30 ఏళ్ల క్రితం కూడా.. తమిళనాట ఓ బలపరీక్ష

18 Feb, 2017 10:54 IST|Sakshi
30 ఏళ్ల క్రితం కూడా.. తమిళనాట ఓ బలపరీక్ష
తమిళనాడు అసెంబ్లీలో దాదాపు 30 ఏళ్ల తర్వాత మరోసారి బలపరీక్ష జరుగుతోంది. ఇంతకుముందు ఎంజీ రామచంద్రన్ మరణించిన తర్వాత ఆయన భార్య జానకీ రామచంద్రన్, వీఆర్ నెడుంజెళియన్ నేతృత్వంలోని జయలలిత వర్గాల మధ్య పోటీ ఫలితంగా 1988 జనవరి 27వ తేదీన విశ్వాస పరీక్ష నిర్వహించాల్సి వచ్చింది. అప్పుడు అసెంబ్లీలో తీవ్ర ఘర్షణ వాతావరణం ఏర్పడి, అసెంబ్లీలో కొట్టుకుంటున్న సభ్యులను నియంత్రించేందుకు తొలిసారి సభలోకి పోలీసులను కూడా పిలవాల్సి వచ్చింది. అప్పట్లో నెడుంజెళియన్ పోషించిన పాత్రను ఇప్పుడు ఓ పన్నీర్ సెల్వం పోషిస్తున్నారు. ఇప్పుడు బలపరీక్ష విషయంలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయోనన్న ఆసక్తి అన్ని వర్గాల్లో నెలకొంది. 
 
ఇక 2006 సంవత్సరంలో డీఎంకేకు పూర్తి మెజారిటీ రాలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం 96 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. అయితే 34 సీట్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ.. ఐదేళ్ల పాటు బయటి నుంచి మద్దతిచ్చింది. కేంద్రంలో కాంగ్రెస్ అప్పట్లో అధికారంలో ఉండటంతో తమిళనాడులోనూ పట్టు ఉండాలని అలా చేసింది. కాంగ్రెస్ మద్దతు ఉందన్న విషయం స్పష్టం కావడంతో అప్పట్లో డీఎంకేను బలం నిరూపించుకోవాలని గవర్నర్ అడగలేదు.
 
1988లో ఏం జరిగింది...
అప్పట్లో తమిళనాడు అసెంబ్లీలో  బలపరీక్ష సందర్భంగా స్పీకర్ పీహెచ్ పాండియన్ చాలామంది ప్రతిపక్ష సభ్యులపై ఓటింగ్ ప్రారంభం కావడానికి ముందు అనర్హత వేటు వేశారు. కొంతమంది ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారు. చివరకు జానకీ రామచంద్రన్ విశ్వాస పరీక్షలో నెగ్గినట్లు ప్రకటించారు. దాంతో రాష్ట్రంలో తీవ్రస్థాయిలో హింసాకాండ చెలరేగింది. చివరకు ఆర్టికల్ 356ను ప్రయోగించి, జానకీ రామచంద్రన్ ప్రభుత్వాన్ని దించేశారు. 1989లో మళ్లీ ఎన్నికలు నిర్వహించగా, డీఎంకే సంపూర్ణ మెజారిటీతో విజయం సాధించింది. 13 ఏళ్ల తర్వాత కరుణానిధి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు.
మరిన్ని వార్తలు