ఢిల్లీలో తెలుగు నాటకం

27 Dec, 2016 00:29 IST|Sakshi
ఢిల్లీలో తెలుగు నాటకం

పోలవరం ‘చెక్కు’ వెనుక కథ ఇదీ!
- పోలవరానికి రూ.1981.54 కోట్ల రుణం మంజూరు చేసిన నాబార్డు
- ఇది గతంలో చేసిన పనుల వ్యయానికి రీయింబర్స్‌మెంట్‌
- కేంద్రానికి అప్పగించి ఉంటే ఈపాటికి ప్రాజెక్టు పూర్తయ్యేదంటోన్న అధికారులు

సాక్షి, అమరావతి: నాబార్డు నుంచి రూ.1981.54 కోట్ల రుణాన్ని కేంద్రం మంజూరు చేయించగానే.. పోలవరం ప్రాజెక్టు పూర్తయినట్లా? సీఎం చంద్రబాబు తీరు చూస్తుంటే అలానే ఉంది. గతంలో చేసిన పనులకు ఈ డబ్బులిచ్చారనే విషయాన్ని విస్మరించి ఆ ప్రాజెక్టును పూర్తి చేసి రికార్డును సొంతం చేసుకుంటామంటూ చంద్రబాబు సోమవారం ఢిల్లీలో మిఠాయిలు పంచుతూ సంబరాలు చేసుకోవడం వింతల్లోకెల్లా వింత. దశాబ్దాల స్వప్నమైన పోలవరం ప్రాజెక్టును సాకారం చేసేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. ప్రధాన పనుల(హెడ్‌ వరŠక్స్‌)ను ఓ కొలిక్కి తెస్తూనే.. ముందు చూపుతో కుడి, ఎడమ కాలువలను లైనింగ్‌తో సహా దాదాపుగా పూర్తి చేశారు.

వైఎస్‌ హఠాన్మరణం తర్వాత.. రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం, తామే పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది. కాదూ కూడదని కమీషన్ల దందా కోసం పట్టుపట్టి ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను దక్కించుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండున్నరేళ్లలో ఐదు శాతం పనులు కూడా పూర్తి చేయలేదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కేంద్రానికే అప్పగించి ఉంటే.. ఈ పాటికి ఆ ప్రాజెక్టు పూర్తయ్యేదని జలవనరుల శాఖ అధికార వర్గాలే అంగీకరిస్తున్నాయి. చేతిలో రూపాయి లేకుండా రాష్ట ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తుంది? 2010–11 అంచనాల మేరకు రూ.16,010.4 కోట్లు మాత్రమే కేంద్రం ఇస్తామంటోంది. ఇందులో దాదాపు సగం ఇప్పటికే ఇవ్వగా,  మిగిలిన రూ.8,400ను ఇవ్వాల్సి ఉంది. ప్రాజెక్టు వ్యయమేమో చంద్ర బాబు సర్కారు రూ.40,351.65 కోట్లకు పెంచేసింది. ఈ నేపథ్యంలో మిగిలిన నిధుల ను ఎక్కడి నుంచి తెస్తారు? ప్రాజెక్టును ఏ విధంగా పూర్తి చేస్తారు? అని నీటి పారుదల రంగ నిపుణులు నివ్వెరపోతున్నారు.

రెండున్నరేళ్లలో ఐదు శాతం పనులే..
వైఎస్‌ హఠాన్మరణం తర్వాత.. రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం.. సహాయ, పునరావాస ప్యాకేజీతో సహా ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని పూర్తిగా తామే భరించి, పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది. కానీ.. పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)తో ఒప్పందం చేసుకోకుండా రెండున్నరేళ్లపాటు సీఎం చంద్రబాబు నాన్చారు. రెండున్నరేళ్లలో కేవలం ఐదు శాతం పనులు మాత్రమే పూర్తి చేశారు. ఐదు కోట్ల మంది ప్రజల ప్రయోజనాలతో ముడిపడిన ‘ప్రత్యేక హోదా’ను సీఎం చంద్రబాబు తాకట్టు పెట్టి పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించు కున్న మరుసటి రోజు నుంచే కమీషన్లపై కన్నేశారు. విభజన నేపథ్యంలో యుద్ధ ప్రాతి పదికన ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రెండున్న రేళ్ల క్రితమే కేంద్రం పీపీఏను ఏర్పాటు చేసింది.

పీపీఏతో ఒప్పందం చేసుకుంటే ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి పలు సందర్భాల్లో విజ్ఞప్తి చేసింది. రెండున్నరేళ్లలో ఐదు శాతం పనులు మాత్రమే చేశారని దెప్పిపొడిచింది. సత్తాలేని కాంట్రాక్టర్లు పోలవరం పనులు చేయలేరని ఈసడించింది. కానీ.. సీఎం చంద్రబాబు మాత్రం పోలవరం నిర్మాణ బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగించాలని కోరుతూ వచ్చారు. ఈ క్రమంలోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధికి జీవనాడి అయిన ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్డడంతో సెప్టెంబరు 7న పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు.

వెంటనే కమీషన్ల దందా..
పోలవరం నిర్మాణ బాధ్యతలు దక్కిం చుకున్న 24 గంటల్లోనే హెడ్‌ వర్క్స్‌ అంచనా వ్యయాన్ని రూ.1,482 కోట్లు పెంచేశారు. ఆ పనులను తన కోటరీ సంస్థలైన ఎల్‌ అండ్‌ టీ, బావర్, త్రివేణి, పూజీ మీయిస్టర్‌లకు అప్పగించి కమీషన్లు దండుకున్నారు. ఈలోగా పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని ఒకే సారి రూ.40,351.65 కోట్లకు పెంచేస్తూ పీపీఏకు ప్రతిపాదన లు పంపారు. పీపీఏ వాటిని ఆమోదిం చక ముందే.. పోలవరం కుడి, ఎడమ కాలువ పనులు చేస్తోన్న కాంట్రాక్టర్లపై 60సీ నిబంధన కింద వేటు వేసి, తనకు కమీషన్లు ముట్టజెప్పే వారికి నామినేషన్‌ పద్ధతిలో పనులు అప్పగించడానికి సిద్ధమయ్యారు. పోలవరం ఎడమ కాలువలో ఐదో ప్యాకేజీ కింద రూ.142.88 కోట్ల విలువైన పనులను ఇదే రీతిలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడు పుట్దా సుధాకర్‌ యాదవ్‌కు కట్టబెట్టారు. ఎడమ కాలువలో నాలుగు, ఏడు ప్యాకేజీల పనులను టీడీపీ ఎమ్మెల్యేలకు నామినేషన్‌ పద్ధతిలో కట్టబెట్టే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కుడి కాలువ పనుల్లోనూ ఇదే దందా.