రాజధానికి నిధులపై స్పష్టత ఇవ్వాలి

5 Mar, 2014 22:48 IST|Sakshi
రాజధానికి నిధులపై స్పష్టత ఇవ్వాలి
సాక్షి, న్యూఢిల్లీ: సీమాంధ్రలో కొత్త రాజధాని ఏర్పాటుకు నిధులు ఎప్పుడిస్తారు? ఎన్ని నిధులిస్తారన్న అంశాలపై స్పష్టత ఇవ్వాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్‌సింగ్ అహ్లువాలియాను కోరినట్లు రాజ్యసభ సభ్యుడు సుబ్బిరామిరెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి రాజ్యసభలో ప్రకటించినట్లుగా.. సీమాంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తితోపాటు అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, ఆల్ ఇండియా మెడి కల్ ఇనిస్టిట్యూట్, ఐఐటీలు, నూతన విశ్వవిద్యాలయాల నిర్మాణానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కోరుతూ ఆయనకు వినతి పత్రం ఇచ్చినట్టు చెప్పారు.

ఇదే అంశాన్ని కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ దృష్టికి తీసుకెళ్లానని పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలో దిగ్విజయ్‌తో భేటీ అనంతరం సుబ్బిరామిరెడ్డి మీడియాతో మాట్లాడారు. సీమాంధ్ర రాజధాని ఏర్పాటుకు నిధులతో పాటు పార్టీపరమైన అంశాలపై దిగ్విజయ్‌తో చర్చించానన్నారు. రాజధానికి నిధులిచ్చే అంశంపై మరో రెండు రోజుల్లో దిగ్విజయ్‌తో కలిసి ప్రధానితో చర్చించేందుకు వెళ్లనున్నట్టు చెప్పారు.

రెండు రాష్ట్రాలు ఏర్పడనున్న నేపథ్యంలో రెండు పీసీసీలు ఏర్పాటు చేయాలా? ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు బొత్స కోఆర్డినేటర్‌గా.. రెండు ప్రాంతాల్లో రీజనల్ కమిటీలు వేయాలా? అన్నదానిపై పార్టీ అధిష్టానం ఆలోచిస్తోందని వెల్లడించారు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైనందున త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీకి దిగడం లేదన్నారు. అయితే, ఇప్పటికీ విశాఖ నుంచి పోటీచేస్తే తాను కచ్చితంగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. 
మరిన్ని వార్తలు