ఆ సీటు రద్దయింది

24 Sep, 2015 23:55 IST|Sakshi

సుప్రీంలో టీ సర్కార్ అఫిడవిట్
సాక్షి, న్యూఢిల్లీ: కళింగ సామాజిక వర్గాన్ని బీసీ కులాల జాబితా నుంచి తొలగించడంతో మెడిసిన్‌లో ప్రవేశం కోల్పోయిన ఓ విద్యార్థికి సంబంధించిన పిటిషన్ విచారణలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. గత వారం ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు విద్యార్థి తరపున న్యాయవాది సుబ్బారావు వాదనలు వినిపిస్తూ.. హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు ఆధారంగా మెడిసిన్‌లో సీటు పొందారని, ఆ సందర్భంలో ఫీజు కూడా చెల్లించారని, ఆ తరువాత హైకోర్టు డివిజన్ బెంచి ఇచ్చిన తీర్పుతో ఆ సీటు రద్దయిందని, మరోసారి సీటు అంశం పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.

దీంతో ప్రధాన న్యాయమూర్తి హెచ్.ఎల్.దత్తు నేతృత్వంలోని ధర్మాసనం సీటు ఉంటే పరిశీలించాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. హైకోర్టు తీర్పుతో సీటు రద్దయిందని, ఇప్పుడు సీట్లు కూడా లేవని, ఫీజు త్వరగా వెనక్కి ఇచ్చేస్తామంటూ ప్రభుత్వం గురువారం అఫిడవిట్ సమర్పించింది. దీంతో ధర్మాసనం ఈ ఏడాదికి ఏమీ చేయలేమని పేర్కొంది. అయితే కళింగ, శెట్టి బలిజ కులాలను బీసీ జాబితా నుంచి తొలగించిన అంశంపై మాత్రం విచారణ కొనసాగనుంది.

మరిన్ని వార్తలు