీ విశ్వనాథ ఆలయాలను దర్శించుకొని ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం గమనార్హం. ఇప్పటికే సీఎం రేసు నుంచి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ తప్పుకున్నారని, మౌర్య కూడా రేసులో ప్రధానంగా లేరని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో మచ్చలేని వ్యక్తిత్వం, పాలన అనుభవం గల నేతగా పేరొందిన సిన్హాకు యూపీ అందలం దక్కవచ్చునని భావిస్తున్నారు. మరోవైపు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు శనివారం స్పందిస్తూ.. ఈ రోజు సాయంత్రం యూపీ బీజేపీ ఎమ్మెల్యేలు సీఎం ఎన్నుకుంటారని చెప్పారు. సీఎం రేసులో పలువురు ఉన్నారంటూ మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవాలని ఆయన కొట్టిపారేశారు.