తరుణ్ తేజ్పాల్ అరెస్ట్ తప్పకపోవచ్చు: గోవా సీఎం

27 Nov, 2013 16:36 IST|Sakshi
తరుణ్ తేజ్పాల్ అరెస్ట్ తప్పకపోవచ్చు: గోవా సీఎం

న్యూఢిల్లీ : తెహెల్కా ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌ అరెస్టు తప్పేలా కనిపించడం లేదు. మహిళా జర్నలిస్ట్‌ను లైంగికంగా వేధించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహెల్కా ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌ను అరెస్టు తప్పకపోవచ్చని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారీకర్ అన్నారు. తేజ్‌పాల్‌ను ఇరికించేందుకు రాజకీయ కుట్ర జరుగుతోందన్న వాదనలో వాస్తవం లేదని పారీకర్ స్పష్టం చేశారు.

కేసులో జోక్యం చేసుకునేంత సమయం తనకు లేదని ఆయన అన్నారు. బాధితురాలికి న్యాయం చేయడానికి తాము అన్ని విధాల కృషి చేస్తామని పారీకర్ తేల్చి చెప్పారు. కేసు త్వరితగతిన పూర్తి చేసేందుకు పాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.

మరోవైపు తరుణ్ తేజ్‌పాల్‌పై మంగళవారం గోవా పోలీసులు ‘ఇమ్మిగ్రేషన్ చెక్‌పోస్ట్ అలర్ట్’ను జారీ చేశారు. తేజ్‌పాల్ దేశం విడిచి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని అన్ని విమానాశ్రయాలు, నౌకాశ్రయాలకు సమాచారం ఇచ్చారు. నిందితుడు దేశం విడిచి వెళ్లే యత్నాలు చేయకుండా ఉండేందుకే ఈ చర్య తీసుకున్నామని డీఐజీ ఓపీ మిశ్రా వెల్లడించారు.

బాధితురాలు దర్యాప్తు అధికారులకు వాంగ్మూలం ఇచ్చారని, అయితే ఆమె చెప్పే విషయాలను వెల్లడించలేనని తెలిపారు. దర్యాప్తులో రాజకీయ జోక్యం, ఒత్తిడి లేవన్నారు. మరోవైపు, తేజ్‌పాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసేందుకు ఢిల్లీ హైకోర్టు నిన్న నిరాకరించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు