'చావు' అంటూ ట్రంప్‌కు 'తుపాకీ' గురిపెట్టి..

29 Jan, 2017 13:33 IST|Sakshi


తీవ్ర కలకలం రేపిన భారతీయ టీచర్‌ పరిహాసపు వీడియో
వాటర్‌ గన్‌తో ట్రంప్‌ను కాలుస్తూ తరగతి గదిలో హల్‌చల్‌


హుస్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను పరిహాసిస్తూ భారత సంతతికి చెందిన ఓ ఉపాధ్యాయురాలు తరగతి గదిలో చేసిన ఓ స్టంట్‌ ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. తరగతి గదిలో ట్రంప్‌ ఫొటోకు గురిపెట్టి వాటర్‌ గన్‌తో కాలుస్తూ.. 'చావు' అంటూ ఆమె కెకలు పెట్టిన వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారిపోయింది.

భారత సంతతి వారు ఎక్కువగా ఉండే టెక్సాస్‌లోని డల్లాస్‌లో ఉన్న ఆడంసన్‌ హైస్కూల్‌లో పాయల్‌ మోదీ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తోంది. తరగతి గదిలోని వౌట్‌బోర్డుపై ట్రంప్‌ ప్రమాణం చేస్తున్న వీడియో ప్లే అవుతుండగా.. ట్రంప్‌కు గురిపెట్టి ఆమె పిల్లలు ఆడుకునే వాటర్‌ తుపాకీతో కాలుస్తూ.. 'చావు' అంటూ కేక పెట్టింది. ఇటీవల ఆన్‌లైన్‌లో వెలుగుచూసిన వీడియో ఒక్కసారిగా వైరల్‌గా మారిపోయింది. ఇంటర్నెట్‌లో ఈ వీడియోను ఇప్పటికే కొన్ని లక్షలమంది చూశారు. తరగతి గదిలో ఇలా చేయడం ఏమిటంటూ ఈ వీడియోపై అమెరికన్లు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో టీచర్‌ పాయల్‌ మోదీను స్కూలు యాజమాన్యం సస్పెండ్‌ చేసింది.