నంద్యాల: ఈవీఎంలపై టీడీపీ దుర్మార్గ ప్రచారం

19 Aug, 2017 02:47 IST|Sakshi
నంద్యాల: ఈవీఎంలపై టీడీపీ దుర్మార్గ ప్రచారం

- వెరిఫికేషన్‌ స్లిప్ప్‌ పేరుతో ఓటర్లను భయపెట్టిస్తున్నారు
- సూరత్‌ గ్రాండ్‌ హోటల్‌ ఏపీ క్యాపిటల్‌గా మారింది
- పథకం ప్రకారమే చంద్రబాబు రూ.5వేల పాట.. బాలకృష్ణ షో
- ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లిన వైఎస్సార్‌సీపీ
- వివరాలు వెల్లడించిన ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి


నంద్యాల:
ఓటమి భయంతో అధికార తెలుగుదేశం పార్టీ.. నంద్యాలలో దుర్మార్గాలకు పాల్పడుతున్నదని, ఈవీఎంల పేరు చెప్పి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఆరోపించారు. ఓటర్‌ వెరిఫికేషన్‌ స్లిప్‌(వీవీఎస్‌) ద్వారా ఎవరెవరు ఎవరికి ఓటేశారో తెలిసిపోతుందనే తప్పుడు ప్రచారాన్ని టీడీపీ చేయిస్తున్నదని, నిజానికి ఆ స్లిప్పులు బయటికి రాకపోయినా, వాటి ఆధారంగా పెన్షన్లు, ఇళ్లు, రేషన్‌కార్డులను తొలగిస్తామని ఓటర్లను భయపెట్టిస్తున్నారని బుగ్గన మండిపడ్డారు.

వెరిఫికేషన్‌ స్లిప్పులు బయటికి రావు: ‘‘ఎన్నికల సంఘం(ఈసీ) నిబంధనల మేరకు.. ఓటరు తాను ఎవరికి ఓటు వేశాడో తెలుసుకునేలా వెరిఫికేషన్‌ స్లిప్‌ వస్తుంది. దానిని పోలింగ్‌ బూత్‌ ఆఫీసర్‌ ముందుండే డబ్బాలో వేసిన తర్వాతే బయటికి రావాల్సిఉంటుంది. ఓటు ఎవరికి వేశామన్న విషయం ఓటరుకు తప్ప ఎవ్వరికీ తెలిసే అవకాశమేలేదు. కానీ టీడీపీ దీనిపై విషప్రచారం చేస్తోంది. ఎక్కడెక్కడి నుంచో విద్యార్థులను తీసుకొచ్చి సర్వేల పేరుతో నంద్యాలలో తిప్పుతున్నారు. ప్రజల నుంచి ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, పెన్షన్ల వివరాలు సేకరిస్తూ.. టీడీపీకి ఓటేయకుంటే ప్రభుత్వ పథకాలు ఆగిపోతాయని ప్రచారం చేయిస్తున్నారు. ఈ దుర్మార్గ పద్ధతులపై నెల రోజుల కింటనే మేం ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదుచేశాం’’ అని బుగ్గన చెప్పారు.

కావాలనే బాలకృష్ణ కొట్టారు: వందల కెమెరాలు తనను చూస్తున్నాయని తెలిసికూడా బాలకృష్ణ.. ఒక వ్యక్తిని కొట్టడం, మనిషికో రూ.5 వేలు ఇస్తానని చంద్రబాబు అనడం కాకతాళీయం కాదని, తమ దగ్గర డబ్బు, అధికారం ఉందన్న విషయాన్ని తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే వారలా ప్రవర్తించారని ఎమ్మెల్యే బుగ్గన అన్నారు. ‘చూశారా.. నేను డబ్బులు పంచినా, ఒకరిని కొట్టినా నన్ను ఎవరూ ఏమీ చెయ్యలేరు’ అనే మెసేజ్‌ ఇవ్వడానికే బాలకృష్ణ అలా చేశారు. మా దగ్గర డబ్బుందని చెప్పడానికే చంద్రబాబు మనిషికి 5వేలు ఇస్తానని అన్నారు. ఒక ఉప ఎన్నిక కోసం వీళ్లు ఇంతలా దిగజారిందికాక, మిగతా వాళ్లు కూడా అలానే చేస్తారని భావించడం మరీ దారుణం’ అని బుగ్గర వాపోయారు.

ప్రజలకు చేరువ కావడమే జగన్‌ లక్ష్యం: ‘‘ప్రజలు స్వచ్ఛందంగా పార్టీకి దగ్గర కావాలన్నది వైఎస్‌ జగన్‌ అభిప్రాయం. నిజాయితీ, నిబద్ధత, ఇచ్చిన మాటకు కట్టుబడటం అనేవి ఆయన ఎంచుకున్న మార్గాలు. గడిచిన 12 రోజులుగా వైఎస్‌ జగన్‌ ప్రజలలో తిరుగుతున్నారు. నిజాయితీగా ఓట్లు అడుగుతున్నారు. దీనికి విరుద్ధంగా అక్రమాలకు పాల్పడుతోన్న టీడీపీ.. తిరిగి జగన్‌ను విమర్శించడం దారుణం. గతంలోనూ మంచి నాయకులను చట్టసభలకు పంపింపిన నంద్యాల ప్రజలు.. ఈ సారి కూడా నిజాయితీకే ఓటేస్తారు’ అని బుగ్గన అన్నారు. బుగ్గన చెప్పిన విషయాల్లో మరికొన్ని ముఖ్యాంశాలు..

ఏపీ క్యాపిటల్‌ సూరత్‌ గ్రాడ్‌ హోటల్‌: రైతుల దగ్గరనుంచి వేల ఎకరాల భూములు గుంజుకున్న చంద్రబాబు నాయుడు ఏదో అద్భుతమైన నగరం కడతారనుకుంటే.. చివరికి నంద్యాలలోని సూరత్‌ గ్రాండ్‌ హోటల్‌ను రాజధానిగా మార్చేశారు. మంత్రివర్గం మొత్తం అక్కడే తిష్టవేసి అక్రమప్రచారానికి నేతృత్వం వహిస్తోంది.

భోజనం టోకెన్లతో మద్యం సరఫరా: ‘అన్నపూర్ణా హోటల్‌ - రూ.10 భోజనం’  అని రాసున్న టోకెన్లను పంచుతున్నారు. వాటిని తీసుకెళితే భోజనంకాదు మద్యం బాటిళ్లు ఇస్తున్నారు. జగన్‌ పర్యటనకు వచ్చే ప్రాంతాల్లో డబ్బులిచ్చిమరీ జనాన్ని ఇళ్ల నుంచి బయటికి పంపేస్తున్నారు.

టీడీపీ వాళ్లే స్లిప్పులు కొట్టిస్తున్నారు: ‘జై జగన్‌ జై వైఎస్సార్‌’ అని ముద్రించిన స్లిప్పులను జనానికి పంచి, శిల్పా మోహన్‌రెడ్డి దగ్గరికెళ్లి డబ్బులు తీసుకోవాలంటూ టీడీపీ నేతలు కొత్త కుట్రకు తెరలేపారు. కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌తో సంబంధం ఉన్న విజయవాడ ఎమ్మెల్యే ఒకరు ఈ కుట్రలో కీలక సూత్రధారి.