అదంతా కృష్ణా నీరే!

6 Dec, 2016 05:21 IST|Sakshi
అదంతా కృష్ణా నీరే!

- కృష్ణలోకి చేరేదంతా ఆ నది నీటికిందే లెక్క
- పట్టిసీమ నీటి వినియోగం లెక్కలోకి రావాల్సిందే
- బోర్డుకు స్పష్టం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం లేఖ..
- పట్టిసీమ వినియోగాన్ని మినహాయించినా తమకు 56 టీఎంసీలు దక్కుతాయని వివరణ


సాక్షి, హైదరాబాద్:
కృష్ణా బేసిన్‌లోకి పట్టిసీమ నుంచి వచ్చిన నీటిని లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ చేస్తున్న వాదనను తెలంగాణ తిప్పికొట్టింది. ఎక్కడి నుంచి వచ్చినా కృష్ణాలో కలిశాక అదంతా కృష్ణా నీరే అవుతుందని స్పష్టం చేసింది. ఒక నది నుంచి మళ్లిస్తూ కృష్ణాలో కలిపిన నీటిని కృష్ణా నీటిగా కాకుండా వేరుగా పరిగణించలేమని పేర్కొంటూ కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం సోమవారం లేఖ రాసింది.పట్టిసీమ, మైనర్ ఇరిగేషన్ వాడకం, తెలంగాణకు దక్కాల్సిన వాటాలపై ఈ లేఖలో స్పష్టత ఇస్తూనే... రబీ అవసరాలకు నీటి విడుదలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరింది.

నాగార్జునసాగర్ కన్నా దిగువన ఉన్న పరీవాహక ప్రాంతంలో కురిసిన వర్షాలతో, సాగర్ నుంచి నీటిని విడుదల చేయడం వల్ల ప్రకాశం బ్యారేజీలోకి నీరువస్తుందని... అయితే ఈ ఏడాది ఏపీలో ఈశాన్య రుతు పవనాలతో కురిసిన వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీకి చెప్పుకోదగ్గ ప్రవాహాలు వచ్చాయని తెలిపింది. ఈ దృష్ట్యా సాగర్, శ్రీశైలం నుంచి దిగువకు నీటిని విడుదల చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇక కృష్ణా బేసిన్‌లోకి ఈ ఏడాది మొత్తంగా 342.22 టీఎంసీల నీరు వచ్చిందని... అందులో ఏపీ 216.04 టీఎంసీలు వాడాల్సి ఉన్నా 242.48 టీఎంసీల మేర వాడిందని తెలిపింది. అదే తెలంగాణకు 126.18 టీఎంసీలు వాడుకునే అవకాశమున్నా 99.74 టీఎంసీలను మాత్రమే వినియోగిం చుకున్నామని వివరించింది. ఏపీ పట్టిసీమ ద్వారా వినియోగించిన నీటి లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే తెలంగాణకు 74 టీఎంసీలు దక్కుతాయని... ఒకవేళ పట్టిసీమను పక్కనపెట్టినా 56 టీఎంసీలు దక్కుతాయని స్పష్టం చేసింది.

మైనర్ వినియోగం 20 టీఎంసీలే..
మైనర్ ఇరిగేషన్ కింద 89.15 టీఎం సీలను తెలంగాణ వినియోగిస్తుందన్న ఏపీ వాదనలపైనా వివరణ ఇచ్చింది. ఈ ఏడా ది మొత్తంగా మైనర్ ఇరిగేషన్ కింద 32.3 టీఎంసీల మేర నీటి లభ్యత ఉన్నప్పటికీ.. అందులో భారీ ప్రాజెక్టులైన భీమా, కల్వ కుర్తి, నెట్టెంపాడు, ఎస్‌ఎల్‌బీసీల ద్వారా చెరువుల్లోకి వచ్చిన నీరు 7.355 టీఎంసీ లని తెలంగాణ స్పష్టం చేసింది. మొత్తం నీటిలో డెడ్ స్టోరేజీ కింద 4.85 టీఎంసీ లను తీసివేస్తే తెలంగాణ వినియోగం 20.09 టీఎంసీలేనని తెలిపింది.

మరిన్ని వార్తలు