ఈ సమావేశాల్లో తెలంగాణ బిల్లు డౌటే!

30 Nov, 2013 01:55 IST|Sakshi
ఈ సమావేశాల్లో తెలంగాణ బిల్లు డౌటే!

తెలంగాణపై ఒకడుగు ముందుకు, రెండడుగులు వెనక్కు
పార్లమెంటుకు విభజన బిల్లుపై అనుమానాలు
కాంగ్రెస్ కోర్ కమిటీ మల్లగుల్లాలు
అసాధ్యమన్న పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్
శీతాకాల సమావేశాల్లోనే వస్తుందన్న అహ్మద్ పటేల్
వ్యూహాత్మక ఎత్తుగడే అంటున్న ఏఐసీసీ పెద్దలు
3నే కేబినెట్ భేటీ: షిండే


 న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ అధిష్టానం వ్యవహారం ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కు చందంగా సాగుతోంది. తెలంగాణ ముసాయిదా బిల్లు, జీవోఎం నివేదిక పూర్తిగా సిద్ధమయ్యాయని, వాటిని కేబినెట్ ముందు పెట్టడమే తరువాయి అని నిన్నటిదాకా చెప్పిన కాంగ్రెస్ పెద్దలు, వాటన్నింటినీ శీతాకాల సమావేశాల్లోగా పూర్తి చేయలేమన్న సంకేతాలిస్తూ తాజాగా మళ్లీ గందరగోళానికి తెర తీశారు. అంతా అయిపోతుందని ఒక నాయకుడు, ఎలా అవుతుందంటూ మరో నాయకుడు శుక్రవారం పరస్పరం గందరగోళపరిచే వ్యాఖ్యలు చేశారు. పార్టీ నేతల భేటీలు, జీవోఎం సభ్యుల సమాలోచనలు, కోర్‌కమిటీ భేటీ... ఇలా రోజంతా హస్తినలో ఎక్కడికక్కడ సమావేశాలు జరిగినా అవేవీ ఏ అంశంపైనా ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు.

  అన్ని చోట్లా పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు, అంచనాలతో మొత్తం వ్యవహారాన్ని మరింత చిక్కుముడిగా మార్చారు. డిసెంబర్ 5 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్నాయని తెలిసి కూడా, ఇంతకాలంగా చేస్తూ వచ్చిన హడావుడిని కూడా తీరా సమయం సమీపిస్తున్న ఈ తరుణంలో అధిష్టానం నెమ్మదింపజేసింది. పలు అంశాల సాధ్యాసాధ్యాలపై శుక్రవారం హడావుడిగా తర్జనభర్జనలు సాగించింది. ఒకవైపు పార్లమెంటులో బిల్లు పెట్టడంపై మల్లగుల్లాలు పడుతూనే, మరోవైపు రాయల తెలంగాణ అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చి, దానివల్ల రాబోయే ఎన్నికల్లో ఎన్ని సీట్లొస్తాయా అని మరోసారి బేరీజు వేసుకుంది.

  ‘రాయల’ను సీరియస్‌గా పరిశీలిస్తున్నామని ఒకవైపు అంటూనే, మరోవైపు పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టడం సాధ్యం కాదన్న సంకేతాలను పంపింది. ప్రధాని మన్మోహన్‌సింగ్ నివాసంలో సోనియాగాంధీ అధ్యక్షతన శుక్రవారం జరిగిన కాంగ్రెస్ కోర్‌కమిటీ సమావేశంలోనూ రాయల తెలంగాణ, శీతాకాల సమావేశాల్లో బిల్లు అంశాల పైనే ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. సభ్యుల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో మరింత లోతుగా చర్చించే బాధ్యతను జీవోఎంపై పెట్టారని, రాబోయే కేబినెట్‌లో కూలంకుషంగా చర్చించి నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయానికి వచ్చారని సమాచారం. 70 నిమిషాలు జరిగిన కోర్‌కమిటీ సమావేశం వీటిపై ఎటూ తేలకుండానే ముగిసినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రివర్గ సమావేశాన్ని మాత్రం డిసెంబర్ 4న కాకుండా 3నే జరపాలన్న అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. తెహల్కా వివాదం, నరేంద్ర మోడీపై స్నూప్ గేట్ గొడవలతో పాటు పార్లమెంటు సమావేశాల్లో విపక్షాలు లేవనెత్తే అవకాశమున్న ధరల పెరుగుదల తదితరాలు కూడా కోర్ కమిటీలో చర్చకు వచ్చాయని సమాచారం.

 బిల్లుపై పలు మాటలు
 పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు వస్తుందా, రాదా అన్నదానిపై కోర్‌కమిటీ భేటీలో పాల్గొన్న నేతల మధ్యే భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సాయంత్రం 5.45 గంటలకు జరిగిన ఈ భేటీలో మన్మోహన్, సోనియాలతో పాటు కేంద్ర మంత్రులు ఏకే ఆంటోనీ, సుశీల్‌కుమార్‌షిండే, చిదంబరం, అహ్మద్‌పటేల్ హాజరయ్యారు. కోర్ కమిటీ సభ్యుడు కాని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్‌ను కూడా భేటీకి ప్రత్యేకంగా పిలిపించారు. శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు సాధ్యాసాధ్యాలపైనే చర్చించినట్టు పార్టీ అత్యున్నత వర్గాలు వెల్లడించాయి. భేటీలో దాదాపు 40 నిమిషాలు పాల్గొన్న కమల్‌నాథ్ మాత్రం శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టడం అసాధ్యమన్నట్టు తెలిసింది. ‘‘సమావేశాలు మరో వారం రోజుల్లో మొదలవనున్నాయి. విభజన బిల్లు ఇంకా కేబినెట్ ఆమోదమే పొందలేదు. అదయ్యాక రాష్ట్రపతికి, అటు నుంచి అసెంబ్లీకి, తిరిగి రాష్ట్రపతి ద్వారా పార్లమెంటుకు బిల్లు రావాల్సి ఉంటుంది.

 ఇదంతా పూర్తవడానికి కనీసం నెల రోజులైనా అవసరం. గతంలో జరిగిన రాష్ట్రాల పునర్విభజన బిల్లుల ప్రక్రియ ఇంతకంటే ఎక్కువ సమయమే తీసుకుంది. కాదని ఇప్పుడు హడావుడిగా బిల్లు తీసుకొస్తే ఇటు పార్లమెంటులో, అటు న్యాయస్థానంలో రాజ్యాంగపరమైన విమర్శలు తప్పకపోవచ్చు’’ అని ఆయన చెప్పుకొచ్చారు. కానీ సోనియా మాత్రం శీతాకాల సమావేశాల్లోనే బిల్లును తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని, అందుకు అన్ని మార్గాలనూ అన్వేషించాలని సూచించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 16 తరవాత బిల్లును పార్లమెంటులో పెట్టేలా ఇటీవల రూపొందించిన ప్రణాళికను అమలు చేయాలని సూచించినట్టు సమాచారం. కానీ భేటీ నుంచి మధ్యలోనే బయటికొచ్చిన కమల్‌నాథ్‌ను కొందరు విలేకరులు శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు వస్తుందా అని అడగ్గా, ఎలా సాధ్యమవుతుందని బదులిస్తూ వెళ్లిపోయారు. అహ్మద్‌పటేల్ మాత్రం భేటీ తర్వాత తన వద్దకు వచ్చిన కొందరు విలేకరులతో శీతాకాల సమావేశాల్లోనే బిల్లు వస్తుందని చెప్పారు!

 గందరగోళ వ్యూహమే!
 పార్లమెంటు శీతాకాల సమావేశాల గడువు తక్కువున్న తరుణంలో విభజన బిల్లు పార్లమెంటు ముందుకు రావడం సాధ్యమేనా అనే ధర్మ సందేహం సర్వత్రా విన్పిస్తుండటం తెలిసిందే. ఇలాంటి సమయంలో, ఒకవైపు విభజన ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్టు జీవోఎం పేరిట హడావుడి చేస్తున్న అధిష్టానం పెద్దలు మళ్లీ రాయల తెలంగాణను తెరపైకి తేవడం పార్టీ నేతలను గందరగోళంలో పడేసింది. పెద్దల వ్యూహం వెనుక పలు రాజకీయ కోణాలున్నట్టు కోర్‌కమిటీ సభ్యులకు సన్నిహితంగా మెలిగే కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. విభజన విషయంలో హైదరాబాద్, రాయల తెలంగాణ, భద్రాచలం వంటివి తమకు సమస్యే కాదని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే రెండ్రోజుల క్రితమే చెప్పిన విషయాన్ని ఇంకా మరువక ముందే రాయల తెలంగాణ ప్రతిపాదనపై ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో దిగ్విజయ్‌సింగ్, జైరాం రమేశ్ చర్చించ డంతో, అధిష్టానం కొత్త ప్రణాళికతో ముందుకు వెళ్తోందన్న అభిప్రాయం వ్యక్తమైంది.

 కేబినెట్ భేటీపైనా అస్పష్టత !
 ఇక కేంద్ర కేబినెట్ తదుపరి సమావేశం ఎప్పుడన్న విషయంలోనూ అస్పష్టత ఏర్పడింది. షెడ్యూల్ ప్రకారం అది డిసెంబర్ 4న జరగాల్సి ఉంది. తెలంగాణ బిల్లుతో పాటు జీవోఎం నివేదికను ఆమోదించడమే ప్రధాన ఎజెండాగా ఈ భేటీ జరుగుతుందని గురువారం జీవోఎం సభ్యులు చెప్పుకొచ్చారు. అయితే షిండే శుక్రవారం ఉదయం కొందరు మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ డిసెంబర్ 3న జీవోఎం సమావేశంతోపాటు కేబినెట్ భేటీ కూడా జరగవచ్చని చెప్పారు. జైరాం మాత్రం 3న జీవోఎం భేటీ, 4న కేబినెట్ భేటీ జరుగుతాయని చెప్పారు.

 కోట్ల నివాసంలో సీమాంధ్ర కేంద్ర మంత్రుల భేటీ
 ఒకవైపు కాంగ్రెస్ కోర్‌కమిటీ సమావేశమవుతున్న సమయంలోనే రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి నివాసంలో కేంద్ర మంత్రులు చిరంజీవి, జేడీ శీలం సమావేశమయ్యారు. రాయల తెలంగాణపై సీమాంధ్ర కేంద్ర మంత్రుల మధ్య ఏకాభిప్రాయం తెచ్చే అంశంపైనే చర్చించినట్టు తెలిసింది. హైదరాబాద్‌ను పదేళ్లపాటు కేంద్రపాలిత ప్రాంతం చేసేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే ఉండాలని కూడా నిర్ణయించినట్టు నేతలు పేర్కొన్నారు.
 

>
మరిన్ని వార్తలు