కొత్త కొలువులు

4 Sep, 2016 01:43 IST|Sakshi
కొత్త కొలువులు

- నూతన జిల్లాల్లో అవసరమైన ఉద్యోగ నియామకాలకు సిద్ధం: కేసీఆర్
- అర్హత ఉన్నవారందరికీ ప్రమోషన్లు కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం
- ఎలాంటి పైరవీల్లేకుండా ప్రజలకు పథకాలు అందాలి
- ఉమ్మడి రాష్ట్రంలోని అవలక్షణాలేవీ ఉండొద్దు
- అనుబంధ శాఖలన్నీ ఒకే గొడుగు కిందకు తేవాలి
- శాఖలన్నీ ప్రజలకు అందుబాటులో ఉండాలి
- శాంతిభద్రతలు అత్యంత ముఖ్యం.. పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉండాలి
- సిద్దిపేట జిల్లా ప్రారంభోత్సవంలో పాల్గొంటా
- జిల్లాల పునర్విభజన పురోగతిపై 6న కలెక్టర్ల సదస్సు


సాక్షి, హైదరాబాద్:
కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అవసరమైన మేరకు ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. అర్హత ఉన్న ఉద్యోగులందరికీ ప్రమోషన్లు ఇచ్చి వారు పూర్తి నిబద్ధతతో ప్రజలకు సేవలందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. పైరవీలకు తావులేకుండా సంక్షేమ పథకాల కోసం ప్రజలే  నేరుగా ప్రభుత్వ యంత్రాంగాన్ని సంప్రదించేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ప్రభుత్వ శాఖల పునర్ వ్యవస్థీకరణపై సీఎం శనివారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

కొత్త జిల్లాలకు ఉద్యోగుల సర్దుబాటు, పదోన్నతులు, నియామకాలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సీఎస్ రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, ఇంటెలిజెన్స్ ఐజీ నవీన్ చంద్, సీఎంవో అధికారులు నర్సింగ్ రావు, స్మితా సబర్వాల్, శాంతాకుమారి, భూపాల్‌రెడ్డి, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల అమలు, పరిపాలనలో ఉద్యోగులూ భాగస్వాములేనన్నారు. అనుబంధ శాఖలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని సూచించారు. నేరాల అదుపునకు పటిష్ట పోలీసు వ్యవస్థ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొత్తగా ఏర్పడే మండల కేంద్రాల్లో పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు తగిన సిబ్బందిని నియమించాలన్నారు.

ప్రజలకు చేరువగా..: కొత్త జిల్లాల్లో ప్రభుత్వ శాఖల పునర్‌వ్యవస్థీకరణ ప్రజలకు మేలు చేసేలా కార్యాచరణ ఉండాలని సీఎం  ఆదేశించారు. సంక్షేమ పథకాలు పొందే లబ్ధిదారుడి పూర్తి వివరాలు కలెక్టర్ల కంప్యూటర్‌లో ఉండే విధంగా డిజిటలైజేషన్ చేపట్టాలన్నారు. ప్రభుత్వ శాఖలను పూర్తి స్థాయిలో పునర్ వ్యవస్థీకరించాలన్నారు. ప్రభుత్వ శాఖలు ప్రజలకు అందుబాటులో ఉండేలా కొత్త జిల్లాల నమూనా ఉండాలన్నారు.

సిద్దిపేట జిల్లా ప్రారంభోత్సవంలో పాల్గొంటా: రాష్ట్ర ప్రజలందరూ సంతోషించేలా కొత్త జిల్లాల ఆవిర్భావం జరగాలని సీఎం ఆకాంక్షించారు. దసరా రోజు కొత్తగా ఏర్పడే సిద్దిపేట జిల్లా ప్రారంభోత్సవంలో తాను పాల్గొంటానన్నారు. మంత్రులు, ప్రభుత్వ సీఎస్, డీజీపీ వంటి ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇతర జిల్లాల్లో పరిపాలన ప్రక్రియను ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జిల్లాల పునర్విభజన పురోగతిని చర్చించేందుకు ఈ నెల 6న కలెక్టర్ల సదస్సు నిర్వహించాలన్నారు.

సాగు, నీటిపారుదలకు అధిక ప్రాధాన్యం: వ్యవసాయం, నీటిపారుదల వంటి కీలక రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని సీఎం చెప్పారు. దేశానికే అన్నపూర్ణగా ఉండాల్సిన ప్రాంతం గత పాలకుల నిర్లక్ష్యం వల్ల కరువుతో తల్లడిల్లే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. 58 ఏళ్ల సమైక్య రాష్ట్ర చరిత్రలో ఒకేఒక్కసారి బడ్జెట్‌కు సాగునీటి పారుదలకు రూ.15,500 కోట్ల బడ్జెట్‌లో కేటాయించారన్నారు. సమైక్య రాష్ట్రంలో అవే అత్యధిక కేటాయింపులని వివరించారు. ఇప్పుడు తెలంగాణలో ఏడాదికి రూ.25 వేల కోట్లు కేటాయిస్తున్నామన్నారు.  ఉమ్మడి రాష్ట్రంలో 13 మంది ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్లు ఉంటే.. నేడు ఒక్క తెలంగాణకే 15 మంది ఉన్నారన్నారు.

మరిన్ని వార్తలు