అప్పు చేసి వెళ్లి.. వట్టి చేతులతో ఇంటికి..

17 Aug, 2017 03:35 IST|Sakshi
అప్పు చేసి వెళ్లి.. వట్టి చేతులతో ఇంటికి..
ఒమన్‌లో ఉపాధి కోల్పోయిన తెలుగు కార్మికులు 
దీన స్థితిలో స్వదేశానికి చేరుతున్న బాధితులు 
 
సాక్షి, నిజామాబాద్‌/శంషాబాద్‌: ఉపాధి కోసం ఉన్న ఊరు, కన్న వారిని వదిలి ఎడారి దేశాలకు వలస వెళ్లిన కార్మికులు దిక్కు తోచని స్థితిలో పడిపోయారు. ఒమన్‌ దేశంలో ‘పెట్రోన్‌ గల్ఫ్‌’అనే కంపెనీ మూతపడటంతో అందులో పనిచేస్తున్న  900 మంది భారతీయ కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 3 నెలలుగా జీతాలు రాక, కనీసం తినేందుకు తిండి లేక కార్మికులు అల్లాడుతున్నారు. 
 
ఒక్కొక్కరికి రూ. మూడు లక్షల వరకు.. 
పెట్రోన్‌ గల్ఫ్‌ కంపెనీ బాధితుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కార్మికులు సుమారు 200 మంది వరకు ఉంటారు. ఇందులో తెలంగాణకు చెందినవారు 30 మంది ఉన్నారు. సుమారు ఎనిమిది నుంచి  పని చేస్తున్నారు.  ఒక్కో కార్మికుడికి వేతన బకాయిలు, గ్రాట్యు టీ కలిపి సుమారు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు కంపెనీ చెల్లించాల్సి ఉంది. కార్మికులు తమకు రావాల్సిన వేతన బకాయిలను రాబట్టుకునేందుకు న్యాయ పోరాటం చేస్తున్నారు.

 కార్మికులు తిరిగి వచ్చేందుకు విమాన చార్జీలు కూడా లేకపోవడంతో అక్కడి భారతీయ రాయబార కార్యాలయం వీరికి ఉచితంగా విమాన టికెట్లు ఇచ్చి హైదరాబాద్‌కు పంపింది. నిజామాబాద్‌ జిల్లా నవీపేట్‌ మండలానికి చెందిన వటార్కర్‌ భూమేశ్, వికారాబాద్‌ జిల్లా ఇబ్రహీంపూర్‌కు చెందిన జడల బాలయ్య తదితరులు బుధవారం  హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. 
మరిన్ని వార్తలు