తనిఖీ బృందాల నివేదికలను పరిగణనలోకి తీసుకోండి

29 Jul, 2015 02:30 IST|Sakshi
తనిఖీ బృందాల నివేదికలను పరిగణనలోకి తీసుకోండి

ఏఐసీటీఈ, జేఎన్‌టీయూలకు హైకోర్టు ధర్మాసనం ఆదేశం
నివేదికల ఆధారంగా అప్రూవల్, అఫిలియేషన్లపై నిర్ణయం తీసుకోండి
వ్యతిరేక నిర్ణయం ఉంటే రాతపూర్వకంగా ఇంజనీరింగ్ కాలేజీలకు తెలపండి
ఇరువురి నిర్ణయాలు తమ తదుపరి ఉత్తర్వులకు లోబడి ఉంటాయని స్పష్టీకరణ
విచారణ 30కి వాయిదా

 
హైదరాబాద్: తమ ఆదేశాల మేరకు 99 ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో తనిఖీలు నిర్వహించి తయారు చేసిన నివేదికల ఆధారంగా ఆ కాలేజీల అప్రూవల్ గురించి, అదే సమయంలో వాటి అఫిలియేషన్ విషయంలో తగిన నిర్ణయాలు తీసుకోవాలని హైకోర్టు మంగళవారం అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ), జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూ) హైదరాబాద్‌లను ఆదేశించింది. తనిఖీ నివేదికల పరిశీలన తరువాత ఏదైనా కాలేజీకి అప్రూవల్‌ను ఉపసంహరించడం గానీ, అఫిలియేషన్‌ను తిరస్కరించడం గానీ చేస్తే, అందుకుగల కారణాలను రాతపూర్వకంగా ఆ కాలేజీకి తెలపడంతో పాటు ఆ కాలేజీకి తనిఖీ బృంద నివేదికనూ అందజేయాలని ఏఐసీటీఈ, జేఎన్‌టీయూలకు హైకోర్టు స్పష్టం చేసింది. అప్రూవల్, అఫిలియేషన్‌లపై ఏఐసీటీఈ, జేఎన్‌టీయూ తీసుకునే నిర్ణయాలు ఈ వ్యాజ్యాల్లో తాము వెలువరించే తదుపరి ఉత్తర్వులకు లోబడి ఉంటాయని హైకోర్టు తేల్చి చెప్పింది.

తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏఐసీటీఈ అనుమతి ఉండి ఈ విద్యా సంవత్సరానికి అఫిలియేషన్ పొందలేకపోయిన ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలకు తాత్కాలిక అఫిలియేషన్ ఇవ్వాలన్న సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ జేఎన్‌టీయూ అప్పీళ్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలను విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం, అఫిలియేషన్ కోసం హైకోర్టును ఆశ్రయించిన కాలేజీల్లో నిబంధనల మేరకు బోధనా సిబ్బంది, ల్యాబ్‌లు ఉన్నాయో లేదో తనిఖీ చేయాలంటూ ఏఐసీటీఈ, జేఎన్‌టీయూ ప్రతినిధులతో 25 బృందాలను ఏర్పాటు చేస్తూ ఈ నెల 15న ఉత్తర్వులు జారీ చేసిన సంగతి విదితమే. తాజాగా ఈ అప్పీళ్లను ధర్మాసనం మంగళవారం విచారించింది. ఈ సందర్భంగా జేఎన్‌టీయూ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. 99 కాలేజీల తనిఖీలకు సంబంధించిన 99 నివేదికలను ఆయన కోర్టు ముందుంచారు. వీటిని పరిశీలించిన ధర్మాసనం.. తమకు అందించిన నివేదికలను ఏఐసీటీఈకి అందజేస్తున్నామని, వాటిని పరిశీలించిన తరువాత అప్రూవల్‌పై నిర్ణయం తీసుకోవాలంది. అలాగే జేఎన్‌టీయూ సైతం అఫిలియేషన్‌పై నిర్ణయం తీసుకోవాలంద.

అప్రూవల్‌ను ఉపసంహరించాలని ఏఐసీటీఈ భావిస్తే, అది ఏఐసీటీఈ చట్టం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగానే ఉండాలని ధర్మాసనం తెలిపింది. అఫిలియేషన్ వద్దన్న కాలేజీలను కేసుల విచారణ జాబితా నుంచి తొలగిస్తున్నామంది. అలాగే తనిఖీల నిమిత్తం జేఎన్‌టీయూ వద్ద రూ.2 లక్షలు డిపాజిట్ చేయని కాలేజీలు, వారంలోపు ఆ మొత్తాలను డిపాజిట్ చేయాలని ఆదేశించింది. లేని పక్షంలో వారి పిటిషన్లను కొట్టేస్తామంది. అటు ఏఐసీటీఈ, ఇటు జేఎన్‌టీయూ తమ నిర్ణయాలను కోర్టు ముందుంచాలని, వాటిని పరిగణనలోకి తీసుకుని కేసు వాస్తవాల ఆధారంగా తగిన ఉత్తర్వులు జారీ చేస్తామంటూ విచారణను వాయిదా వేసింది.
 
 

మరిన్ని వార్తలు