జీతగాళ్లు దొరకని తెలంగాణ కావాలి

23 Aug, 2015 02:10 IST|Sakshi
జీతగాళ్లు దొరకని తెలంగాణ కావాలి

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జీతగాళ్లు కావాలంటే దొరకని పరిస్థితి రావాలని పలువురు విద్యావేత్తలు, ప్రొఫెసర్లు ఆకాంక్షించారు. ఉద్యోగాలు, ఉపాధి కల్పన, విద్య వంటి వాటిలో టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలు అమలు కావడంలేదని  ఆవేదన వ్యక్తంచేశారు. ‘విద్య, ఉపాధి రంగాల్లో హామీలు- నిర్లక్ష్యం’ అంశంపై శనివారమిక్కడి గాంధీభవన్‌లో టీపీసీసీ ఆధ్యర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షత వహించిన సమావేశంలో ప్రొఫెసర్లు కంచె ఐలయ్య, భాగ్య నాయక్, రమేశ్ రెడ్డి, పి.ఎల్.విశ్వేశ్వర్‌రావు, కె.నాగేశ్వర్, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, సీఎల్‌పీ నాయకుడు కె.జానారెడ్డి తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలను కూడా చేశారు.
 
కాషాయీకరణకు బీజేపీ కుట్ర: కంచె ఐలయ్య
 కార్పొరేట్ విద్యకు పెద్దపీట వేసి పేదలకు విద్యను దూరం చేయాలని కేంద్రం కుట్ర పన్నుతోంది. విద్యను కాషాయీకరణ చేసే దురాలోచనలో ఉంది. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 6 వేల పాఠశాలల్లో ఆంగ్ల విద్యను ప్రయోగాత్మకంగా అమలుచేశారు. ప్రజలంతా ఇంగ్లిష్ విద్యను చదువుకుంటే కేసీఆర్‌కు, దొరలకు జీతగాళ్లు దొరకరనే భయం ఉంది.
 
చరిత్రను వక్రీకరిస్తున్నారు: ప్రొ. భాగ్య నాయక్
చరిత్రను కేంద్రం వక్రీకరిస్తోంది. పుష్కరాలకోసం రూ.700 కోట్లు ఖర్చుపెట్టిన ప్రభుత్వం టీచర్లను నియమించలేకపోతోంది.
 
నిర్బంధ విద్య అమలు చేయాలి: విశ్వేశ్వరరావు
ప్రతీ వ్యక్తికి ఉచితంగా నిర్బంధ విద్యను అమలుచేయాలి. రాష్ట్రంలో విద్యావిధానం వల్ల పేదలు విద్యకు దూరం కావాల్సి వస్తోంది. 22 వేల పాఠశాలల్లో మంచినీటి సౌకర్యంలేదు.. 12వేల బడుల్లో మరుగుదొడ్ల సౌకర్యం లేదు. విద్యావ్యవస్థను పూర్తిగా ప్రైవేటు పరం చేసే కుట్ర జరుగుతోంది.
 
విద్య, ఉద్యోగాలపై శ్వేతపత్రం: కె.నాగేశ్వర్

విద్య, ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలున్నా వాటిని భర్తీచేయడం లేదు. ఇంజనీరింగ్ విద్యలో నాణ్యతా ప్రమాణాలను పెంచాలి.
 
సమావేశంలో చేసిన తీర్మానాలు..
కేజీ టు పీజీ ఉచిత విద్యను అమలు చేయాలి.
రీయింబర్సుమెంటు పూర్తిస్థాయిలో ఇవ్వాలి.
జాతీయ విద్యావిధానాన్ని తీసుకురావాలి.
విద్య కాషాయీకరణ ప్రయత్నాలు ఆపాలి.

మరిన్ని వార్తలు