వాలీబాల్ ఆడుతుంటే.. నరికి చంపేశాడు!

26 Mar, 2016 08:20 IST|Sakshi
వాలీబాల్ ఆడుతుంటే.. నరికి చంపేశాడు!

పశ్చిమబెంగాల్ రాజధానిలో అమ్మాయిల ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోతోంది. 30 మందితో కలిసి వాలీబాల్ ఆడుతున్న ఓ టీనేజి అమ్మాయిని ఓ యువకుడు మాంసం కత్తితో నరికి చంపేశాడు. సంగీతా ఐచ్ (14) స్థానిక స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఆమె మంచి క్రీడాకారిణి. మర్నాడు మ్యాచ్ ఉందని 30 మంది అమ్మాయిలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా.. సుబ్రత సింఘ అనే యువకుడు ఆమె వద్దకు వచ్చి ప్రేమిస్తున్నట్లు చెప్పాడు. కానీ ఆమె దాన్ని తిరస్కరించడంతో వెంటనే గొడ్డలితో నరికేశాడు. సంగీతను కాపాడేందుకు అక్కడే ఉన్న కోచ్ స్వపన్ దాస్ ప్రయత్నించారు. తాను కూర్చున్న కుర్చీ తీసుకుని దాంతోనే సుబ్రతను కొట్టాలని చూశారు.

సంగీత అక్కడకు దగ్గర్లోనే ఉన్న తన ఇంటివైపు పారిపోవడం మొదలుపెట్టింది. ఈలోపే సుబ్రత ఆమెను పట్టుకుని, పలుమార్లు నరికేసి అక్కడి నుంచి పారిపోయాడు. సంగీత అక్కడే ఉండి ఉంటే అతడు ముందు తనను చంపడానికి వచ్చేవాడని, కానీ ఆమె తప్పించుకునే ప్రయత్నం చేయడంతో వెంటబడి మరీ చంపేశాడని కోచ్ తెలిపారు. ఈ దారుణ హత్య చూసి.. ఆమెతోపాటు వాలీబాల్ ఆడుతున్న కొందరు అమ్మాయిలు కళ్లుతిరిగి పడిపోయారు. స్థానికులు కూడా సుబ్రతను పట్టుకునేందుకు భయపడ్డారు. సంగీత బాబాయ్ గోపాల్‌కు అక్కడకు దగ్గర్లోనే ఫుడ్ స్టాల్ ఉంది. విషయం తెలిసి వెంటనే వచ్చి, ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్దామన్నా ఆటోవాళ్లు ఎవరూ రాలేదు. చివరకు ఒక ఆటో రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లినా అప్పటికే ఆమె మరణించింది.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా