మనోళ్లు మెరిశారు

16 Jan, 2014 01:34 IST|Sakshi
మనోళ్లు మెరిశారు

* ‘క్యాట్’లో ముగ్గురికి 100 పర్సంటైల్
ఐఐఎం అహ్మదాబాద్‌లో ఎంబీఏ చేయాలనుకుంటున్న తేజ, కృష్ణ
 
సాక్షి, హైదరాబాద్, కాకినాడ/సామర్లకోట, న్యూస్‌లైన్: ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం)లలో ప్రవేశం కోసం గత ఏడాది నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (క్యాట్- 2013) ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఐఐఎం ఇండోర్ విడుదల చేసిన ఈ ఫలితాల్లో రాష్ట్రానికి చెందిన ముగ్గురికి 100 పర్సంటైల్ లభించింది. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట యువకుడు తోటకూర శివసూర్యతేజ, హైదరాబాద్ నుంచి పిల్లుట్ల కృష్ణ కౌండిన్య, విజయవాడకు చెందిన ఇమనేని కార్తీక్ కుమార్ 100 పర్సంటైల్‌తో టాపర్లుగా నిలిచారు. వీరితో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మరో ఐదుగురు 100 పర్సంటైల్ సాధించారు.

అహ్మదాబాద్ ఐఐఎంలో ఎంబీఏలో చేరుతానని శివసూర్య తేజ తెలిపాడు. తేజ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. తేజ తండ్రి సాయిరామకృష్ణ గణిత ఉపాధ్యాయుడు. మరో టాపర్ కృష్ణ కౌండిన్య ఐఐటీ ముంబైలో బీటెక్(కంప్యూటర్ సైన్స్) ఫైనలియర్ చదువుతున్నాడు. వీరితో పాటు కాకినాడ జేఎన్‌టీయూలో కంప్యూటర్ సైన్సు డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువుతున్న రాజమండ్రి యువకుడు ద్వారంపూడి యశ్వంత్‌రెడ్డి 99.7 పర్సంటైల్ సాధించగా, కృష్ణా జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లికి చెందిన అవిర్నేని సాహితి 99.36 పర్సంటైల్ సాధించింది. దేశవ్యాప్తంగా ఐఐఎంలలో ఉన్న 3,335 ఎంబీఏ సీట్లలో ప్రవేశాల కోసం గత ఏడాది అక్టోబర్ 16 నుంచి నవంబర్ 11 వరకు 40 పట్టణాల్లో నిర్వహించిన క్యాట్ పరీక్షకు 1.94 లక్షల మంది హాజర య్యారు.

వివేకానందుడే స్ఫూర్తి
‘ఎటువంటి శిక్షణ లేకుండా, ఆన్‌లైన్‌లో కాకినాడలోని టైమ్ ఇనిస్టిట్యూట్ పెట్టిన టెస్టుల సహకారంతో, పట్టుదలతో ఈ విజయం సాధించాను. గతంలో 99 పర్సంటైల్ సాధించినప్పటికీ, అహ్మదాబాద్ ఐఐఎంలో సీటు కోసం మళ్లీ క్యాట్ రాశాను. రాష్ట్రానికి ఆర్థిక సలహాదారు కావాలన్నది నా ఆశయం. అహ్మదాబాద్ ఐఐఎంలో ఎంబీఏ చదవడం ద్వారా ఆర్థిక, రాజకీయ అంశాలతో పాటు దేశ ప్రతిష్టకు సంబంధించిన అంశాలు తెలుస్తాయి. ఆర్థిక సలహాదారు కావడానికి అవసరమైన అంశాలు నేర్చుకోవచ్చు. తరువాత సులభంగా ఐఏఎస్ పూర్తి చేయొచ్చు. మా నాన్న  నాకు చదువులో పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. వివేకానందుని సూక్తులు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. మంచి పుస్తకాలతో పాటు ఆన్‌లైన్‌లో లభించే సమాచారం తెలుసుకోవడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. ప్రతి అంశాన్నీ విశ్లేషించి, అధ్యయనం చేయడం ద్వారా విజయం సాధించవచ్చు. మా నాన్న గణిత ఉపాధ్యాయుడు కావడంతో ఇంట్లో అనేక రకాల పుస్తకాలు ఉన్నాయి. నా విజయం వెనుక నా తల్లి సహకారం ఎంతో ఉంది. వారితో పాటు పినతండ్రి గంగాధర్, తమ్ముడి ప్రోత్సాహం ఉంది’
 - తోటకూర శివసూర్యతేజ

ఇంతకంటే ఆనందమేముంటుంది?
‘తేజ సాధించిన విజయాన్ని మాటల్లో వర్ణించలేను. చిన్నతనం నుంచీ మంచి మార్కులతో పాస్ కావడం వల్ల తేజ చదువుకు ఎక్కువ ఖర్చు చేయవలసిన అవసరం కలగలేదు. పదో తరగతిలో మంచి మార్కులు రావడంతో కాకినాడ ‘ఆదిత్య’లో ఉచితంగా సీటు వచ్చింది. అదేవిధంగా ఇంటర్‌లో మంచి మార్కులు సాధించడంతో ప్రభుత్వ కోటాలో ఇంజనీరింగ్ సీటు వచ్చింది. అలా తేజ చదువుకు ఎక్కువ ఖర్చు చేయవలసిన అవసరం కలగలేదు. నా అభిప్రాయాలను ఎప్పుడూ నా కుమారులపై రుద్దలేదు. వారి ఇష్టం మేరకు చదువు కోవాలని సూచించాను. వారి చదువుకోసం అవసరమైన వాతావరణం కల్పించాం. ఇంట్లో చిన్న గంథాలయం ఉండటం తేజకు బాగా ఉపయోగపడింది’     
 - తోటకూర సాయిరామకృష్ణ
 
ఐఐఎం అహ్మదాబాద్‌లోనే
‘క్యాట్ 2013లో టాపర్‌గా 100 పర్సంటైల్ సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఐఐఎం అహ్మదాబాద్‌లో ఎంబీఏ చేయాలనుకుంటున్నాను’    
 - కృష్ణ కౌండిన్య

>
మరిన్ని వార్తలు