లోక్‌సభ రణరంగం

13 Feb, 2014 02:08 IST|Sakshi
లోక్‌సభ రణరంగం

  అట్టుడికిన దిగువ సభ
 సమైక్యాంధ్ర నినాదాల నడుమ రైల్వే బడ్జెట్
 ప్లకార్డులు చేతబూని వైఎస్సార్‌సీపీ సభ్యుల ఆందోళన
 సీమాంధ్ర ఎంపీలతో పాటు వెల్‌లోకి కేంద్ర మంత్రులు కావూరి, చిరంజీవి, కోట్ల, పురందేశ్వరి.. పల్లంరాజు, కృపారాణిల సంఘీభావం
 సీట్లకే పరిమితమైన కిశోర్‌చంద్రదేవ్, పనబాక
 లోక్‌సభ సిబ్బంది వద్ద కాగితాలు చింపేసిన శివప్రసాద్.. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మందా
 తీవ్ర వాగ్వివాదం, తోపులాటతో ఘర్షణ వాతావరణం
 టీ ఎంపీల రక్షణ వలయంలో 12 నిమిషాలకే ప్రసంగం ముగించిన ఖర్గే

 
 సాక్షి, న్యూఢిల్లీ: కొద్దిరోజులుగా సమైక్య, తెలంగాణ నినాదాలతో దద్దరిల్లుతున్న లోక్‌సభ బుధవారం రణరంగాన్ని తలపించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఇతర సభ్యులతో పాటు ఈ ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు సైతం వెల్‌లో ఆందోళనకు దిగారు. సీమాంధ్ర టీడీపీ, తెలంగాణ ప్రాంత ఎంపీ మధ్య ఏర్పడిన ఘర్షణ వాతావరణం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నేపథ్యంలో ముందెన్నడూ లేనివిధంగా రైల్వేబడ్జెట్ ప్రసంగాన్ని మంత్రి అర్ధాంతరంగా ముగించాల్సి వచ్చింది. తెలంగాణ ప్రాంత ఎంపీలు రక్షణగా నిలబడిన నేపథ్యంలో.. తీవ్ర గందరగోళం మధ్య రైల్వే మంత్రి మల్లికార్జున్ ఖర్గే సుమారు 12 నిమిషాలు బడ్జెట్ ప్రసంగాన్ని చదివారు. చివరకు మిగతా ప్రసంగ పాఠాన్ని చదివినట్టుగానే భావించాలని ప్రకటించి కూర్చుండిపోయూరు.
 
 ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమయ్యాక స్పీకర్ మీరాకుమార్ ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. అప్పటికే వైఎస్సార్‌సీపీ సభ్యులు, సీమాంధ్ర కాంగ్రెస్ సభ్యులు వెల్‌లో సమైక్యాంధ్ర నినాదాలు చేస్తున్నారు. దీంతో మూడు నిమిషాల్లోనే సభ 12 గంటలకు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన తర్వాత.. అవిశ్వాస తీర్మానాలపై వైఎస్సార్‌సీపీ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, టీడీపీ ఎంపీ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, కాంగ్రెస్‌కు చెందిన రాయపాటి సాంబశివరావు ఇచ్చిన నోటీసులకు సంబంధించిన ప్రక్రియను సభ అదుపులో లేనందున చేపట్టలేకపోతున్నట్టు స్పీకర్ ప్రకటించారు. ఆ తర్వాత పలువురు మంత్రులు తమ శాఖలకు సంబంధించిన నివేదికలను సభ ముందుంచారు.
 
 వెల్‌లో ఉద్రిక్తత: 12.08కి రైల్వే మంత్రి బడ్జెట్ ప్రవేశపెడతారని సభాపతి ప్రకటించారు. దీంతో ఖర్గే తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ సమయంలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్పీవై రెడ్డిలు వెల్‌లో ఆందోళనకు దిగారు.  ‘స్టాప్ డివిజన్ ఆఫ్ ఏపీ స్టేట్’ అనే ప్లకార్డులతో నినదించారు.  సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు, కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, చిరంజీవి, పురందేశ్వరి, రైల్వే సహాయమంత్రి సూర్యప్రకాశ్‌రెడ్డి సైతం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియూగాంధీ సమక్షంలోనే వెల్‌లోకి వెళ్లారు. ‘వుయ్ వాంట్ జస్టిస్’ అంటూ సీమాంధ్ర సభ్యులు నినాదాలు చేశారు. కావూరిని ఉద్దేశించి సోనియూ ‘యూ ఆర్ ఏ మినిస్టర్..’ అనడం విన్పించింది. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీని ఉద్దేశించి కూడా సోనియూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. కాగా సీమాంధ్రకే చెందిన మంత్రులు పల్లంరాజు, కిల్లి కృపారాణి తమ స్థానాల్లో నిలబడి సంఘీభావం తెలిపారు. ఈ ప్రాంతానికి చెందిన మరో ఇద్దరు మంత్రులు కిశోర్‌చంద్ర దేవ్, పనబాక లక్ష్మిలు మాత్రం తమ సీట్లలో నిశ్శబ్దంగా కూర్చున్నారు. కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురైన రాష్ట్ర ఎంపీలు రైల్వే మంత్రి బడ్జెట్ ప్రసంగానికి అడ్డుతగిలేందుకు ప్రయత్నించారు.

 వారినుంచి రైల్వే మంత్రికి ఇబ్బంది ఎదురవకుండా తెలంగాణ ఎంపీలు రక్షణ వలయంగా ఏర్పడ్డారు. మరోవైపు ఏఐఏడీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల సభ్యులు తమ తమ రాష్ట్రాల సమస్యలపై కూడా ఇదే సమయంలో ఆందోళనకు దిగారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం, ఒకింత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఎప్పుడేం జరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే టీడీపీ సభ్యుడు ఎన్.శివప్రసాద్ లోక్‌సభ సిబ్బంది వద్దకు వెళ్లి వారి వద్ద ఉన్న కాగితాలను చింపేశారు. పెన్నులు లాగేశారు. టీఆర్‌ఎస్ సభ్యుడు మందా జగన్నాథం శివప్రసాద్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఒకదశలో వారిద్దరూ పరస్పరం కలబడినంత పనిచేశారు. జేడీ(యూ) నేత శరద్‌యూదవ్, తృణమూల్ ఎంపీ సౌగత రాయ్ తదితరులు తక్షణమే స్పందించి వారికి అడ్డుగా నిలిచారు. మరోవైపు రైల్వే మంత్రి ఖర్గేకు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు రక్షణగా నిలిచారు. సీమాంధ్ర ఎంపీలు పదేపదే కాగితాలు చింపుతూ బడ్జెట్ ప్రతిని చదువుతున్న ఖర్గేపైకి విసిరేశారు. దీంతో కేవలం 12 నిమిషాల్లోనే రైల్వేమంత్రి తన ప్రసంగం ముగించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే సభ గురువారానికి వారుుదా పడింది.
 
 రాజ్యసభలోనూ రభస: ఉదయం రాజ్యసభ ప్రారంభం కాగానే సీమాంధ్ర ఎంపీలు, ఇతర ప్రాంతాల ఎంపీలు సభాకార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తుండడంతో చైర్మన్ హమీద్ అన్సారీ సభను 12 గంటలకు వాయిదా వేయిస్తున్నట్టు ప్రకటించారు. తిరిగి ప్రారంభమయ్యాక పలువురు మంత్రులు తమ శాఖలకు సంబంధించిన నివేదికలను ప్రవేశపెట్టారు. సీమాంధ్ర ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, సీఎం రమేశ్, సుజనా చౌదరి తదితరులు ప్లకార్డులతో సభాపతి స్థానంలో ఉన్న డిప్యూటీ చైర్మన్ కురియన్ సభకు కనిపించకుండా అడ్డుగా నిలుచుని సమైక్య నినాదాలు చేశారు. దీంతో ఆరు నిమిషాల్లోనే 2 గంటలకు సభ వాయిదా పడింది. తిరిగి సభ ప్రారంభమయ్యాక రైల్వే మంత్రి ఖర్గే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. సభ మళ్లీ అదుపుతప్పడంతో రెండు నిమిషాల్లోనే గురువారానికి వాయిదా పడింది.
 

మరిన్ని వార్తలు