పళనిస్వామికే చాన్స్.. గవర్నర్ పిలుపు!

16 Feb, 2017 11:28 IST|Sakshi
పళనిస్వామికే చాన్స్.. గవర్నర్ పిలుపు!
తమిళ రాజకీయాలు ఒక్కసారిగా మలుపు తిరిగాయి. రాజ్‌భవన్‌కు రావాల్సిందిగా శశికళ వర్గీయుడైన మంత్రి ఎడపాడి పళనిస్వామికి పిలుపు వచ్చింది. ఉదయం 12.30 గంటలకు ఆయనకు గవర్నర్ అపాయింట్‌మెంట్ ఇచ్చారు. దాంతో ఒక్కసారిగా శశికళ వర్గంలో సంబరాలు మొదలయ్యాయి. పళని స్వామి, సెంగొట్టయాన్తో పాటు మరో నలుగురు నేతలు రాజ్‌భవన్‌కు బయల్దేరి వెళ్తున్నారు. గవర్నర్ అవకాశం ఇస్తే తాము ఈరోజే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇదే జరిగితే శశికళ జైలుకు వెళ్లినా, ఆమె జేబులోని మనిషి అయిన పళని స్వామే ముఖ్యమంత్రి అవుతారంటే.. పరోక్షంగా శశికళ వర్గం తన పట్టు నిరూపించుకున్నట్లు అవుతుంది. అయితే, అసలు గవర్నర్ పిలిచింది ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించేందుకేనా కాదా అనే విషయం మాత్రం ఇంకా ఖరారు కాలేదు. గవర్నర్‌ను కలిసి వచ్చిన తర్వాత వాళ్లు చెబితే తప్ప అధికారికంగా ఏ విషయమూ చెప్పలేని పరిస్థితి ఉంది. బుధవారం కూడా పళనిస్వామిని, పన్నీర్ సెల్వాన్ని గవర్నర్ పిలిచి మాట్లాడారు. దాంతో ఇప్పుడు నేరుగా పళనిస్వామికి చాన్స్ ఇచ్చారా లేదా అన్న విషయం పూర్తిగా నిర్ధారణ కాలేదనే చెప్పాలి.  ఇక తమకు 124 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని పళనిస్వామి వర్గం చెబుతోంది. అన్నాడీఎంకేకు అసెంబ్లీలో మొత్తం 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్లలో 120 మంది వరకు ప్రస్తుతం గోల్డెన్ బే రిసార్టులో ఉన్నట్లు తెలుస్తోంది. 
 
మరోవైపు పళనిస్వామికి పిలుపు రావడంతో పన్నీర్ సెల్వం వర్గం తీవ్ర ఆందోళనతో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. ఒకవేళ ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినా, అసెంబ్లీలో బల నిరూపణ సమయానికి తాము బలం పుంజుకోవచ్చని, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 117 మంది ఎమ్మెల్యేల మద్దతు ఎట్టి పరిస్థితుల్లోనూ పళనిస్వామికి ఉండదని పన్నీర్ వర్గం ధీమా వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే పన్నీర్ సెల్వం వద్ద కనీసం 17-20 మంది వరకు ఎమ్మెల్యేలు ఉన్నట్లు చెబుతున్నారు. ఇది నిజం అయితే మాత్రం పళని స్వామి అసెంబ్లీలో తన బలం నిరూపించుకోవడం కష్టమే అవుతుంది. ప్రజల మద్దతు తనకు స్పష్టంగా ఉన్నందున కాంపోజిట్ ఫ్లోర్ టెస్టు పెట్టాలని, అది జరిగితే ఎవరికి ఎంతమంది మద్దతుందో స్పష్టంగా తేలిపోతుందని పన్నీర్ వర్గం అంటోంది. 
 
మరోవైపు అసలు పళనిస్వామిని ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకే పిలిచారా, లేక కాంపోజిట్ ఫ్లోర్ టెస్టు నిర్వహిస్తారా అన్న విషయం మాత్రం ఇంకా స్పష్టం కాలేదు. సాధారణంగా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వ్యక్తికి బలం నిరూపించుకోడానికి కొంత సమయం ఉంటుంది. కానీ శశికళ వర్గం మాత్రం వెంటనే బల నిరూపణ చేసుకోవడానికే మొగ్గు చూపుతోంది.

తమిళనాడు రాజకీయ పరిణామాలు చదవండి

నేలపైనే చిన్నమ్మ నిద్ర.. రోజుకు రూ. 50 జీతం
శశికళ జైలు జీవితం ఎలా ఉంటుందంటే..
‘అమ్మ’ సమాధిపై శశికళ శపథం
లొంగిపోయిన చిన్నమ్మ
వీడని ఉత్కంఠ
ఇక అమ్మ ఫొటో కనిపించదా
పన్నీర్‌ శిబిరంలో పదవుల ఆశ
ఆచితూచి అడుగులు
మద్దతు కాదు కృతజ్ఞతే!