కుప్పకూలిన ఐటీ దిగ్గజం: వేలకోట్ల సంపద ఆవిరి

29 May, 2017 11:16 IST|Sakshi
కుప్పకూలిన ఐటీ దిగ్గజం: వేలకోట్ల సంపద ఆవిరి

ముంబై: దేశీయ ఐటీ దిగ్గజం టెక్‌మహీంద్రా  సోమవారం నాటి మార్కెట్‌లో భారీగా నష్టపోయింది. భారత ఐదవ అతిపెద్ద   ఐటీ  సేవల సంస్థ గతేడాది(2016-17) క్యూ4 ఫలితాల్లో అంచనాలను అందుకోక చతికిలపడిన నేపథ్యంలో భారీగా అమ్మకాలు వెల్లువెత్తాయి.  ఇన్వెస్టర్ల అమ్మకాలతో టెక్‌ మహీంద్రా షేరు  ఈ ఒక్కరోజులోనే 17శాతానికిపైగా పతనమైంది.  కేవలం నిమిషాల వ్యవధిలోనే కంపెనీ మార్కెట్‌ వాల్యూ భారీగా క్షీణించింది. ఆరంభంలోనే భారీగా కుప్పకూలడంతో రూ. 7వేల కోట్ల  వాటాదారుల  సొమ్ము తుడిచి పెట్టుకుపోయింది.  అమ్మకాల ధోరణి ఇంకా కొనసాగే  అవకాశముందంటూ  ఎనలిస్టులు హెచ్చరిస్తున్నారు. 

ముంబై ఆధారిత  టెక్  సేవల సంస్థ టెక్‌ మహీంద్ర శుక్రవారం మార్కెట్‌  ముగిసిన తరువాత ప్రకటించిన  మార్చి  క్వార్టర్‌ ఫలితాలో నిరాశ పరిచింది.  ఆపరేటింగ్ మార్జిన్ అంతకుముందు సంవత్సరం 16.7 శాతంతో పోలిస్తే ఈ మార్చి త్రైమాసికంలో 12 శాతానికి పడిపోయింది.  ఈ కౌంటర్లో భారీ అమ్మకాలకు తెరలేచింది.. దీంతో  మార్కెట్‌ ఆరంభంలోనే కుదేలై  43 నెలల కనిష్టాన్ని నమోదు చేసింది.  క్యూ4(జనవరి-మార్చి)లో కంపెనీ నికర లాభం 33 శాతంపైగా క్షీణించి రూ. 590 కోట్లకు పరిమితమైంది. ఎనలిస్టులు రూ.783కోట్లుగా  అంచనా వేశారు.  మొత్తం ఆదాయం కూడా తగ్గి రూ. 7495 కోట్లవద్ద అంతంతమాత్రంగానే  ఆర్జించడం సెంటిమెంట్‌ను భారీగా దెబ్బతీసింది. కన్సాలిడేటెడ్ పన్ను ఖర్చులు 28 శాతం పెరిగి రూ. 232 కోట్లుకు చేరగా,  సేవల వ్యయం 14.7 శాతం పెరిగింది.    యూరోపియన్‌ బిజినెస్‌ పుంజుకోవడంతో ఏకీకృత ఆదాయంలో 10శాతం అభివృద్ధిని సాదించింది. డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో తమకు మంచి  మద్దతు లభించనుందని  సీఈవో సీపీ గూర్నిని తెలిపారు.  అలాగే  నెట్‌ వర్కింగ్‌ బిజినెస్‌  ఒప్పందంనుంచి వైదొలగడంతో  20 మిలియన్ల డాలర్లనష్టం,  బలపడుతున్న దేశీయ  కరెన్సీ రుపీ, కంపెనీ రీ  ప్రొఫైలింగ్‌ కారణంగా ఈ భారీ పతనమని  సీఈవో మిలింద్‌ కులకర్ణి  చెప్పారు .ఫలితాల  ప్రకటన సందర్బంగా వాటాదారులకు రూ.9 డివిడెండ్‌ను సంస్థ  ప్రకటించింది.

కాగా నిర్మాణాత్మక బలహీనతలు, రెవెన్యూ  క్షీణత తదితర కారణాలతో టెక్ మహీంద్రాలో  సెల్‌  కాల్‌ ఇస్తున్నట్టు  డొమెస్టిక్ బ్రోకరేజ్  సంస్థ నిర్మల్ బ్యాంగ్ పేర్కొంది.

 

మరిన్ని వార్తలు