'జల్లికట్టు' ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం

21 Jan, 2017 19:27 IST|Sakshi
'జల్లికట్టు' ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం

చెన్నై: సంప్రదాయ జల్లికట్టు క్రీడపై సుప్రీంకోర్టు విధించిన నిషేధాన్ని నిలిపివేసేలా రూపొందించిన ఆర్డినెన్స్కు తమిళనాడు ఇన్‌చార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు శనివారం ఆమోదం తెలిపారు. జల్లికట్టును పునరుద్ధరించాలంటూ గడిచిన ఐదు రోజులుగా తమిళనాడు వ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనల నేపథ్యంలో దిగివచ్చిన కేంద్రప్రభుత్వం.. శుక్రవారమే ఈ ఆర్డినెన్స్‌కు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. తమిళనాడు ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్‌ ముసాయిదాలో కొద్దిపాటి మార్పులుచేసి కేంద్ర హోం, న్యాయ, పర్యావరణ మంత్రిత్వ శాఖలు ఆమోదించాయి. అనంతరం ఆ ఆర్డినెన్స్ను తిరిగి రాష్ట్రానికి పంపారు.
 
ఈ ఆర్డినెన్స్‌ ద్వారా జంతుహింస నిరోధక చట్టాన్ని సవరించి, అందులోని ‘ప్రదర్శన జంతువులు(పర్‌ఫామింగ్‌ యానిమల్స్‌)' జాబితా నుంచి ఎద్దులను తొలగిస్తారు. ఈ ఆర్డినెన్స్ను జనవరి 23 నుంచి జరుగబోయే తొలి అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. సీఎం పన్నీర్ సెల్వం అళంగనలూర్లో ఈ ఆటను రేపు ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నారు. అదేవిధంగా రాష్ట్ర మంత్రులు కూడా వారి సంబంధిత జిల్లాలో జల్లికట్టు ఆటకు స్వీకారం చుట్టనున్నారు. సీఎం పన్నీర్‌ సెల్వం పలు మార్లు విజ్ఞప్తి చేసినా వెనక్కి తగ్గని నిరసనకారులు.. ఆర్డినెన్స్‌కు ఆమోదం లభించడంతో ఆందోళనలు విరమించే అవకాశంఉంది. (ఆర్డినెన్సుపై అనుమానాలు.. ఆగని నిరసనలు)

మరిన్ని వార్తలు