సెక్స్ బానిసల బ్రాండ్ నేమ్.. టాటూ!

8 Sep, 2015 15:47 IST|Sakshi
సెక్స్ బానిసల బ్రాండ్ నేమ్.. టాటూ!

పచ్చబొట్టు అక్కడి యువతుల జీవితాలను చిదిమేసే మాయని మచ్చగా మారింది. అమ్మాయిలను అంగడి బొమ్మలుగా మార్చేందుకు గుర్తుగా నిలుస్తోంది. ఉమెన్ ట్రాఫికింగ్ అంతర్జాతీయంగా విస్తరిస్తూ.. కొన్ని వందలు, వేల కోట్ల రూపాయల వ్యాపారం సాగిస్తోంది. అమెరికాలో టాటూ.. ఈ ముఠాల బారినపడి బానిసత్వంలో మగ్గిపోతున్న యువతుల శరీరాలపై బ్రాండ్నేమ్గా కూడా చెలామణి అవుతోంది.

అవును... ఇటీవల అమెరికాలో వెలుగులోకొచ్చిన నగ్నసత్యమిది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కోట్లాది మంది మహిళలతో కొనసాగుతున్న వ్యాపారంగా పోలీసులు దీన్ని గుర్తించారు. హ్యూమన్ ట్రాఫికింగ్తో వ్యభిచార వృత్తిలోకి దించిన మహిళలకు, లైంగిక కార్యకలాపాల్లోకి నెట్టిన పిల్లలకు పచ్చబొట్టు ఓ సింబల్. అమెరికన్ పోలీసుల కంటపడ్డ ఓ అమ్మాయి కథ చూస్తే ఎన్నో మింగుడు పడని నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె మెడ ఎముక దగ్గర, నెక్లెస్ పై భాగంలో అందంగా రాసి ఉన్న రాత వెనుక పెద్ద చరిత్ర కనిపించింది. క్రీమ్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో కొనసాగుతున్న హింసాత్మక వ్యాపారంలో లైంగిక బానిసలుగా ఉన్న 8 లక్షల మంది బాధితుల్లో 14 ఏళ్ల ఆడ్రియానా ఒకరు.  ఆమె అవసరాన్ని అదనుగా చేసుకుని, పని చూపిస్తామని నమ్మబలికి రొంపిలోకి దింపారు. ఆమె ఒంటిపై టాటూ వేసేశారు. వివిధ దేశాల్లో పచ్చబొట్టు ఆధారంగా కోట్ల సంఖ్యలోనే బానిసలు ఈ బడా వ్యాపారంలో సమిధలు అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. బానిసల చేతులు, పొత్తికడుపు, మెడపై వేసే ఆ టాటూలను బార్కోడ్లుగా కూడా ఉపయోగిస్తున్నారు. తమ శరీరంపై కనిపించే ఈ గుర్తులను తాము 'వార్ ఊండ్స్' గా పిలుస్తామని ఆడ్రియానా చెబుతోంది.

ఈ టాటూల సంప్రదాయాన్ని రూపుమాపేందుకు ఇప్పుడు ఓ సంస్థ ముందుకు వచ్చింది. అదే.. సర్వైవర్ ఇంక్. ఈ సంస్థ స్థాపకురాలు జెన్నిఫర్ కెంప్టన్ కూడా ఒకప్పుడు ఈ ఉచ్చునుంచి బయటపడ్డ బాధితురాలే. ప్రస్తుతం ఆమె స్వచ్ఛందంగా టాటూ బాధితులను  లైంగిక బానిసత్వం నుంచి కాపాడేందుకు కృషి చేస్తోంది.   

కెంప్టన్ 12 ఏళ్ల వయసులోనే ట్రాఫికింగ్ ఉచ్చులో చిక్కుకుంది. తన సోదరుడి స్నేహితుడైన సాలెమ్ చేతిలో మోసపోయింది. అతడు ఆమెపై రేప్ చేసి, తర్వాత అక్రమంగా తరలించాడు. తర్వాత ఐదేళ్ల పాటు కెంప్టన్ పలువురి చేతిలో చిత్రవధ అనుభవించింది. కొన్ని ముఠాల బ్రాండ్లతో చిక్కుకుపోయింది. తన సొత్తుగా భావించిన సాలెమ్ తన ముఠా బ్రాండ్ నేమ్ అయిన కింగ్ మంచ్ పేరుతో ఆమె మెడపై టాటూను వేయించాడు. అదే సమయంలో మిగిలిన మరి కొన్ని ముఠాలు వారి వారి పేర్లను ఆమె చేతులు, వీపుపై టాటూలుగా వేయించారు. ఓహియో వాసి అయిన కెంప్టన్... అక్కడి వీధుల్లో బాలికలు, మహిళలు టాటూల బారి నుంచి తప్పించుకోలేక పోతున్నారంటున్నారు. ఆ నరకాన్ని భరించలేక రెండుసార్లు ఆత్మహత్యకు కూడా ప్రయత్నించిన కెంప్టన్ సమయానికి తాడు తెగిపోవడంతో ప్రాణాలతో మిగిలిపోయింది. అప్పుడే ఓ నిర్ణయానికి వచ్చింది. ఇదే తాను తప్పించుకొనేందుకు సమయంగా భావించింది. ఇప్పడామె తన శరీరాన్ని పలు రకాల డిజైన్లతో అలంకరించుకుంది. ఇలా ముఠా బ్రాండ్ను తన శరీరం నుంచి చెరిపేయడంతో తనకు విమోచన కలిగిందంటోంది.

ఉమెన్ ట్రాఫికింగ్ అంతర్జాతీయంగా ఏటా 1.33 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం సాగిస్తోందని ఐక్యరాజ్య సమితి తన నివేదికలో స్పష్టం చేసింది. అంతర్జాతీయ సమాజం మూడో అతిపెద్ద నేరంగా పరిగణించిన ఉమెన్ ట్రాఫికింగ్ ప్రమాదకర స్థాయిలో విస్తరిస్తోంది.

మరిన్ని వార్తలు