గల్ఫ్ జిందగీ : సౌదీలో ఒక్కొక్కరిది ఒక్కో బాధ

21 Jul, 2017 23:16 IST|Sakshi
గల్ఫ్ జిందగీ : సౌదీలో ఒక్కొక్కరిది ఒక్కో బాధ

సాక్షి, హైదరాబాద్‌:
31 లక్షల మంది భారతీయులు సౌదీ అరేబియాలో నివసిస్తున్నారని భారత ప్రభుత్వం ఇటీవల పార్లమెంటులో ప్రకటించింది. వీరిలో తెలంగాణ వారు 4 లక్షల మంది, ఆంద్రప్రదేశ్ వారు 4 లక్షల మంది ఉంటారని ఒక అంచనా.

సౌదీ నుండి భారత్ కు ప్రతియేటా 11 బిలియన్ డాలర్ల విదేశీ మారకద్రవ్యం వస్తున్నది. యూఏఈ (13.2), అమెరికా (11.5) తర్వాత సౌదీ మూడవ స్థానంలో ఉన్నది.  

క్షమాభిక్షకు ఎవరు అర్హులు
హజ్, ఉమ్రా, విజిట్ వీసాల 'ఓవర్  స్టేయర్స్' (గడువుమీరిన వారు), సౌదీలో జన్మించిన పిల్లలు, 'హురూబ్' (పారిపోయిన ప్రవాసి ఉద్యోగి), 'అఖామా' (సౌదీ ప్రభుత్వం జారీచేసే గుర్తింపు కార్డు) ఎక్సపెయిర్ అయినవారు, ఆఖామా జారీకాని వారు, ఎగ్జిట్ వీసా ఎక్సపెయిర్ అయినవారు, యజమాని రెడ్ క్యాటగిరీలో ఉన్నవారు, యజమాని చనిపోయినవారు, అక్రమమార్గాల ద్వారా సౌదీలోకి ప్రవేశించినవారు, సరిఅయిన పత్రాలు లేనివారు అమ్నెస్టీ పథకానికి అర్హులు. జీతాల బకాయిలు రానివారు, సివిల్ కోర్టు కేసుల్లో ఉన్నవారు కూడా ఈ  అకాశాన్ని వినియోగించుకోవచ్చు.

వీలుకానివి
'తనాజుల్' (స్పాన్సర్ ను మార్చుకోవడం) వీలుకాదు. 'మత్లూబ్' (పోలీస్ కేసు) ఉన్నవారు సంబంధిత పోలీస్ స్టేషన్ ల నుండి చట్ట ప్రకారం పరిష్కరించుకోవాలి. అమలులులో ఉన్న 'అఖామా' (సౌదీ ప్రభుత్వం జారీచేసే గుర్తింపు కార్డు) ఉన్నవారు అర్హులు కాదు.

'హురూబ్'.. అంటే
సౌదీ అరేబియాలో 'కఫీల్' (స్పాన్సర్ / యజమాని) కి తెలుపకుండా ప్రవాసి ఉద్యోగి పనికి గైరుహాజరు కావడం, పారిపోవడాన్ని అరబ్బీలో 'హురూబ్' (పారిపోయిన ప్రవాసి ఉద్యోగి) అంటారు. సౌదీ చట్టాల ప్రకారం ఉద్యోగి పారిపోయిన సందర్భాలలో యజమాని 'జవజత్' (పాస్ పోర్ట్, ఇమ్మిగ్రేషన్ శాఖ) అధికారులకు ఫిర్యాదు చేస్తే ప్రవాసి ఉద్యోగిని 'హురూబ్' గా ప్రకటిస్తారు. దురుద్దేశం కలిగిన 'కఫీల్ల' కు 'హురూబ్' వ్యవస్థ  ఉద్యోగులను పీడించడానికి ఒక ఆయుధంగా ఉపయోగపడుతున్నది.

ప్రవాసి ఉద్యోగులు ఎందుకు పారిపోతారు ?
పనికి తగిన వేతనం లేకపోవడం, నెలలతరబడి వేతనాలు ఇవ్వకపోవడం, సరిఅయిన ఉద్యోగ హోదా లేకపోవడం, భోజన వసతి సౌకర్యాలు సరిగా లేకపోవడం, అధిక పనిగంటలు, యజమాని సెలవు మంజూరు చేయకపోవడం, యజమాని వేధింపులు, హింసలను తట్టుకోలేక తదితర కారణాలతో ప్రవాసి ఉద్యోగులు పారిపోతుంటారు. అధిక వేతనం ఆశతో మరోచోట పనిచేయడానికి కూడా వెళ్లిపోతుంటారు.

'హురూబ్' గా ప్రకటించబడ్డ వ్యక్తికి జరిగే నష్టాలు
'అఖామా' (గుర్తింపు కార్డు) రద్దు అయిపోతుంది. అక్రమ నివాసిగా పరిగణించబడతారు. డ్రైవింగ్ లైసెన్సు, హజ్ పర్మిట్ ఇతర చట్టబద్దమైన కార్డులు రద్దు అవుతాయి. 'డిపోర్టేషన్ సెంటర్' (బహిష్కరణ కేంద్రం) ద్వారా మాతృదేశానికి వెళ్లగొట్టబడతారు. సౌదీలోకి రాకుండా ఐదేళ్ల పాటు 'ట్రావెల్ బ్యాన్' (ప్రయాణ నిషేధం) విధిస్తారు. ఉద్యోగులు చట్టబద్దంగా పొందాల్సిన ప్రయోజనాలు, హక్కులు కోల్పోతారు. ప్రవాసి ఉద్యోగి పారిపోయిన విషయాన్ని సౌదీ ప్రభుత్వానికి తెలియపర్చని యజమానికి 5 నుండి 15 వేల రియాళ్ల జరిమానాతో పాటు ఒకనెల జైలు శిక్ష కూడా విధిస్తారు.

'హురూబ్' నుండి బయటపడటం ఎలా ?
'హురూబ్' గా ప్రకటించబడినదీ లేనిదీ సౌదీ ప్రభుత్వ కార్మిక మంత్రిత్వ శాఖ వెబ్ సైటు https://www.mol.gov.sa/services/inquiry/nonsaudiempinquiry.aspx లో తెలుసుకోవచ్చు. సౌదీ అరేబియాలోని రియాద్ లో గల ఇండియన్ ఎంబసీలో గాని, జిద్దా లోని ఇండియన్ కాన్సులేట్ లో (భారత రాయబార కార్యాలయాలు) గాని దరఖాస్తు చేసుకోవడం వలన లొంగిపోయినట్లు భావిస్తారు. దరఖాస్తు చేసుకున్న తర్వాత మన భారత రాయబార కార్యాలయం వారు సౌదీ ప్రభుత్వానికి ఒక హామీపత్రం సమర్పిస్తారు. 72 గంటలలోగా (మూడు రోజుల్లో) తమ పౌరుడు మాతృదేశమైన భారత్ కు వెళ్ళిపోతాడని ఆ హామీలో ఉంటుంది.

సౌదీ ప్రభుత్వం ఉద్యోగి హిస్టరీ షీట్ (చరిత్ర), క్రిమినల్ రికార్డు (నేర చరిత్ర) లను పరిశీలించిన అనంతరం తగిన అనుమతిని మంజూరు చేస్తారు. స్పాన్సర్ (యజమాని) వద్ద ఉన్న పాస్ పోర్ట్ ఇస్తే స్వదేశానికి వెల్లిపోవడం సులువు అవుతుంది, లేనిపక్షంలో ఎంబసీ నుండి 'ఎమర్జెన్సీ సర్టిఫికెట్' (అవుట్ పాస్ / వైట్ పాస్ పోర్ట్) పొందాల్సి ఉంటుంది. సౌదీ ఇమ్మిగ్రేషన్ విభాగంలో వేలి ముద్రలు ఇవ్వాలి, పత్రాల పరిశీలన చేయించుకోవాలి. అన్నిరకాల బకాయిలు, ట్రాఫిక్ తదితర జరిమానాలు చెల్లించాలి. ఫైనల్ ఎగ్జిట్ (సౌదీ వదిలి వెళ్ళడానికి అనుమతి) పొందాలి.

యజమానులు పెట్టిన 'మత్లూబ్' కేసులతో  దారులు మృగ్యం..
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఛిల్వాకోడూర్ గ్రామానికి చెందిన సైన్స్ పట్టభద్రుడు దాసరి మధుసూదన్ గల్ఫ్ లో తన విద్యార్హతకు తగిన ఉద్యోగం కోసం ప్రయత్నించి విఫలమై, ఎదో ఒక ఉద్యోగంలో చేరాలని నిర్ణయించుకుని ఒక ఏజెంటు సహాయంతో చివరికి 7 జనవరి 2016 లో సౌదీలోని హాయిల్ పట్టణంలో ఒక మహిళా యజమాని వద్ద ఇంటి డ్రైవర్ గా చేరాడు. ఇతని వాహనాన్ని వేరే వాహనం ఢీకొట్టినందున జరిగిన చిన్న ప్రమాదం పట్ల ఆగ్రహించిన యజమాని భర్త మధుసూధన్పై ఆగ్రహం వ్యక్తంచేసి దాడిచేశాడు. అయినా సర్దుకొని డ్యూటీ చేశాడు. డ్రైవర్ పని మాత్రమే చేస్తానని, ఇంటిపనులు చేయలేనని మొండికేయడంతో మొదటినెల జీతం మాత్రమే ఇచ్చి, తర్వాతి రెండునెలల జీతం ఇవ్వలేదు. ఒత్తిడి భరించలేని మధుసూదన్ భయంతో ఏప్రిల్ 2016 లో పారిపోయి వేరేచోట పనిచేసుకుంటున్నాడు.

ఆమ్నెస్టీ అవకాశాన్ని ఉపయోగించుకొని స్వదేశానికి వాపస్ వెళ్ళిపోదామని మధుసూదన్ ఇండియన్ ఎంబసీ నుండి అవుట్ పాస్, సౌదీ అధికారుల నుండి ఫైనల్ ఎగ్జిట్ తీసుకొన్నాడు. ఏప్రిల్ 15 న సాయంత్రం సౌదీలోని రియాద్ ఏర్ పోర్ట్ కు వెళ్లి  హైదరాబాద్ కు ప్రయాణించడానికి గల్ఫ్ ఏర్ విమాన సిబ్బంది నుండి బోర్డింగ్ పాస్ తీసుకొని ముందుకుసాగాడు. ఇమ్మిగ్రేషన్ కౌంటర్ లో పాస్ పోర్ట్ (అవుట్ పాస్) పై స్టాంప్ వేసే సమయంలో ఇతనిపై 'మత్లూబ్' (పోలీసు కేసు) ఉన్న విషయాన్ని ఆన్ లైన్ లో గమనించిన అధికారి మధుసూదన్ ప్రయాణాన్ని అడ్డుకొని విమానం ఎక్కకుండా ఆపేశారు. సంబంధిత పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసును పరిష్కరించుకోవాల్సిందిగా సలహా ఇచ్చారు.  

యజమాని కక్ష సాధింపు
మధుసూదన్ కు ఫైనల్ ఎగ్జిట్ (సౌదీ వదిలి వెళ్ళడానికి అనుమతి) మంజూరి అయిన 10 ఏప్రిల్ న యజమానికి మొబైల్ కు మెసేజ్ వెళ్ళింది, అది చూసిన యజమాని కారు దొగతనం జరిగినట్లు 11 ఏప్రిల్ న 'మత్లూబ్' (పోలీస్ కేసు) దాఖలు చేయడంతో అతను సౌదీ వదిలివెళ్లే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు మధుసూదన్ ముందున్నవి రెండు మార్గాలు.. యజమాని కేసు వాపస్ తీసుకోవడం లేదా పోలీసుల ముందు లొంగిపోయి న్యాయ పోరాటం చేయడం.

ఆయనది చెప్పుకోలేని బాధ
మధుసూదన్ తనకు జరిగిన అన్యాయాన్ని ట్విట్టర్, ఈ మెయిళ్ల ద్వారా భారత విదేశాంగ శాఖ అధికారులకు, ఇండియన్ ఎంబసీ అధికారులకు, తెలంగాణ ఎన్నారై మంత్రి కేటీఆర్ కు తెలియజేశాడు. ఇతనికి సహాయం చేయాలని ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్, తెలంగాణ ఎన్నారై విభాగం వారు సంబంధిత అధికారులకు లేఖలు రాశారు. ఇంగ్లీషు, తెలుగు పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఒకరకంగా చెప్పాలంటే మధుసూదన్ తన బాధను ప్రపంచ బాధ చేశాడు. కేరళకు చెందిన ఇండియన్ ఎంబసీ వలంటీర్ సరఫొద్దీన్ తయ్యిల్, రియాద్ లో నివాసముండే నల్గొండ జిల్లాకు చెందిన ఇంజనీర్, సామాజిక కార్యకర్త  మహ్మద్ ముబీన్ లు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ సందర్బంగా మధుసూదన్ మాట్లాడుతూ తన కఫీల్, ఆమె భర్త ఆసుపత్రి ఉద్యోగులని, కేసును వాపస్ తీసుకోవడానికి 10 వేల రియాళ్ళు అడుగుతున్నారని, ఇంత పెద్దమొత్తం ఎలా చెల్లించాలని వాపోయాడు. తనను ఎలాగైనా రక్షించి మాతృదేశానికి పంపాలని వేడుకుంటున్నాడు. జీవితంలో మళ్లీ గల్ఫ్ కు వెళ్ళనాని అన్నాడు.


ఆ 35 మందిది ఒక్కొక్కరిది ఒక్కో బాధ

తెలంగాణ జిల్లాలకు చెందిన 35 మంది వలస కార్మికులు సౌదీలో చిక్కుకుపోయారు. సౌదీ యజమానులు పెట్టిన 'మత్లూబ్' కేసులతో ఇంటికి రాలేక, అక్కడ ఉండలేక సతమతమవుతున్నారు. వీరిలాగా వేలాదిమంది సతమతమవుతున్నారు.

సౌదీలో చిక్కుకుపోయిన 35 మంది వివరాలు: మహ్మద్ జావీద్ (కోహెడ), రమేష్ రావ్ (వజ్జేపల్లి), రాజేశ్వర్ రావు (ఉత్నూర్), లావుడ్య రూప్ సింగ్ (వెంగళపాడ్), ఇటికెల పాండు (కామారెడ్డి), కడావత్ బాల్ రెడ్డి (గోవిందపల్లి), దుబ్బాక అశోక్ (నాగేపూర్), జిన్న హనుమాండ్లు (పల్లిమక్త), చల్ల సుదర్శన్ (కొడిమ్యాల), జంగిటి రాజేశం (మలకపేట్), దండెన చిన్న బొర్రన్న (నిజామాబాద్), దాసరి మధుసూదన్ (ఛిల్వాకోడూర్), సూర నర్సయ్య (బండపల్లి), సారంగి సాయన్న (ఏర్గట్ల), గోడూరి స్వామి (నార్లాపూర్), జిన్న రాములు (రామయ్యపల్లి), సుంచు రాజు (మద్దికుంట), మల్లెనైన నగేష్ (మామిడిపల్లి), తలారి రాందాస్ గంగారాం (ఏర్గట్ల), లావుడ్య బలరాం (వెంగళపాడ్), తాటిపల్లి నర్సయ్య (దుమ్మాడ్), జక్కని తిరుపతి (ఏర్గట్ల), నడుపుల బక్కన్న (రాంపూర్), తెజావత్ శ్రీను (కేసంపల్లి), తోగుటి అంతగిరి (చెల్లాపూర్), మసపత్రి రాజు (గుమ్మిర్యాల్), రేకులపెల్లి శ్రీనివాస్ (పూడూర్), అల్లెపు సాయిలు (పెర్కిట్), గొడుగు వెంకటి (ధర్పల్లి), నరిగె గంగామురళి (తూముపల్లి), షేక్ మొగులాన్ (వర్ని), చాకలి సాయిలు (జనగామ), నానం అంజన్న (వేంపల్లి), భోగ మారుతి (బుస్సాపూర్), పల్లపు ఎల్లయ్య (ఖానాపూర్)

ఆరుగురిది ఒక కథ
దండెన చిన్న బొర్రన్న (నిజామాబాద్), సారంగి సాయన్న (ఏర్గట్ల), తలారి రాందాస్ గంగారాం (ఏర్గట్ల), జక్కని తిరుపతి (ఏర్గట్ల), మసపత్రి రాజు (గుమ్మిర్యాల్), ఇటికెల పాండు (కామారెడ్డి) అనే ఆరుగురు సేఫ్ అరేబియా ఇంజనీరింగ్ అనే కంపెనీలో సంవత్సరంన్నర పనిచేసిన అనంతరం పారిపోయారు. గత రెండు సంవత్సరాలుగా వేరేచోట పనిచేస్తున్నారు. వీరిపై జుబైల్ పోలీస్ స్టేషన్ లో ఆర్ధిక వ్యవహారాల వివాదం గురించి 'మత్లూబ్' కేసు నమోదు అయింది. వీరి సమస్యపై ఎంబసీలో స్పందించింది.          

ఒంటెలు, గొర్రెల కాపరులు
ఎడారిలో ఒంటెలు, గొర్రెల కాపరులుగా పనిచేస్తున్న వీరికి సరిఅయిన భోజనం, వసతి లేకపోవడం, వేతనాలు చెల్లించకపోవడం, యజమానుల అమానవీయ ప్రవర్తన తట్టుకోలేక పారిపోయారు. వీరిపై వివిధ పోలీస్ స్టేషన్ల లో  'మత్లూబ్' కేసులు నమోదు అయ్యాయి.  రమేష్ రావ్ (వజ్జేపల్లి), రాజేశ్వర్ రావు (ఉత్నూర్), గోడూరి స్వామి (నార్లాపూర్), జిన్న రాములు (రామయ్యపల్లి), తెజావత్ శ్రీను (కేసంపల్లి), తోగుటి అంతగిరి (చెల్లాపూర్), నానం అంజన్న (వేంపల్లి), పల్లపు ఎల్లయ్య (ఖానాపూర్).

మరిన్ని వార్తలు