మార్చి16న ఆ ప్రభుత్వ తొలి బడ్జెట్

8 Mar, 2017 13:28 IST|Sakshi
మార్చి16న ఆ ప్రభుత్వ తొలి బడ్జెట్
జయలలిత మరణం అనంతరం ఏర్పడిన రాజకీయ పరిణామాలతో అట్టుడికిన తమిళనాడులో ఇటీవలే  ఓ కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. శశికళ వర్గానికి చెందిన పళనిస్వామి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. కొత్తగా పదవిలోకి వచ్చిన ఈ ప్రభుత్వం  మార్చి 16న తమ తొలి బడ్జెట్ తో అసెంబ్లీ ముందుకు రాబోతుంది. మార్చి 16న పళనిస్వామి ప్రభుత్వం తొలి బడ్జెట్ తమిళనాడు అసెంబ్లీ ముందుకు రాబోతుందని అధికారిక ప్రకటన వెలువడింది. మార్చి16న 10.30 గంటలకు సమావేశమవ్వాలని లెజిస్లేటివ్ అసెంబ్లీకి స్పీకర్ ధనపాల్ సమన్లు పంపారు.
 
ఆర్థికమంత్రి డీ జయకుమార్ పళనిస్వామి ప్రభుత్వంలో తన తొలి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. గత నెల 18న అసెంబ్లీలో చోటుచేసుకున్న తీవ్ర ఆందోళనకర పరిస్థితుల్లో పళనిస్వామి ప్రభుత్వం విశ్వాసపరీక్షలో నెగ్గిన సంగతి తెలిసిందే. ఈ విశ్వాస పరీక్షను ప్రతిపక్షం డీఎంకే తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పళనిస్వామి ప్రభుత్వాన్ని ఎలాగైనా పదవిలో నుంచి దింపేందుకు బడ్జెట్ సమావేశాలను ఓ పావుగా వాడుకునేందుకు సిద్ధమవుతోంది.  
 
మరిన్ని వార్తలు