యువతిని వివస్త్రను చేయలేదు

5 Feb, 2016 01:17 IST|Sakshi
యువతిని వివస్త్రను చేయలేదు

బెంగళూరు ఘటనపై వివరణ ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వం
* ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడి
* నివేదిక సమర్పించాలని కోరిన కేంద్రం

బెంగళూరు/న్యూఢిల్లీ: టాంజానియా యువతిని నడి రోడ్డుపై వివస్త్రను  చేసి భౌతిక దాడికి పాల్పడిన ఘటనతో సంబంధం ఉన్న ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది.  ఆదివారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన దౌత్యపర వివాదంగా మారింది. ‘ఆ ఘటనతో సంబంధం ఉన్న ఐదుగురు అరెస్టయ్యారు. దీనిపై కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్  నాతో మాట్లాడారు. ఘటనపై కేంద్రానికి నివేదిక పంపిస్తాం’ అని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చెప్పారు.

కాగా, యువతిని వివస్త్రను చేసినట్లు వస్తున్న వార్తలను కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర ఖండించారు. ఘటనకు గల కారణాలు, తీసుకున్న చర్యలు, బాధితురాలిని కాపాడేందుకు తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాల్సిందిగా కర్ణాటకను  కేంద్ర హోం శాఖ సూచించింది. కారకులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రాన్ని ఢిల్లీలో టాంజానియా హైకమిషనర్ జాన్ కిజాజీ కోరారు. కాగా, జాన్ కిజాజీతో కూడిన బృందం శుక్రవారం బెంగళూరుకు వెళ్లనున్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి  తెలిపారు.
 
సిద్ధరామయ్యను వివరణ కోరిన రాహుల్
యువతిపై జరిగిన దాడి ఘటనపై  సమగ్ర నివేదిక సమర్పించాలని సీఎం సిద్ధరామయ్యను  పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కోరారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా రాహుల్ గాంధీ కోరినట్లు పార్టీ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్‌సింగ్  తెలిపారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, నిందితుల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలని దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు.
 
రాహుల్‌ను టార్గెట్ చేసిన బీజేపీ
టాంజానియా యువతిపై జరిగిన దాడి ఘటనకు బాధ్యులైన వారిపై ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై కాంగ్రెస్‌ను బీజేపీ దుయ్యబట్టింది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడింది. ఈ ఘటనపై రాహుల్ గాంధీ ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించింది. కాంగ్రెస్ ప్రభుత్వం బెంగళూరు నగరానికి అపకీర్తి తెచ్చిందని పేర్కొంది. కర్ణాటక డీజీపీని వెంటనే బదిలీ చేయాలని, సంబంధిత పోలీసు అధికారులను సస్సెండ్ చేయాలని కేంద్ర మంత్రి ముక్తర్ అబ్బాస్ నఖ్వీ డిమాండ్ చేశారు.

>
మరిన్ని వార్తలు