నేడు గవర్నర్ను కలవనున్న టీ సీఎల్పీ నేతలు

5 Sep, 2015 10:20 IST|Sakshi

హైదరాబాద్ : మహబూబ్నగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్రెడ్డిపై అధికార పార్టీ ఎమ్మెల్యే బాలరాజు దాడి అంశాన్ని టీ కాంగ్రెస్ సీరియస్గా తీసుకుంది. ఈ అంశంపై శనివారం మధ్యాహ్నం 2.00 గంటలకు గాంధీభవన్లో టి. కాంగ్రెస్ శాసనసభాపక్షం భేటీ కానుంది. అనంతరం టి.కాంగ్రెస్ నేతలు రాజభవన్కు చేరుకుని.... చిట్టెంపై దాడి చేసిన అధికార పార్టీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై చర్యలు తీసుకోవాలని గవర్నర్కు వారు వినతిపత్రం అందజేయనున్నారు.

శుక్రవారం ఉదయం 11.30కు జెడ్పీ సమావేశం ప్రారంభం కాగానే జిల్లాలో కరువుపై చర్చకు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ సభ్యులు పట్టుపట్టారు. పాలమూరును కరువు జిల్లాగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. అందుకు అంగీకరించిన జెడ్పీ చైర్మన్ భాస్కర్, మంత్రి జూపల్లి తొలుత చర్చించి, తర్వాత తీర్మానం చేద్దామన్నారు. నారాయణపేట టీడీపీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడబోతుండగా టీఆర్‌ఎస్ సభ్యులు అడ్డుకున్నారు. పాలమూరు ఎత్తిపోతలను నిలిపేయాలంటూ చంద్రబాబు రాసిన లేఖను ఉపసంహరించుకునేదాకా టీడీపీ సభ్యులకు మాట్లాడే హక్కు లేదంటూ వారు ఆందోళన చేశారు. దీంతో చైర్మన్ భోజన విరామం ప్రకటించారు.

తర్వాత తిరిగి సమావేశం మొదలవగానే గువ్వల బాలరాజు మాట్లాడారు. తెలంగాణ తెచ్చుకోవడానికి కారణమైన పరిస్థితులను వివరిస్తూ
జిల్లాకు చెందిన కాంగ్రెస్ శాసన సభ్యులు కొందరిపై, మాజీ మంత్రి డీకే అరుణ, వారి కుటుంబ సభ్యులపై విమర్శల వర్షం కురిపించారు. దళితులను మాజీ మంత్రి డీకే అరుణ పట్టించుకోరని జెడ్పీ చైర్మన్ సైతం వ్యాఖ్యానించారు. దాంతో తీవ్ర గందరగోళం చెలరేగింది. ఆ సమయంలో అక్కడే ఉన్న డీకే సోదరుడైన ఎమ్మెల్యే చిట్టెం పోడియం వద్దకు దూసుకెళ్లారు. బాల్‌రాజ్ అసందర్భ ప్రసంగాన్ని ఎలా అనుమతిస్తారంటూ మంత్రులు జూపల్లి, లక్ష్మారెడ్డిలతో వాగ్వాదానికి దిగారు.

బాల్‌రాజ్ సైతం పోడియం దగ్గరకు చేరుకున్నారు. ఇరువురూ వ్యక్తిగత దూషణలకు దిగారు. బాల్‌రాజు ఆవేశంతో చిట్టెం చెంపపై కొట్టారు. దాంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు పోడియం ముందు బైఠాయించారు. చిట్టెం తనను దూషించారని, దాడికి పాల్పడటంతో తన పెదవికి గాయమైందని చెబుతూ బాల్‌రాజు కూడా టీఆర్‌ఎస్ సభ్యులతో కలసి బైఠాయించారు. దీంతో సమావేశం రసాభాసగా మారింది. అనంతరం చిట్టెం రాంమోహన్రెడ్డి... గువ్వల బాలరాజు వేర్వేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఈ దాడి నేపథ్యంలో శనివారం మహబూబ్ నగర్ జిల్లా బంద్ కు కాంగ్రెస్ పిలుపు నిచ్చింది.

మరిన్ని వార్తలు