పేరుకు కారు.. పవర్‌కు కుర్రకారు

13 Mar, 2017 03:23 IST|Sakshi
పేరుకు కారు.. పవర్‌కు కుర్రకారు

కారును చూశారుగా ఎలా ఉంది? సూపర్‌ అంటున్నారా? నిజమే. ఈ మధ్యే జెనీవా మోటార్‌ షోలో మొదటిసారి దీన్ని ప్రదర్శించారు. మోటార్‌ షో అంటే చాలా కార్లను ప్రదర్శిస్తారు కదా.. దీని ప్రత్యేకత ఏమిటి? చాలా ఉన్నాయి. ఇది పెట్రోలు, డీజిల్‌లను వాడుకుంటుంది. కరెంటుతో పరుగెడుతుంది. ఓహో.. హైబ్రిడ్‌ కారా? ఊహూ కాదు. విమానాల్లో ఉండే టర్బయిన్లను మీరు చూసే ఉంటారు. అలాంటివే దీంట్లో చిన్నసైజువి ఉంటాయి. పెట్రోలు, డీజిల్‌ వంటి ఇంధనాలతో ఈ టర్బయిన్‌ను నడిపిస్తారు. దాని ద్వారా పుట్టిన శక్తిని విద్యుత్తుగా మార్చి బ్యాటరీల్లో నిల్వ చేస్తారు. ఆ బ్యాటరీలతో కారు దూసుకెళుతుందన్నమాట. బీఎండబ్ల్యూ – ఐ3, చెవీ వోల్ట్‌ వంటి కార్లలో మైలేజీని పెంచేందుకు చిన్న సైజు సాధారణ కంబశ్చన్‌ ఇంజిన్లను ఉపయోగిస్తూంటే.. దీంట్లో ఆ పనిని టర్బయిన్‌లతో చేస్తున్నారు. ఈ తరహా కారు అందుబాటులోకి రావడం ఇదే తొలిసారి. ముందువైపు రెండు, వెనుకవైపు నాలుగు మోటార్లతో నడుస్తుంది ఈ కారు.  

చైనీస్‌ కంపెనీ ‘టెక్‌ రూల్స్‌’ ఈ టెక్నాలజీని ‘టర్బయిన్‌ రీచార్జింగ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్‌’ అని పిలుస్తోంది. ఏంటి దీనివల్ల లాభం? అంటే.. సూపర్‌స్పీడ్‌.. సూపర్‌మైలేజీ అన్న సమాధానం వస్తుంది. దాదాపు 21 గ్యాలన్ల డీజిల్‌ ఇంధనంతో దీన్ని దాదాపు వెయ్యి కిలోమీటర్ల దూరం నడిపించవచ్చు. ఆ... ఏముంది గొప్ప... లీటర్‌కు పది కిలోమీటర్ల మైలేజీ అంతే కదా.. అనుకోవద్దు. ఎందుకంటే విద్యుత్తుతో నడిచే కార్లు ఈ మాత్రం మైలేజీ ఇవ్వడం చాలా గొప్ప... అది కూడా రెండంటే రెండు సెకన్లలో 60 కిలోమీటర్ల స్పీడ్‌ను అందుకోవడం... గరిష్టవేగం 217 కిలోమీటర్ల దాకా ఉండటమంటే ఆషామాషీ కాదు కదా!  ఇంతటి శక్తిని నిల్వ చేసుకునేందుకు దీంట్లో 25 కిలోవాట్‌/గంటల లిథియం – మాంగనీస్‌ ఆౖMð్సడ్‌ బ్యాటరీ ఉంటుంది. దీంతో ఉత్పత్తి అయ్యే శక్తి దాదాపు 1287 హార్స్‌పవర్‌ అంటే ఇదెంత పవర్‌ఫుల్లో అర్థం చేసుకోవచ్చు. ఈ కారులో ఇంకో ప్రత్యేకత ఏమిటంటే.. ఆటోలో మాదిరిగా డ్రైవర్‌ ముందు కూర్చుని ఉంటే.. వెనుక రెండు సీట్లు ఉంటాయి. ఏడాది క్రితం టెక్‌రూల్స్‌ ఈ కారుకు సంబంధించిన పనులు మొదలుపెట్టి.. ప్రస్తుతం వాణిజ్యస్థాయి ఉత్పత్తికి సిద్ధమైంది.  
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

మరిన్ని వార్తలు