టీసీఎస్.. భేష్!

17 Jan, 2014 00:59 IST|Sakshi
టీసీఎస్.. భేష్!

 ముంబై: భారత్‌లో అగ్రశ్రేణి ఐటీ కంపెనీ టీసీఎస్ అంచనాలను మించిన ఫలితాలతో ఆకట్టుకుంది. కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం డిసెంబర్‌తో ముగిసిన మూడో క్వార్టర్(2013-14; క్యూ3)లో 50.3 శాతం దూసుకెళ్లి... రూ.5,333 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ లాభం రూ.3,550 కోట్లుగా ఉంది. కాగా, మొత్తం కన్సాలిడేటెడ్ ఆదాయం కూడా రూ.16,070 కోట్ల నుంచి రూ.21,294 కోట్లకు ఎగబాకింది. 32.5% వృద్ధి చెందింది.  యూరప్‌లో వ్యాపారం పుంజుకోవడం... లైఫ్‌సెన్సైస్, టెలికం, తయారీ రంగం తదితర విభాగాల్లో మెరుగైన పనితీరు మూడో క్వార్టర్‌లో జోరుకు దోహదం చేసింది. బ్రోకరేజి సంస్థల విశ్లేషకులు టీసీఎస్ క్యూ3లో సగటున రూ. 5,179 కోట్ల లాభాన్ని రూ. 21,373 కోట్ల ఆదాయాన్ని ఆర్జించవచ్చని అంచనా వేశారు.
 
 సీక్వెన్షియల్‌గానూ...
 ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్(క్యూ2-రూ.4,633 కోట్లు)తో పోల్చినా కూడా(సీక్వెన్షియల్‌గా) క్యూ3 నికర లాభంలో 15.1% వృద్ధి నమోదవడం విశేషం. ఆదాయం మాత్రం 1.5% స్వల్పంగా పెరిగింది. క్యూ2లో ఆదాయం రూ.20,977 కోట్లుగా ఉంది.


 ఇతర ముఖ్యాంశాలివీ...

  • డిసెంబర్‌తో ముగిసిన క్వార్టర్‌కు గాను టీసీఎస్ రూ. 1 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ.4 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. 2013-14లో వరుసగా మూడో క్వార్టర్‌లోనూ మధ్యంతర డివిడెండ్ ఇవ్వడం విశేషం. కాగా, దీనికి ఈ నెల 28ని రికార్డు తేదీగా నిర్ణయించింది.
  • కంపెనీ నిర్వహణ మార్జిన్లు 29.7 శాతంగా నమోదయ్యాయి.
  • 8 బడా డీల్స్ కుదిరాయి. ఇందులో 2 కోట్ల డాలర్ల విలువైన 4 కాంట్రాక్టులు, 5 కోట్ల డాలర్ల 2 కాంట్రాక్టులున్నాయి.

 మరిన్ని ఉద్యోగాలు...
ఐటీ సేవలకు డిమాండ్ పుంజుకుంటుండటంతో టీసీఎస్ మరిన్ని ఉద్యోగాలు ఇవ్వనుంది. ఈ ఏడాది(2013-14)లో నియామకాల లక్ష్యం 50 వేలు కాగా, దీనికి మరో 5 వేల మందిని జోడించనున్నట్లు కంపెనీ గ్లోబల్ హెచ్‌ఆర్ హెడ్ అజోయ్ ముఖర్జీ ప్రకటించారు. ఇదిలాఉండగా... క్యూ3లో స్థూలంగా 14,663 మంది ఉద్యోగులను టీసీఎస్ జతచేసుకుంది. అయితే, 9,200 మంది సిబ్బంది కంపెనీని వీడటంతో నికరంగా 5,463 మంది జతయ్యారు. డిసెంబర్ చివరినాటికి టీసీఎస్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,90,713కు చేరింది.


 జోరు ఎందుకంటే..
 ఈ ఏడాది క్యూ3లో కంపెనీ ఫలితాలు చాలా బాగున్నాయి. మా సేవలకు అంతర్జాతీయంగా ఐటీకి పటిష్టమైన డిమాండ్, కాంట్రాక్టుల నిర్వహణలో క్రమశిక్షణే ఈ మెరుగైన వృద్ధికి కారణం. తక్కువ ఫారెక్స్ నష్టాలు, మార్జిన్లు అంచనాల కంటే ఎక్కువగా నమోదవడం కూడా లాభాలను పెంచాయి. వచ్చే  ఏడాది (2014-15)లో   మా రాబడులు కూడా మరింత జోరందుకోవచ్చు.
 - ఎన్. చంద్రశేఖరన్, టీసీఎస్ సీఈఓ
 
 టీసీఎస్ షేరు ధర గురువారం బీఎస్‌ఈలో రూ. 2.90 స్వల్ప నష్టంతో రూ. 2,351.35 వద్ద ముగిసింది. ఒకానొక దశలో రూ. 2,380 గరిష్టాన్ని తాకింది. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి.
 

>
మరిన్ని వార్తలు