పొంచి ఉన్న ‘ఉగ్ర’సవాళ్లు

9 Sep, 2015 02:06 IST|Sakshi
పొంచి ఉన్న ‘ఉగ్ర’సవాళ్లు

* వ్యూహాత్మక సంస్థలపై సైబర్ దాడులకు కుట్రలు
* దేశ ఆర్థిక రంగాన్ని బలహీనపర్చడమే వారి లక్ష్యం
* కేంద్ర బలగాల్లో మహిళలకు 33 శాతం కోటా
* సీఐఎస్‌ఎఫ్ పాసింగ్ ఔట్ పరేడ్‌లో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్

 
సాక్షి, హైదరాబాద్: ‘ఉగ్రవాదం యావత్ ప్రపంచానికి పెను సవాలుగా మారింది. దేశ అంతర్గత భద్రత, ఆర్థికాభివృద్ధికి గండికొట్టేందుకు జాతి వ్యతిరేక శక్తులు కాచుకుని ఉన్నాయి. నేటి సైబర్ యుగంలో ఉగ్రవాదం వికృత రూపాన్ని సంతరించుకుంటోంది. ఆర్థికాభివృద్ధిలో కీలకమైన వ్యూహాత్మక సంస్థలపై హ్యాకింగ్ దాడుల కోసం సైబర్ ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతోంది. సీసీటీవీ, వైఫై, ఇంటర్నెట్ నెట్‌వర్క్‌ల ఆధారంగానే హ్యాకింగ్ దాడుల కోసం ప్రమాదకర ఎత్తుగడలు వేస్తోంది.
 
 ఈ కుట్రలను సమర్థంగా తిప్పికొట్టేందుకు కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాలు (సీఐఎస్‌ఎఫ్) ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో సైతం నైపుణ్యతను సాధించాలి’ అని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని జాతీయ పారిశ్రామిక భద్రతా దళాల శిక్షణ సంస్థ (నిసా)లో మంగళవారం నిర్వహించిన పాసింగ్ ఔట్ పరేడ్‌లో రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డితో కలసి పాల్గొన్నారు. సీఐఎస్‌ఎఫ్ శిక్షణార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం రాజ్‌నాథ్ ప్రసంగించారు. ఉగ్రదాడుల గాయాలు ప్రజల మనసుల్లో దీర్ఘకాలం ఉండిపోతాయని, అమెరికాలో జరిగిన 9/11, భారత్‌లో జరిగిన 26/11 సంఘటనలు ఇంకా గుర్తున్నాయన్నారు.
 
 వ్యూహాత్మక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశ్రమలు, వీఐపీలు, మెట్రో రైళ్లు, అంతర్గత భద్రత, విపత్తుల నిర్వహణ తదితర రంగాల్లో సీఐఎస్‌ఎఫ్ సేవలు మరవలేమన్నారు. ఒకప్పుడు ప్రభుత్వ రంగ సంస్థల భద్రతకే పరిమితమైన సీఐఎస్‌ఎఫ్ నేడు తమ పరిధిని విస్తరించుకొని, ప్రైవేటు పరిశ్రమల భద్రత అవసరాల కోసం కన్సల్టెన్సీ సేవలూ అందిస్తోందన్నారు. మన ఆర్థిక వ్యవస్థను యావత్ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోందని, ప్రస్తుతం ఏడాదికి 2 ట్రిలి యన్ డాలర్ల వృద్ధి ఉండగా, రానున్న 8 ఏళ్లలో 7 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం సాధించేందుకు ప్రధాని మోదీ కసరత్తు చేస్తున్నారన్నారు. వసుదైక కుటుంబం అనే సందేశాన్ని కేవలం భారత దేశం మాత్రమే ప్రపంచానికి వినిపించిందని, సరిహద్దుల లోపలున్న వారేకాక వెలుపల ఉన్న వారినీ తమ పౌరులుగా భావించే సంప్రదాయం భారత్‌కు ఉందన్నారు. కేంద్ర హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కేంద్రపాలిత ప్రాంతాల్లోని పోలీసు బలగాల్లో మహిళలకు 33 శాతం కోటా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశానని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ప్రస్తుతం సీఐఎస్‌ఎఫ్‌లో మహిళల భాగస్వామ్యం 5.04 శాతం మాత్రమే ఉందని, దీన్ని 33 శాతానికి పెంచుతామన్నారు.
 
  సీఐఎస్‌ఎఫ్‌లో ప్రస్తుతమున్న 1.39 లక్షల బలగాలను 2 లక్షలకు పెంచుతామని చెప్పారు. శిక్షణ పూర్తి చేసుకున్న 66 మంది అసిస్టెంట్ కమాండెంట్లు, 459 మంది సబ్ ఇన్‌స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్‌లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐఎస్‌ఎఫ్ డీజీ సరేందర్ సింగ్, అకాడమీ డెరైక్టర్ అనిల్ కుమార్, మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు