సింహస్థా కుంభమేళాకు హిజ్రా సాధువులు

20 Oct, 2015 08:58 IST|Sakshi
సింహస్థా కుంభమేళాకు హిజ్రా సాధువులు

భోపాల్: చదివేందుకు వింతగానే ఉన్నా ఇది అక్షరాలా నిజం. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్ జిల్లాలో వచ్చే ఏడాది ఏప్రిల్ 22 నుంచి మే 21 వరకు జరగనున్న సింహస్థా కుంభమేళాలో దాదాపు పదివేల మంది హిజ్రా సాధువులు పాల్గొని, పవిత్ర స్నానాలాచరించనున్నారట. దేశం నలుమూలల నుంచే కాకుండా బ్యాంకాక్ వంటి దేశాల నుంచి కూడా హిజ్రా సాధువులు ఈ కుంభమేళాలో పాల్గొనేందుకు వస్తున్నారని ఉజ్జయిన్‌కు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రుషి అజయ్‌దాస్ వెల్లడించారు.

ఈ కుంభమేళాలో ఇప్పటిదాకా 13 వర్గాలకు చెందిన సాధువులు మాత్రమే పాల్గొనేవారని, వారికోసం మాత్రమే శిబిరాలు ఏర్పాటు చేసేవారని,  ఈసారి హిజ్రా సాధువులు కూడా పెద్దమొత్తంలో హాజరవుతుండడంతో 14వ శిబిరాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నామని అజయ్‌దాస్ తెలిపారు.

ఉజ్జయిన్‌లోని తన ఆశ్రమంలోనే హిజ్రా సాధువుల కోసం ఈ నెల 13 నుంచే శిబిరాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ఇదిలాఉండగా హిజ్రా సాధువుల విషయంలో మిగతా సాధువర్గాల నుంచి వ్యతిరేకత ఎదురయ్యే అవకాశముందని పలువురు భావిస్తుండగా ఉజ్జయిన్ జిల్లా కలెక్టర్ మాత్రం.. అలాంటిదేమీ ఉండదని చెబుతున్నారు.

మరిన్ని వార్తలు