నేను ఎలాంటి తప్పు చేయలేదు...

14 Jul, 2017 17:06 IST|Sakshi
నేను ఎలాంటి తప్పు చేయలేదు: డీఐజీ రూప

బెంగళూరు : తాను ఎలాంటి తప్పు చేయలేదని, తనను టార్గెట్‌ చేయడం సరికాదని జైళ్ల డీఐజీ రూప మౌద్గిల్‌ అన్నారు. ఆమె శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ నివేదికలో తాను చెప్పిన అన్ని విషయాలకు కట్టుబడి ఉన్నానని మరోసారి స్పష్టం చేశారు. తాను ఎక్కడా ప్రోటోకాల్‌ ఉల్లంఘించలేదని డీఐజీ రూప స్పష్టం చేశారు. సర్వీస్‌ రూల్స్‌ అందరికీ వర్తించాలని, తన ఒక్కదానికే కాదని అన్నారు. ప్రోటోకాల్‌ ఉల్లంఘిస్తే అందరిపై చర్యలు తీసుకోవాలని రూప వ్యాఖ్యానించారు.

  ‘జైళ్ల శాఖ డీఐజీగా నేను జూన్‌ 23న బాధ్యతలు స్వీకరించాను. విధుల్లో భాగంగా ఈనెల 10న నేను పరప్పన జైలుకు వెళ్లాను. ఆ తరువాతి రోజే మీ (సత్యనారాయణ) కార్యాలయం నుంచి నాకు మెమో వచ్చింది. అందులో ‘మిమ్ములను పరప్పన అగ్రహార జైలుకు ఎవరు వెళ్లమన్నారు’ అని ప్రశ్నించారు. నా అధికార పరిధి ప్రకారం జైళ్లకు వెళ్లి తనిఖీ చేయడం, తప్పు చేసిన సిబ్బంది నుంచి వివరణ కోరడం కూడా నా విధి. నా విధులను సక్రమంగా నిర్వర్తిస్తుంటే మీరు మెమో జారీ చేయడం అత్యంత శోచనీయం’ అని ఘాటుగా పేర్కొన్నారు.   

మరోవైపు ఈ వ్యవహారంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్‌ జైలులో శశికళ, స్టాంపుల కేసు దోషి తెల్గీ నుంచి జైళ్ల శాఖ ఐజీపీ సత్యనారాయణరావు ముడుపులు తీసుకుని రాచమర్యాదలు చేస్తున్నారని ఆ శాఖ డీఐజీ రూప చేసిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపిస్తామని అన్నారు. అయితే డీఐజీ రూప సర్వీస్‌ రూల్స్‌కు వ్యతిరేకంగా డీజీపీ సత్యనారాయణ జైళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని పలుమార్లు మీడియా ముందు బహిరంగంగా మాట్లాడటం తగదని అన్నారు.  ఈ విషయంపై హోం శాఖ కార్యదర్శితో చర్చించి పరప్పనజైలు వ్యవహారంపై క్షుణ్ణంగా విచారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు.

కాగా దావణగెరె స్వస్థలమైన జైళ్ల డీఐజీ రూప ప్రతిభావనిగా పేరు తెచ్చుకున్నారు.  పనిచేసిన ప్రతిచోటా ఆమె సంచలనాలకు కేంద్ర బిందువయ్యారు. 2000లో సివిల్స్‌లో 43వ ర్యాంక్‌ సాధించి ఐపీఎస్‌ను ఎంచుకున్నారు. హైదరాబాద్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో శిక్షణ పొందారు. షార్ప్‌ షూటర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆ బ్యాచ్‌లో ఓవరాల్‌గా 5వ స్థానంలో నిలిచారు. పోలీసు శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్నందుకు గాను 2016 జనవరి 26న రాష్ట్రపతి పోలీసు పతకాన్ని అందుకున్నారు. ఓ కేసులో కోర్టు తీర్పు ప్రకారం అప్పటి మధ్యప్రదేశ్‌ సీఎం ఉమాభారతీని ఎస్పీ హోదాలో అరెస్టు చేశారు.

ఆమె బెంగళూరు డీసీపీగా ఉండగా వీవీఐపీల భద్రతా సిబ్బందిని తొలగించి లా అండ్‌ ఆర్డర్‌ విభాగానికి మార్చడం అప్పట్లో సంచలనం సృష్టించింది. డీసీపీ (సిటీ ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌) గా విధులు నిర్వర్తించే సమయంలో  నిబంధనలకు విరుద్ధంగా యెడ్యూరప్ప ఓ ఊరేగింపులో ఎక్కువ వాహనాలను వినియోగించడాన్ని గుర్తించిన రూప వెంటనే వాటిని  తొలగించి వార్తల్లోకెక్కారు.

మరిన్ని వార్తలు