గోవా పోలీసుల అతిథిగా తెహల్కా ఎడిటర్!

21 Nov, 2013 17:42 IST|Sakshi

లైంగిక ఆరోపణలతో ఉద్యోగానికి రాజీనామా చేసిన తెహల్కా పత్రిక ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్పాల్ను గోవా పోలీసులు విచారించనున్నారు. తమ పత్రికలోనే పనిచేస్తున్న మహిళా జర్నలిస్టుకు తాను పంపిన ఈమెయిల్ సందేశం బయటపడటంతో ఆరు నెలల పాటు ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు తేజ్పాల్ గత రాత్రే ప్రకటించారు. పది రోజుల క్రితం గోవాలోని ఓ హోటల్ లిఫ్టులోకి తేజ్పాల్ తనను లాగారంటూ ఆ మహిళా జర్నలిస్టు తెహల్కా మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌధురికి ఫిర్యాదు చేసింది. ఈ అంశంపై చౌధురి చేసిన వ్యాఖ్యల పట్ల మహిళా సంఘాల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. సీనియర్ జర్నలిస్టులు కూడా ఈ సంఘటనపై వెంటనే చర్య తీసుకోవాలని డిమాండు చేశారు. కానీ, దాన్ని సరిచేసుకోడానికి తనకు సమయం అవసరమని ఆమె చెప్పారు.

ఈ మొత్తం సంఘటనపై గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ స్పందించారు. సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ వ్యవహారంపై ప్రాథమిక విచారణ జరిపించాలని ఆదేశించారు. ఈ సంఘటన జరిగిందని చెబుతున్న ఫైవ్స్టార్ హోటల్ సీసీ టీవీ ఫుటేజ్ కావాలని పోలీసులు యాజమాన్యాన్ని అడిగారు. ఈ సంఘటనపై సుమోటోగా విచారణ జరిపే అవకాశం కూడా లేకపోలేదు. బాధితురాలైన మహిళా జర్నలిస్టు నుంచి కూడా వాంగ్మూలం తీసుకునే యోచనలో గోవా పోలీసులు ఉన్నారు. తేజ్పాల్పై ప్రాథమిక విచారణ జరుగుతోందని, ఏదైనా విషయం బయటపడితే మాత్రం సుమోటోగా కేసు నమోదు చేస్తామని పారికర్ చెప్పారు.

>
మరిన్ని వార్తలు