టీడీపీలో ఆట మొదలైంది

11 Sep, 2015 03:15 IST|Sakshi
టీడీపీలో ఆట మొదలైంది

ఇంతకూ రేవంత్‌కు ఏ పదవి!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ టీడీపీలో ఆట మొదలైంది. పార్టీలో కీలకమైన పదవుల కోసం సీనియర్లు పోటీ పడుతున్నారు. ఒకింత ఆలస్యంగానైనా, పార్టీ అధినేత చంద్రబాబు ఏపీ, తెలంగాణల్లో రాష్ట్ర కమిటీల ఏర్పాటుపై కసరత్తు మొదలుపెట్టడంతో పదవి కోసం లాబీయింగ్ ఊపందుకుంది. ఈ వారాంతంలోగా పార్టీ పదవుల భర్తీ ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలు ఆశపడుతున్నారు. కాగా, తెలంగాణ కమిటీకి అధ్యక్షుడిగా ఎవరిని చేస్తారనే అంశం ఆసక్తి రేపుతోంది.

రాష్ట్ర విభజన తర్వాత అప్పటికప్పుడు ఏపీ కమిటీలో ఉన్న నేతలతోనే తెలంగాణకు ప్రత్యేక కమిటీని ప్రకటించారు. మాజీ మంత్రి ఎల్.రమణ అధ్యక్షుడిగా, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఏర్పాటైన ఆ కమిటీ పదవీ కాలం మహానాడుతోనే ముగిసింది. కమిటీ కొత్త అధ్యక్షుడు, ఇతర కార్యవర్గ పదవులు ఎవరికి దక్కుతాయో ఇప్పటి దాకా సస్పెన్స్‌గానే ఉంది.
 తెలంగాణ రాష్ట్ర కమిటీకి కొత్త అధ్యక్షుడు, ఇతర పదవుల భర్తీపై పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ ముఖ్యులతో చర్చిస్తున్నట్లు తెలియగానే తెలంగాణ టీడీపీ నేతలు ఎవరి ప్రయత్నాల్లో వారు పడిపోయారు.

మొదటి నుంచీ అధ్యక్ష పదవిపై కన్నేసిన, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఈ సారి ఎలాగైనా పదవి దక్కించుకోవాలన్న పట్టుదలతో ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు చెబుతున్నారు. శాసన మండలి ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు డబ్బులిస్తూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన రేవంత్.. ‘ఓటుకు కోట్లు’ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో బెయిల్‌పై బయట ఉన్న ఆయనపై ఉన్న షరతులను కూడా కోర్టు ఎత్తివేయడంతో ఇక, ఏ ఇబ్బందీ ఉండదన్న అభిప్రాయానికి వచ్చారని, తెలంగాణలో పార్టీకి తన అవసరమే ఎక్కువ ఉందని ఆయన సన్నిహితుల వద్ద కూడా అభిప్రాయపడినట్లు సమాచారం.

దీంతో అధినేత చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చే పనిలో బిజీగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ కారణంగానే మాట ఎత్తితే తెలంగాణ సీఎం కేసీఆర్ లక్ష్యంగా ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్న రేవంత్.. తనను తాను రాష్ట్ర స్థాయి నేతగా రుజువు చేసుకునే పనిలో పడ్డారని అంటున్నారు. అయితే, ఇప్పటికే ఓ సారి అధ్యక్షుడిగా పనిచేసిన ఎల్.రమణ వెనకబడిన వర్గాల కోటాలో ఈసారీ తనకే అవకాశం వస్తుందన్న నమ్మకంతో ఉన్నారని అంటున్నారు. దీంతో అధ్యక్ష పదవి రేసులో ఈ ఇద్దరు నేతలు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.
 
మరోవైపు టీ టీడీఎల్పీ నేతగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్‌రావు పార్టీ పదవినీ ఆశిస్తున్నారు. ఆయన తొలి కమిటీలో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ఈ సారి తనకు అవకాశం వస్తుందో రాదో అన్న బెంగ ఆయనలో ఉంది. అయినా, చివరి దాకా అధినేతను మెప్పించి పదవి పొందే ప్రయత్నమే చేస్తున్నారని చెబుతున్నారు. వర్గ సమీకరణలు కుదరక, ఒక వేళ రేవంత్‌రెడ్డికి అధ్యక్ష పదవి ఇవ్వని పక్షంలో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు ఇచ్చే అవకాశం లేకపోలేదని కూడా పేర్కొంటున్నారు.

ఇదే జరిగితే ఎర్రబెల్లి, రేవంత్ మధ్య ఆధిపత్య పోరు తప్పక పోవచ్చని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. తెలంగాణలో పార్టీ రోజురోజుకూ ఇబ్బందుల్లో పడుతున్న నేపథ్యంలో, తెలంగాణ సీఎం కేసీఆర్ పట్ల దూకుడుగా ఉండే రేవంత్‌రెడ్డి వైపు పార్టీ నాయకత్వం మొగ్గు చూపే అవకాశం ఉందంటున్నారు.

ఓటుకు కోట్లు కేసులో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ఇబ్బందులు పడ్డారన్న సానుభూతి పార్టీ అగ్ర నాయకత్వంలో ఉందని, ఇది ఒక రకంగా రేవంత్‌కు లాభించే అంశమని అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా ఎల్.రమణ, ఎర్రబెల్లి, రేవంత్‌ల మధ్యే అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షుని పదవులు దోబూచులాడుతున్నాయని పేర్కొంటున్నారు. వీరిలో అధినేత ఎవరి వైపు మొగ్గు చూపుతారు..? అది పార్టీలో ఎలాంటి అంతర్గత పోరాటానికి దారి తీస్తుందో వేచి చూడాల్సిందే.

>
మరిన్ని వార్తలు