18 తర్వాతే లోక్సభలో తెలంగాణ బిల్లు?

11 Feb, 2014 22:11 IST|Sakshi
18 తర్వాతే లోక్సభలో తెలంగాణ బిల్లు?

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)ను లోక్ సభలో ప్రవేశపెట్టే విషయంపై గందరగోళం నెలకొంది. ఈ నెల 13న లోక్సభలో ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ కోర్‌కమిటీ నిర్ణయించినా అవకాశాలు తక్కువగా ఉన్నట్టు సమాచారం. ఈ నెల 18 తర్వాతే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టే అవకాశముందని పీటీఐ వార్త సంస్థం వెల్లడించింది. ఈ మేరకు విశ్వసనీయం వర్గాల నుంచి సమాచారం అందినట్టు పేర్కొంది. కాగా లోక్ సభలో టీ బిల్లు ప్రవేశపెట్టేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించారు.

తెలంగాణ బిల్లు ఆర్థికపరమైనదా? కాదా? అన్న అంశాలతోపాటు  పార్లమెంటు ఉభయ సభలలో ఏ సభలో ముందు ప్రవేశపెట్టాలి,  ఎప్పుడు ప్రవేశపెట్టాలనేదానిపై  కోర్ కమిటీ సమావేశంలో చర్చించారు. సమావేశం  ముగిసిన తరువాత కేంద్ర హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే లోక్సభ స్పీకర్ మీరా కుమార్ను కలిశారు. ఆరుగురు ఎంపీలు రాయపాటి సాంబశివరావు, సబ్బం హరి, ఉండవల్లి అరుణ్‌ కుమార్, ఎ.సాయి ప్రతాప్, లగడపాటి రాజగోపాల్, జి.వి.హర్ష కుమార్లను పార్టీ నుంచి బహిష్కరించినట్లు తెలిపారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే వారిని సస్పెండ్ చేయాలని షిండే  స్పీకర్‌ను కోరారు. 13న తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు హోం శాఖ వర్గాలు తెలిపాయి. అయితే, 18 తర్వాత అయితే బాగుంటుందని లోక్ సభ బీఏసీలో వినతులు వచ్చాయి.

మరిన్ని వార్తలు