చైనా వస్తువుల్ని బహిష్కరించండి

31 Oct, 2016 20:07 IST|Sakshi
చైనా వస్తువుల్ని బహిష్కరించండి

వారణాశి: చైనాలో తయారైన వస్తువుల్ని బహిష్కరించాలని ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ డిమాండ్‌ చేసింది.  చైనా నుంచి చౌకైన వస్తువుల దిగుమతి వల్ల భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోందని స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ జాతీయ కో కన్వీనర్‌ కశ్మీరీ లాల్‌ చెప్పారు. చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై కేంద్ర ప్రభుత్వం పన్నులు పెంచాలని డిమాండ్‌ చేశారు.

చైనా వస్తువుల్ని దేశంలో అక్రమంగా అమ‍్ముతున్నారని ఆరోపించారు. పాకిస్థాన్‌కు చైనా గట్టి మద్దతుదారని, సర్జికల్‌ దాడుల తర్వాత ప్రపంచ దేశాలు భారత్‌కు మద్దతుగా నిలిస్తే చైనా మాత్రం పాక్‌కే అండగా నిలిచిందని చెప్పారు. చైనా వస్తువులను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించరాదని కోరారు. చైనా వస్తువులపై పన్నులు పెంచడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని కశ్మీరీ లాల్‌ చెప్పారు. చైనా 17 బ్రాండ్ల మొబైల్‌ ఫోన్లను విడుదల చేయడం వల్ల భారత మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తుల తయారీ మార్కెట్‌పై దృష్టిపెంచి ఎగుమతులను ప్రోత్సహిస్తే, ఈ రంగంలో చైనాను భారత్‌ అధిగమిస్తుందని సూచించారు.

మరిన్ని వార్తలు