ఆ పులికి స్పెషల్‌ క్లాసులు ఎందుకో తెలుసా?

22 Oct, 2016 19:49 IST|Sakshi
ఆ పులికి స్పెషల్‌ క్లాసులు ఎందుకో తెలుసా?

అది తమిళ పులి.. పేరు రామ. ఉండేది చెన్నై వండలూరు జూపార్క్‌. కానీ దానిని ఇటీవల రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్‌పూర్ జూపార్కుకు తరలించారు. కానీ, పుట్టకతో తమిళం మాత్రమే తెలిసిన ఈ పులికి ఒక్కసారిగా ఉత్తరాదికి వెళ్లడంతో కొత్తగా భాషతో చిక్కొచ్చిపడింది. స్థానిక హిందీ అర్థం కాక .. ఆ హిందీలో ఆదేశాలిస్తే గ్రాండించి గుర్రున చూస్తున్న ఆ పులి తాజాగా స్పెషల్‌ క్లాసులు పెట్టి మరీ హిందీని నేర్పిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్‌పూర్‌లోని సజ్జన్‌ఘర్ జూపార్కులో 'ధామిని' అనే ఆడ తెల్లపులి ఉంది. అది ఈ మధ్య ఈడుకొచ్చింది. దానికి సరైన మగ జోడీ కోసం దేశంలోని అన్ని జూపార్కులను అన్వేషించిన అధికారులు.. చివరకు చెన్నై వండలూరు జూపార్కులో ఉన్న 'రామ' అనే మగపులిని గుర్తించారు. జంతుమార్పిడి విధానం కింద ఉదయ్‌పూర్ జూ అధికారులు తెల్ల మగపులిని స్వీకరించి ఇందుకు బదులుగా రెండు నక్కలను వండలూరు జూపార్కుకు అందించారు. అయితే, 2011లో వండలూరు జూలో జన్మించిన 'రామ' పులి తమిళం మాత్రమే అర్థం చేసుకుంటుంది.  ‘ఇంగెవా...అంగెపో’ (ఇక్కడికి రా...అక్కడికి పో) అనే తమిళ మాటలే దానికి తెలుసు. అలాంటి 'పులిరాజ'కు ఒక్కసారిగా ‘యహా ఆవో... వహా జావో’ అంటూ హిందీలో ఆదేశాలు ఇస్తే ఎలా ఉంటుంది. ఒళ్లు మండుకొస్తుంది. అందుకే సజ్జన్‌గార్ జూపార్కు సిబ్బంది హిందీలోనూ, స్థానిక భాషలోనూ ఆదేశాలిస్తే వారిని 'రామ' గుర్రున చూస్తోంది. వారి గుండెలదిరేలా గాండ్రిస్తోంది. ఇక దీంతో వేగలేమని భావించిన జూపార్కు సిబ్బంది.. చెన్నై వండలూరు జూపార్కు అధికారులకు మొరపెట్టుకున్నారు.

దీంతో వండలూరు జూపార్క్‌కు చెందిన శిక్షకుడు సెల్లయ్య ప్రత్యేకంగా ఉదయ్‌పూర్‌కు పంపించారు. ఇది చిన్నపిల్లగా ఉన్ననాటి నుంచి దాని పెంపకం బాధ్యతను సెల్లయ్యనే చూశారు. ‘వా’ (ఇటురా), ‘పో’ (అటు వెళ్లు) వంటి తమిళ మాటలకు అది అలవాటుపడేలా  చేశారు. ప్రస్తుతం ఉదయపూర్‌లో ఉన్న సెల్లయ్య అక్కడి సిబ్బంది సహకారంతో రామకు ‘ఆవో.. జావో’ వంటి మాటల్ని నేర్పించే పనిలో నిమగ్నమయ్యారు. మొదట తమిళంలో ఆదేశాలిస్తూనే.. ఆ తర్వాత హిందీ ఆదేశాలను దానికి ఒంటబట్టిస్తున్నారు.

మరిన్ని వార్తలు