తెలంగాణ విజయ డెయిరీ ఏర్పాటు

5 Mar, 2016 03:46 IST|Sakshi
తెలంగాణ విజయ డెయిరీ ఏర్పాటు

పాడి అభివృద్ధి సహకార సమాఖ్యగా రిజిస్ట్రేషన్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పాడి అభివృద్ధి సహకార సమాఖ్య (విజయ డెయిరీ) విభజన ప్రక్రియ మొదలైంది. తెలంగాణ రాష్ట్ర పాడి అభివృద్ధి సహకార సమాఖ్య పేరుతో రిజిస్ట్రేషన్ పూర్తయింది. అందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని శుక్రవారం తెలంగాణ విజయ డెయిరీ అధికారులు అందుకున్నారు. అయితే తెలంగాణలోనూ విజయ డెయిరీ పేరే కొనసాగనుంది. ఇప్పటివరకు ఉమ్మడి రాష్ట్రానికి చెందిన ఏపీ డెయిరీకి చైర్మన్‌గా మన్మోహన్‌సింగ్ ఉండగా, తెలంగాణ విజయ డెయిరీ చైర్మన్‌గా తెలంగాణ పశు సంవర్థక శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌చందా వ్యవహరించనున్నారని విజయ డెయిరీ వర్గాలు తెలిపాయి.

దశల వారీగా ఆస్తుల విభజన ప్రక్రియ జరగనుంది. ఏపీలో 52 మంది ఉద్యోగులుండగా, తెలంగాణ డెయిరీలో 390 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కాగా, ఏపీలోనూ తెలంగాణ పాల సేకరణ ఉన్నందున కలసి పనిచేస్తామని ఉద్యోగులు చెబుతున్నారు. ఇదిలాఉండగా ఏపీ డెయిరీకి గత పదేళ్లకు పైగా ఎన్నికలు జరగలేదు. డెయిరీ విభజన పూర్తిస్థాయిలో జరిగి తెలంగాణ డెయిరీ ఏర్పడ్డాక పాడి సహకార ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుందని వ్యవసాయ మంత్రి కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని వార్తలు