అమ్మకు భారతరత్న ఇ‍వ్వాలని తీర్మానం

12 Dec, 2016 14:28 IST|Sakshi
అమ్మకు భారతరత్న ఇ‍వ్వాలని తీర్మానం
చెన్నై : తమిళనాట రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా అవతరించి, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన దివంగత ముఖ్యమంత్రి జయలలితకు భారతరత్న ఇ‍వ్వాలని కేంద్రప్రభుత్వానికి ప్రతిపాదిస్తూ ఆ రాష్ట్ర కేబినెట్ ఓ తీర్మానాన్ని పాస్ చేసింది.. ఈ తీర్మానంతో పాటు రూ.15 కోట్లతో అమ్మ స్మారకమందిరాన్ని నిర్మించాలనే తీర్మానాన్ని కూడా కేబినెట్ ఆమోదించింది. అమ్మ మరణాంతరం తొలిసారి భేటీ అయిన కొత్త కేబినెట్ ఆ మేరకు నిర్ణయాలు తీసుకుంది. పార్లమెంట్ క్యాంపస్ లోపల కూడా అమ్మ కాంస్య విగ్రహాన్ని కేంద్రప్రభుత్వం ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించింది. మెరీనా బీచ్లో నిర్మించిన ఎంజీఆర్ మెమోరియల్ పేరును భారతరత్న డాక్టర్ ఎంజీఆర్గా మార్చనున్నట్టు కేబినెట్ తెలిపింది.
 
అక్కడే జయలలిత మెమోరియల్ను నిర్మించనున్నట్టు పేర్కొంది. కోలుకుంటుదన్న అమ్మ డిసెంబర్ 5న అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్ట్కు గురికావడం, అనంతరం తీవ్ర అస్వస్థతకు గురై డిసెంబర్ 6న అసువులు బాసిన సంగతి తెలిసిందే. అమ్మ మరణాంతరం వెంటనే తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 31 మంది కొత్త మంత్రులచే కూడా ఆ రాష్ట్ర తాత్కాలిక గవర్నర్ విద్యాసాగర్ రావు ప్రమాణం చేపించారు. పన్నీర్ సెల్వం నేతృత్వంలో తొలిసారి కేబినెట్ శనివారం సచివాలయంలో భేటీ అయింది. ఈ భేటీలో అమ్మ జయలలితకు మంత్రులు శ్రద్ధాంజలి ఘటించి, ఈ మేరకు తీర్మానాలు ఆమోదించారు.  
మరిన్ని వార్తలు