‘పాలమూరు’కు టెండర్లు పిలవండి

5 Jan, 2016 04:06 IST|Sakshi
‘పాలమూరు’కు టెండర్లు పిలవండి

* అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం
* రెండు వారాల్లో పనులు మొదలుపెట్టాలి
* మేడిగడ్డ వద్ద కాళేశ్వరం బ్యారేజీకి త్వరలో శంకుస్థాపన
* పాలమూరు, పెన్‌గంగ, డిండి ప్రాజెక్టులపై సీఎం సమీక్ష  

సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదులపై తలపెట్టిన ప్రాజెక్టుల నిర్మాణం త్వరితగతిన పూర్తిచేసేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించుకొని పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. పాల మూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులకు వెంటనే టెండర్లు పిలవాలని, రెండు వారాల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు.

పనుల్లో వేగం పెంచడానికి , త్వరితగతిన నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా చీఫ్ ఇంజనీర్, సూపరింటెండెంట్ ఇంజనీర్ స్థాయి అధికారులకు కూడా అధికారాలు బదలాయించాలని ఆదేశాలు జారీ చేశారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నీటి పారుదల శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి టి.హరీశ్‌రావు, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, శాఖ కార్యదర్శి ఎస్‌కే జోషి, ఈఎన్‌సీ మురళీధర్, సీఈ హరిరామ్, రిటైర్డ్ ఇంజనీర్లు రంగారెడ్డి, శ్యాంప్రసాద్‌రెడ్డి, ఓఎస్‌డీ శ్రీధర్ దేశ్‌పాండే పాల్గొన్నారు.
 
వచ్చే ఏడాదిలో కాళేశ్వరానికి నీరు చేరాలి
వచ్చే బడ్జెట్‌లో నీటి పారుదల శాఖకు కేటాయించే రూ.25 వేల కోట్ల నిధుల్లో ప్రతినెలా రూ.2,083 కోట్లు విడుదల చేస్తామని, అందు కు అనుగుణంగా పనులు జరగాలని సీఎం ఆదేశించారు. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన రీడిజైన్లు పూర్తయినందున అన్ని ప్రాజెక్టుల పనులు ప్రారంభం కావాలన్నారు. పాలమూరు పరిధిలోని ఏదుల, కరివెన డిస్ట్రిబ్యూటరీ పనులకు సత్వరమే టెం డర్లు పిలవాలన్నారు. ఉద్దండాపూర్‌కు పనుల డిజైన్లు ఖరారు చేయాలన్నారు.

మేడిగడ్డ వద్ద కాళేశ్వరం బ్యారేజీకి త్వరలో శంకుస్థాపన చేయాలని, వచ్చే ఏడాది జూన్ నాటికి ఈ బ్యారేజీ నుంచి ఎల్లంపల్లి నీరు చేరేలా పనులు జరగాలన్నారు. పెన్‌గంగ ప్రాజెక్టు టెండర్లను సైతం రెండు వారాల్లో పూర్తి చేయాలని, డిండి ప్రాజెక్టుకు కూడా త్వరగా టెండర్లు పిలవాలని సూచించారు.
 
రూ.27వేల కోట్ల పనులు..18 ప్యాకేజీలు
మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలోని 62 మండలాల్లో 1,131 గ్రామాల పరిధిలోని 10 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే ఉద్దేశంతో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును రూ.35,200 కోట్లతో చేపట్టిన విషయం తెలిసిందే. రంగారెడ్డిలో నిర్మించే కేపీ లక్ష్మీదేవునిపల్లి మినహా ప్రాజెక్టులోని ఐదు రిజర్వాయర్లు... నార్లాపూర్-8.1 టీఎంసీ, ఏదుల 6.5, వట్టెం 16.6, కరివెన 19.15, ఉద్ధండాపూర్ 92 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించాలని నిర్ణయించారు.

వీటి కోసం మొత్తంగా రూ.9,644 కోట్లతో అంచనాలు సిద్ధమయ్యాయి. ఇందులో వట్టెం రిజర్వాయర్‌కు గరిష్టంగా 3,780 కోట్లు కానుండగా, కరివెనకు రూ.2,490 కోట్లు, ఉద్ధండాపూర్‌కు రూ.2,115 కోట్లు, నార్లాపూర్‌కు రూ.801 కోట్లు, ఏదులకు రూ.458 కోట్లు అంచనా వ్యయంగా లెక్కించారు. వీటితో పాటు నార్లపూర్ నుంచి ఉద్ధండాపూర్ వరకు కాలువలు, టన్నెల్‌ల నిర్మాణానికి సంబంధించి మొత్తం పనులను రూ.20,654.54 కోట్లుగా లెక్కగట్టగా... ఎలక్ట్రో మెకానికల్ పనులకు అదనంగా మరో రూ.6,258.72 కోట్లు ఖర్చవుతుందని అంచనాలు సిద్ధం చేశారు.

మొత్తంగా రూ.26,913.26 కోట్ల పనులను 18 ప్యాకేజీలుగా విభజించారు. ఇందులో గరిష్టంగా ప్యాకేజీ-18లో రూ.2,169.94 కోట్ల పనులు ఉండగా, కనిష్టంగా ప్యాకేజీ-3లో రూ.427 కోట్ల పనులున్నాయి. అయితే ఈ ప్యాకేజీల విషయంలో నెలకొన్న సందిగ్ధత  కారణంగా టెండర్ల ప్రక్రియ ఆగిపోయింది. రూ.500 కోట్ల నుంచి రూ.వెయ్యి కోట్ల మధ్య టెండర్లు పిలవాలని అధికారుల స్థాయిలో నిర్ణయం జరగ్గా... మొబిలైజేషన్ అడ్వాన్సులు లేనందున ప్యాకేజీలను రూ.వెయ్యి కోట్లకు పైనే నిర్ణయించి పెద్ద కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాలని ప్రభుత్వ పెద్దలు ఆలోచనలు చేశారు.

సోమవారం జరిగిన సమావేశంలో ఈ విషయం చర్చకు రాగా సీఎం... నిర్ణయాధికారాన్ని అధికారులకే కట్టబెట్టారు. ఇప్పటికే విభజించిన ప్యాకేజీలకు అనుగుణంగా టెండర్లు పిలవాలని సూచించారు. ఇక సివిల్, ఎలక్ట్రోమెకానికల్ పనులను విభజించాలన్న సూచనను పక్కనపెట్టి.. అన్ని పనులకు ఒకే టెండర్ పిలవాలని నిర్ణయించారు.
 
డిండికి లైన్‌క్లియర్...
మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు సాగునీరందించేందుకు ఉద్దేశించిన డిండి ప్రాజెక్టు డిజైన్‌కు సమావేశంలో ఓకే చేశారు. ఎలాంటి టన్నెల్‌ల నిర్మాణం లేకుండా కాలువల ద్వారా నీటిని అందించే ప్రణాళికకు ఆమోదం లభించింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉండే ఏదుల రిజర్వాయర్ అప్పర్ డిండికి నీటిని తరలించే బదులు 430 మీటర్ల ఎత్తు వద్దే రిజర్వాయర్ నిర్మించి అక్కడ్నుంచి నీటిని తరలించేలా డిజైన్‌ను ఖరారు చేశారు.

ఇలా అయితే టన్నెల్ అవసరం ఉండదని ఇంజనీర్లు చెబుతున్నారు. 430 మీటర్ల ఎత్తు వద్ద రిజర్వాయర్ నిర్మాణం చేపడితే కొత్తగా ఇర్విన్ వద్ద 4.5 టీఎంసీలు, జేపల్లి వద్ద ఒక టీఎంసీ సామర్థ్యం రిజర్వాయర్ నిర్మించా ల్సి ఉంటుంది. అలాగే కిష్టరాంపల్లి సామర్థ్యం 5.7 నుంచి 9 టీఎంసీలు, శివన్నగూడెం సామర్థ్యాన్ని 7 నుంచి 10 టీఎంసీలకు పెంచాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు