విస్తృత ఏకాభిప్రాయంతోనే విభజన: కేంద్రం

11 Dec, 2013 01:20 IST|Sakshi

న్యూఢిల్లీ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో వీలైనంత త్వరగా ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకుంటున్నామని హోంశాఖ సహాయమంత్రి ఆర్.పి.ఎన్.సింగ్ మంగళవారం లోక్‌సభకు తెలిపారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఇతర సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వకంగా జవాబిచ్చారు. నూతన రాష్ట్రాల ఏర్పాటు విషయంలో మాతృరాష్ట్రంలో ఏకాభిప్రాయం ఉంటేనే కేంద్రం నిర్ణయం తీసుకుంటుం దని పేర్కొన్నారు. హోంమంత్రి షిండే నేతృత్వంలోని మంత్రుల బృందం(జీవోఎం) విభజనపై ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వివిధ రాజకీయ పక్షాలతో చర్చించిందన్నారు.

 

టీ బిల్లుకు 5న జరగిన కేబినెట్ భేటీలో ఆమోదముద్ర పడిందన్నారు. దేశంలో విభజన డిమాండ్లు చాలా ఉన్నాయని, అయితే విస్తృత ఏకాభిప్రాయం ఉంటేనే కేంద్రం నిర్ణయం తీసుకుంటుందన్నారు. మహారాష్ట్రలో విదర్భ, గుజరాత్‌లో సౌరాష్ట్ర, కర్ణాటకలో కూర్గ్, ఒడిశాలో కోసలాంచల్, బెంగాల్‌లో గూర్ఖాలాండ్, బీహార్‌లో మిథిలాంచల్... తదితర ‘ప్రత్యేక’ డిమాండ్లు ఉన్నాయని వెల్లడించారు. యూపీని 4 రాష్ట్రాలుగా విభజించాలని ఆ రాష్ట్ర శాసనసభ తీర్మానం చేసి 2011 నవంబర్ 23న కేంద్రానికి పంపించిందని చెప్పారు. రాష్ట్రాల విభజన నిర్ణయాల ప్రభావం.. సమాఖ్య రాజకీయాల మీద నేరుగా ఉంటుందన్నారు.
 
 ప్రజల మనోభావాలకు వ్యతిరేకం: శివసేన


 న్యూఢిల్లీ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి:  ఆర్టికల్-3ని వాడుకొని ప్రజల మనోభావాలను అణచివేయడం కేంద్రానికి తగదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ఆయన మంగళవారం పార్లమెంటు ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ తీరుపై వ్యతిరేకత పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ విభజనపై పార్లమెంటులో చర్చ రాలేదు. అసెంబ్లీతో మూడింట రెండొంతుల మెజార్టీతో తీర్మానం రాలేదు. ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ.. ఈరోజు ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తున్నారు. రేపు మరో రాష్ట్రాన్ని విభజిస్తారు.  శాసనసభ తీర్మానం లేకుండా విభజన ప్రక్రియలో ముందుకెళ్లడం అంటే.. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వెళ్లినట్లే. ముందుకెళ్ల వద్దనిచెప్పినా కేంద్రం పట్టించుకోవడం లేదు’’ అని వ్యాఖ్యానించారు.
 
 అసెంబ్లీ తీర్మానం తప్పనిసరి: జేడీయూ
 
 ‘‘ఏ రాష్ట్రాన్ని విభజించాలన్నా.. ఆ రాష్ట్ర శాసనసభ తీర్మానం తప్పనిసరిగా ఉండాలి. ఆ తీర్మానానికి పార్లమెంటు ఆమోదముద్ర వేయాలి. అప్పు డే రాష్ట్ర విభజన చేపట్టాలి. కేవలం కేంద్ర మంత్రివర్గ నిర్ణయం ప్రకారం రాష్ట్రాల విభజన చేయకూడదు. ఆర్టికల్-3ను సవరించాల్సిన అవసరముం ది.’’ జేడీ(యూ) ఎంపీ త్యాగి అన్నారు.
 
 ‘యూపీఏ గద్దె దిగాలి’
 
 సాక్షి, న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వంపై విశ్వాసం లేదని కాంగ్రెస్ సభ్యులే తీర్మానం పెట్టారని, ఇంతకన్నా నీచమైన పరిస్థితి మరోటి లేదని సీమాంధ్ర టీడీపీ ఎంపీలు అన్నారు. వేరేవారు దింపే వరకు ఆగకుండా, కేంద్రమే స్వతహాగా గద్దె దిగిపోవాలన్నారు. మంగళవారం సీమాంధ్ర టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి నివాసంలో ఆ ప్రాంత ఎంపీలు భేటీ అయ్యారు.
 

మరిన్ని వార్తలు