రూ. 1,000 కోట్ల పైమాటే..

16 Jul, 2017 04:00 IST|Sakshi

- పెరిగిన రిజిస్ట్రేషన్ల శాఖ తొలి త్రైమాసిక ఆదాయం
- గత ఏడాదితో పోలిస్తే రూ. 40 కోట్లకు పైగా రాబడి
- డాక్యుమెంట్ల సంఖ్య తగ్గినా ఆదాయంలో పెరుగుదల
- రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ జిల్లాల్లో అధికం
- జీఎస్టీ ఎఫెక్ట్‌తో జూన్‌ చివరి వారంలో భారీగా రిజిస్ట్రేషన్లు


సాక్షి, హైదరాబాద్‌:
రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఆశించిన స్థాయిలోనే వచ్చిందని గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం ఈసారి తొలి మూడు నెలల్లో వృద్ధి కనిపించింది. గత ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి జూన్‌ 30 వరకు రూ.960 కోట్లు రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం రాగా,ఈసారి అది 1,000 కోట్లు దాటింది. ఈ ఏడాది ఏప్రిల్‌1 నుంచి జూన్‌ 30 వరకు 1,001.67 కోట్ల ఆదాయం వచ్చింది. ఇటీవల వెలుగులోకి వచ్చిన భూ అక్రమాల నేపథ్యంలో ఎనీవేర్‌ రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం రద్దు చేయడంతో రెండు నెలల పాటు ఆదాయం పడిపోయినా మళ్లీ పుంజుకుని గత ఏడాది కన్నా ఎక్కువ ఆదాయం వచ్చింది. అయితే, వస్తుసేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చిన నేపథ్యంలో జూన్‌ నెలలో భారీగా రిజిస్ట్రేషన్లు జరగడంతో ఊపిరి పీల్చుకున్నామని, లేదంటే ఈ ఏడాది ఆదాయం తగ్గిపోయే పరిస్థితి ఉండేదని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెబుతుండడం విశేషం.

డాక్యుమెంట్లు తక్కువ... ఆదాయం ఎక్కువ
తొలి మూడు నెలల్లో రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాల గణాంకాలను పరిశీలిస్తే రిజిస్ట్రేషన్‌ లావాదేవీల సంఖ్య తగ్గింది. కానీ, ఆదాయం మాత్రం గత ఏడాది తొలి త్రైమాసికంతో పోలిస్తే 5శాతం మేర పెరిగింది. 2016 ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు రాష్ట్రంలో మొత్తం 2,88,895 రిజిస్ట్రేషన్‌ లావాదేవీలు జరగ్గా, రూ.960.25 కోట్ల మేర ఆదాయం వచ్చింది. అదే 2017 ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు జరిగిన రిజిస్ట్రేషన్‌ లావాదేవీల సంఖ్య 2,39,055 మాత్రమే. అంటే గత ఏడాదితో పోలిస్తే 50వేల వరకు తగ్గాయి. కానీ, ఆదాయం మాత్రం రూ.1,001.67 కోట్లకు చేరింది. ఇక, జిల్లాల వారీగా పరిశీలిస్తే ఈసారి ఆదాయం పెరిగింది మూడు జిల్లాల్లోనే కాగా, మిగిలిన అన్ని చోట్లా తగ్గింది. రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ జిల్లాల్లో మాత్రం ఈసారి రిజిస్ట్రేషన్ల ఆదాయం భారీగా పెరిగింది. రంగారెడ్డిలో గత ఏడాది త్రైమాసికంలో రూ.525 కోట్ల ఆదాయం రాగా, ఈసారి అది రూ.580.72 కోట్లకు చేరింది. హైదరాబాద్‌లో గత ఏడాది రూ.150 కోట్లకు పైగా ఉండగా, ఈసారి రూ.161 కోట్లు నమోదయింది. ఈ రెండు జిల్లాల తర్వాత నల్లగొండ జిల్లాలో ఈసారి రిజిస్ట్రేషన్ల ఆదాయం భారీగా పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాది తొలి త్రైమాసికంలో జిల్లా పరిధిలో రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.47.24 కోట్ల మేర ఆదాయం రాగా, ఈసారి ఏకంగా అది రూ.58.69 కోట్లకు చేరింది. ఈ మూడు జిల్లాల్లో కలిపి రూ.86 కోట్ల వరకు అదనపు ఆదాయం రావడం గమనార్హం. ఇక, వరంగల్‌లో మాత్రం గత ఏడాది కన్నా ఒక లక్ష మాత్రమే ఎక్కువ ఆదాయం వచ్చింది. మిగిలిన జిల్లాలో కొంత మేర రిజిస్ట్రేషన్ల ఆదాయంలో తగ్గుదల కనిపించడం గమనార్హం.

జీఎస్టీ ఎఫెక్ట్‌...
జీఎస్టీ అమలయితే రిజిస్ట్రేషన్ల ధరలు కూడా పెరుగుతాయన్న అంచనాల నేపథ్యంలో బిల్డర్లు, మధ్య, ఎగువ తరగతి ప్రజానీకం ముందు జాగ్రత్తగా జూన్‌ నెలలో పెద్ద సంఖ్యలో రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. దీంతో చివరివారంలో రిజిస్ట్రేషన్ల కార్యాలయాలు కిటకిటలాడాయి.

మరిన్ని వార్తలు