కొత్త జిక్సర్ వచ్చేసింది

8 Apr, 2015 00:36 IST|Sakshi
కొత్త జిక్సర్ వచ్చేసింది

ధర రూ.83,439
 జూన్‌లో రెండు సూపర్ బైక్‌లు
 సుజుకీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ గుప్తా

 
 న్యూఢిల్లీ: సుజుకీ మోటార్ సైకిల్ ఇండియా కంపెనీ జిక్సర్ బైక్‌లో కొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఈ కొత్త వేరియంట్, జిక్సర్ ఎస్‌ఎఫ్ బైక్ ధర రూ.83,439(ఎక్స్ షోరూమ్, న్యూఢిల్లీ)గా నిర్ణయించామని సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ గుప్తా చెప్పారు.  ఈ కొత్త వేరియంట్ కూడా యువ వినియోగదారులను ఆకట్టుకోగలదని ఆశిస్తున్నామని చెప్పారు. గత ఏడాది అక్టోబర్‌లో జిక్సర్ మోడల్‌ను మార్కెట్లోకి తెచ్చామని, నెలకు 8,000 వరకూ విక్రయిస్తున్నామని వివరించారు.
 
 జూన్‌లో సూపర్ బైక్‌లు: 150 సీసీ, అంతకు మించిన ఇంజిన్ సామర్థ్యం ఉన్న బైక్‌లపై దృష్టి సారిస్తున్నామని అతుల్ గుప్తా చెప్పారు.  ఈ ఏడాది జూన్‌లో 800 సీసీ బైక్‌లు ఎస్1000, ఎస్1000 ఎఫ్‌లను మార్కెట్లోకి తేవాలని యోచిస్తున్నామని పేర్కొన్నారు. ప్రపంచ మార్కెట్లో, ఇక్కడా వాటిని ఒకేసారి అందిస్తామని చెప్పారు.  గత ఆర్థిక సంవత్సరంలో  హయబూసా, జీఎస్‌ఎక్స్-ఆర్ వంటి సూపర్ బైక్‌లను 280 వరకూ విక్రయించామని, ఈ ఆర్థిక సంవత్సరంలో 400 బైక్‌లు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. మాస్ సెగ్మెంట్ బైక్‌ల్లో తీవ్రమైన పోటీ ఉందని, ఈ సెగ్మెంట్ మోటార్‌సైకిల్ హయతెను కొనసాగిస్తామని వివరించారు.
 
 ఎదురు గాలిని తట్టుకునేలా..

 జిక్సర్ ఎస్‌ఎఫ్‌బైక్ నడిపే వ్యక్తికి ఎదురు గాలి నుంచి సాధ్యమైనంతగా రక్షణ నిచ్చేలా ఫుల్ ఫెయిరింగ్ ఫీచర్‌తో ఈ బైక్ సిద్ధమైంది. ముందు వైపు ఫెయిరింగ్ మినహా మిగిలిన అన్ని అంశాల్లో ఈ కొత్త వేరియంట్ జిక్సర్‌ను పోలి ఉంది. ఈ బైక్‌లో ఐదు గేర్లు, ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్, క్లియర్‌లెన్స్ ఇండికేటర్లు, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్,  ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్క్‌లు, వెనక వైపు 7 స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ తదితర ఫీచర్లున్నాయి.. నలుపు, తెలుపు, నీలం మూడు రంగుల్లో ఈ బైక్ లభ్యమవుతుంది. దేశంలో అత్యంత చౌకగా లభించే పూర్తి ఫెయిర్డ్ మోటార్ సైకిల్ ఇదే అవుతుంది. ఫెయిరింగ్ బైక్ అంటే.. ఇంజిన్ ఉన్న ఫ్రేమ్‌ను కప్పి ఉంచేలా డిజైన్ చేసిన బైక్. గాలి ఒత్తిడిని తట్టుకోవడం దీని ఉద్దేశం.
 

మరిన్ని వార్తలు