మైనారిటీలకు సీఎం వరాలు

13 Oct, 2016 09:00 IST|Sakshi
మైనారిటీలకు సీఎం వరాలు

ఓ ముస్లిం నేతకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం
♦  షేక్‌ బుర్హాన్‌కు ఎమ్మెల్సీ పదవి
♦  ప్రభుత్వ సలహాదారుగా షఫీఖ్‌ ఉజ్‌ జమా
♦  ప్రతి కార్పొరేషన్‌లో ముగ్గురు, నలుగురు ముస్లిం డైరెక్టర్లు
♦  మైనారిటీలకు 100% సబ్సిడీ..  
♦  ఎస్సీ, ఎస్టీల తరహాలో ముస్లిం రైతులకు సహకారం
♦  500 మైనారిటీ రెసిడెన్షియల్‌ స్కూళ్ల ఏర్పాటు


సాక్షి, హైదరాబాద్‌: ముస్లింలు నిరాశ, నిస్పృహలను వీడి ప్రభుత్వ కార్యక్రమాలలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. ముస్లింలకు ఏదో ఒక పదవి ఇచ్చి సంతోషపెట్టడం తన నైజం కాదని, జనాభా దామాషా ప్రకారం వారికి అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ తరఫున త్వరలో ఒక ముస్లిం నేతను రాజ్యసభకు పంపుతామని, పార్టీకి తొలి నుంచి సేవచేస్తున్న ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షుడు షేక్‌ బుర్హాన్‌కు తదుపరి విడతలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. కార్పొరేషన్ల పదవుల్లోనూ ముస్లింలకు సరైన ప్రాతినిధ్యం కల్పిస్తామని, ఒక్కో కార్పొరేషన్‌లో ముగ్గురు నలుగురికి డైరెక్టర్లుగా అవకాశమిస్తామని పేర్కొన్నారు. త్వరలో రాష్ట్ర హజ్‌ కమిటీతో పాటు మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్, ఉర్దూ అకాడమీ తదితర పదవులను భర్తీ చేస్తామని చెప్పారు. మైనారిటీల సంక్షేమ వ్యవహారాలకు సంబంధించి రిటైర్డ్‌ ఐఏఎస్‌ షఫీక్‌ ఉజ్‌ జమాను ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తామన్నారు. ఈ ఏడాది మైనారిటీలకు రూ.1,200 కోట్లు బడ్జెట్‌ కేటాయించామని, వచ్చే ఏడాది రూ.1,500 కోట్లకు పెంచుతామని ప్రకటించారు. దసరా పండుగ సందర్భంగా మంగళవారం సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి అన్ని జిల్లాల ముస్లిం, క్రైస్తవ టీఆర్‌ఎస్‌ నాయకులతో పాటు ముస్లిం ఉన్నతాధికారులు, రిటైర్డ్‌ అధికారులను ఆహ్వానించి విందు ఇచ్చారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, మంత్రి కేటీఆర్‌లతో కలసి ముస్లింల సమస్యలపై నాలుగు గంటల పాటు చర్చించారు. మత సామరస్యానికి ప్రతీక అయిన తెలంగాణ గంగా జమున తెహజీబ్‌లో భాగంగా హిందూ ముస్లింలు ఒకరి పండుగలను మరొకరితో కలిసి జరుపుకొంటారని, రంజాన్‌ పండుగకు ముస్లిం సోదరులు తనను ఆహ్వానించిన తరహాలోనే దసరా పండుగకు ముస్లింలను ఆహ్వానించానని చెప్పారు.

నాలుగేళ్లలో 500 మైనారిటీ రెసిడెన్షియల్‌ స్కూళ్లు
మైనారిటీల పిల్లల కోసం ప్రారంభించిన 71 రెసిడెన్షియల్‌ పాఠశాలలకు మంచి స్పందన లభించిందని.. 14 వేల సీట్లకు 48 వేల దరఖాస్తులు వచ్చాయని సీఎం కేసీఆర్‌ చెప్పారు. వచ్చే ఏడాది మరో 89 స్కూళ్లను ప్రారంభించాలని నిర్ణయించామని.. ఉపాధ్యాయుల నియామకాలు ప్రారంభిస్తామని తెలిపారు. రానున్న నాలుగేళ్లలో మైనారిటీ రెసిడెన్షియల్‌ సూళ్ల సంఖ్యను 500కు పెంచు తామని.. వీటి ద్వారా ఇంటర్మీడియెట్‌ వరకు విద్య అందిస్తామని ప్రకటించారు. మైనారిటీ స్కూళ్ల స్థాపన పట్ల కేంద్ర మైనారిటీల వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ ఆకర్షితుడై రాష్ట్రానికి రూ.100 కోట్లు మంజూరు చేశారని... తదుపరి ప్రతిపాదనలు పంపిస్తే ఇంకా నిధులిస్తామని హామీ ఇచ్చారని కేసీఆర్‌ తెలిపారు. 25 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్న నిరుద్యోగ ముస్లింలకు బ్యాంకు లింకేజీతో సంబంధం లేకుండా 100 శాతం రాయితీతో స్వయం ఉపాధి కొత్త పథకాలను ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు సమానంగా ముస్లిం రైతులకు ట్రాక్టర్ల పంపిణీ, ఇతర పథకాలను వర్తింపజేస్తామని చెప్పారు. రంజాన్‌ సందర్భంగా ఈ ఏడాది 200 మసీదుల్లో పేద ముస్లింలకు దుస్తులు పంపిణీ చేశామని, వచ్చే ఏడాది 400 మసీదుల్లో పంచాలని నిర్ణయించామని తెలిపారు.

ప్రతి నెలా సమీక్షిస్తా..
మైనారిటీల సంక్షేమ పథకాల అమలుపై డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, రిటైర్డ్‌ ఐఏఎస్‌ షఫీఖ్‌ ఉజ్‌ జమా తదితరులతో ఓ కమిటీ ఏర్పాటు చేసి ప్రత్యేక అధికారాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. తాను వారితో ప్రతి నెలా ఒక రోజు సమావేశమే సమీక్ష జరుపుతానన్నారు. గత పాలకుల పాపాలతో రాష్ట్రంలో లక్షల ఎకరాల వక్ఫ్‌ భూములు అన్యాక్రాంతం అయ్యాయన్నారు. వక్ఫ్‌ ట్రిబ్యునల్‌ ఏర్పాటు, వక్ఫ్‌ బోర్డుకు జ్యుడీషియల్‌ అధికారాలు కల్పించే అంశంపై పరిశీలన జరుపుతున్నామని చెప్పారు. వక్ఫ్‌ బోర్డు, మైనారిటీ శాఖల ఉద్యోగుల పనితీరు బాగా లేదని, వారి పనితీరును సమీక్షించి పటిష్ట యంత్రాంగాన్ని రూపొందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు షకీల్‌ అమీర్, స్టీఫెన్‌సన్, ఎమ్మెల్సీలు సలీం, ఫారుఖ్‌ హుస్సేన్, మైనారిటీ కమిషన్‌ చైర్మన్‌ చెల్లప్ప, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు