టీడీపీకీ నో ఎంట్రీయేనా?

16 Apr, 2017 03:29 IST|Sakshi
టీడీపీకీ నో ఎంట్రీయేనా?

బీఏసీ నుంచి సండ్రను పంపించిన అసెంబ్లీ సిబ్బంది
సాక్షి, హైదరాబాద్‌:
ముస్లింలు, ఎస్టీల రిజర్వేషన్లపై ఆదివారం జరగనున్న అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో టీటీడీపీ ఎమ్మెల్యేలకు ప్రవేశం లేనట్టేనని తెలుస్తోంది. సభ నిర్వహణపై శనివారం జరిగిన బీఏసీ భేటీలో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను పాల్గొనకుండా అసెంబ్లీ సిబ్బంది నిలువరించారు. బీఏసీ భేటీకి హాజరుకావాలంటూ ఆహ్వానించిన అసెంబ్లీ సచివాలయమే, సమావేశం నుంచి బయటకు పంపించింది. గతంలో జరిగిన బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా టీటీడీపీ సభ్యులను సస్పెండ్‌ చేశారు. అదే సస్పెన్షన్‌ టీడీపీ సభ్యులకు ఇప్పుడు కూడా వర్తిస్తుందని అసెంబ్లీ సిబ్బంది తేల్చిచెప్పారు.

పిలిచి అవమానిస్తారా?: రేవంత్‌రెడ్డి
అసెంబ్లీ నిబంధనలను పక్కనబెట్టి టీఆర్‌ఎస్‌ కార్యాలయంగా నడిపించుకుంటున్నారని టీటీడీఎల్పీ నేత ఎ.రేవంత్‌రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి హరీశ్‌రావు, శాసనసభ కార్యదర్శి సదారాం కనుసన్నల్లో అసెంబ్లీ నడుస్తోందని ఆరోపించారు. స్పీకర్‌ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదన్నారు. ఎమ్మెల్యేల హక్కులను కాపాడాల్సిన స్పీకర్‌ ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. బీఏసీ సమావేశానికి పిలిచి అవమానించడం దారుణమన్నారు. అసెంబ్లీ కార్యదర్శి సదారాంను సస్పెండ్‌ చేయాలని రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

ఇంత అవమానమా: సండ్ర
బీఏసీ సమావేశానికి పిలిచి, ఆ తరువాత బయటకు వెళ్లాలని చెప్పడం అత్యంత అవమానకరమని టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ప్రభుత్వం టీడీపీ గొంతు నొక్కుతున్నదన్నారు. అధికారంలో ఉన్నామనే అహంకారంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. చరిత్రలో నియంతలకు పట్టిన గతే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పడుతుందని సండ్ర హెచ్చరించారు.

మరిన్ని వార్తలు