నిర్లక్ష్యం వల్లే పడవ ప్రమాదాలు: రోశయ్య

27 Jan, 2014 15:01 IST|Sakshi

చెన్నయ్: అండమాన్ దీవుల్లో బోటు ప్రమాదంలో 21 మంది మరణించిన సంఘటనపై తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య తీవ్రంగా స్పందించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  ప్రమాదానికి టూరిస్ట్ ఆపరేటర్, బోట్ నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమని అన్నారు. కొందరు ఆపరేటర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు రోశయ్య సంతాపం తెలియజేశారు.  అండమాన్ బోటు ప్రమాదంలో 21 మంది చనిపోగా, మరొకరి జాడ తెలియరాలేదు. 28 మంది ఇప్పటికీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు జరగకుండా తగిన భద్రత చర్యలు తీసుకుంటారని రోశయ్య చెప్పారు. ఆదివారం పోర్ట్ బ్లెయిర్ సమీపంలో టూరిస్టులతో వెళ్తున్న పడవ ప్రమాదానికి గురైంది. పడవ సామర్థ్యానికి మించి 50 మంది ప్రయాణికులను ఎక్కించుకున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది తమిళనాడు రాష్ట్రం కాంచీపురం జిల్లాకు చెందినవారు. ఈ దుర్ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ప్రగాఢ సంతాపం తెలియజేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయిల నష్టపరిహారం ప్రకటించారు.
 

మరిన్ని వార్తలు