తస్లీమా నస్రీన్‌ సంచలన వ్యాఖ్యలు!

24 Jan, 2017 09:13 IST|Sakshi
తస్లీమా నస్రీన్‌ సంచలన వ్యాఖ్యలు!

జైపూర్‌: ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫామ్‌ సివిల్‌ లా)ను పలు ముస్లిం సంఘాలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ప్రవాస బంగ్లాదేశీ రచయిత్రి తస్లీమా నస్రీన్‌ ఈ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌కు అత్యవసరంగా ఉమ్మడి పౌరస్మృతి అవసరముందని ఆమె స్పష్టం చేశారు. డిగ్గీ ప్యాలెస్‌లో జరిగిన జైపూర్‌ సాహిత్యోత్సవం (జెఎల్‌ఎఫ్‌)లో ఆమె అనూహ్యంగా హాజరై ప్రసంగించారు. ఇస్లాంను విమర్శించడమే ఇస్లామిక్‌ దేశాల్లో లౌకికవాదం నెలకొల్పడానికి మార్గమని ఆమె అన్నారు. బంగ్లాదేశ్‌లో మతఛాందసవాదుల ఆగ్రహావేషాల నేపథ్యంలో 1994 నుంచి ఈ వివాదాస్పద రచయిత ప్రవాసంలో గడుపుతున్న సంగతి తెలిసిందే.

అయితే, జేఎల్‌ఎఫ్‌ వేదిక బయట ముస్లిం సంఘాలు ఆమె రాకను వ్యతిరేకిస్తూ ఆందోళన నిర్వహించాయి. 'తస్లీమాను బంగ్లాదేశ్‌ వెళ్లగొట్టింది. ఆమెను ఈ దేశంలో బతికేందుకు అనుమతిస్తే.. ఆమె మరీ ఎక్కువ స్వేచ్ఛను తీసుకుంటోంది' అని రాజస్థాన్‌ ముస్లిం ఫోరం కన్వీనర్‌ కారీ మొయినుద్దీన్‌ విమర్శించారు. ఈ ఇద్దరు వ్యక్తుల్ని (సల్మాన్‌ రష్దీ, తస్లీమా నస్రీన్‌లను) మళ్లీ ఎప్పుడూ సాహిత్యోత్సవానికి ఆహ్వానించమని జేఎల్‌ఎఫ్‌ నిర్వాహకులు హామీ ఇచ్చినట్టు ఆయన తెలిపారు.

'ఎగ్జైల్' (ప్రవాసం) పేరిట జరిగిన సెషన్‌లో తస్లీమా మాట్లాడుతూ.. 'నేను, ఇతరులు హిందూయిజం, బుద్ధిజం లేదా ఇతర మతాల్ని విమర్శించినప్పుడు ఏమీ జరగదు. కానీ మీరు ఇస్లాంను విమర్శించిన వెంటనే జీవితకాలం వ్యక్తులు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటారు. మీకు వ్యతిరేకంగా ఫత్వాలు జారీచేస్తారు. మిమ్మల్ని చంపాలని చూస్తారు. కానీ, వాళ్లు అలా ఎందుకు చేస్తున్నారు? నాతో ఏకీభవించనప్పుడు..  నాకు వ్యతిరేకంగా వాళ్లు కూడా రాయవచ్చు. మనందరిలాగే వారి అభిప్రాయాలు వెల్లడించవచ్చు. ఫత్వాలకు బదులు సంభాషించవచ్చు కదా' అని ఆమె పేర్కొన్నారు. ముస్లిం మహిళలు అణచివేయబడుతున్నారని, వారి రక్షణ కోసం ఉమ్మడి పౌరస్మృతి అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు.
 

మరిన్ని వార్తలు