నాలుగు దేశాలపై ఉగ్ర పంజా

27 Jun, 2015 05:23 IST|Sakshi
నాలుగు దేశాలపై ఉగ్ర పంజా

హింసే తమ మతమని ఉగ్రవాదులు మరోసారి చాటుకున్నారు! ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసంలోనూ రక్తపుటేర్లు పారించారు. కువైట్, టునీసియా, సిరియా, ఫ్రాన్స్‌లలో అమాయకులను బలిగొన్నారు. కువైట్‌లో ఇస్లామిక్ స్టేట్(ఐఎస్)కు చెందిన ఓ ఉగ్రవాది శుక్రవారం ప్రార్థనల సమయంలో మసీదులో ఆత్మాహుతి దాడి జరిపి 25 మందిని చంపేశాడు. టునీసియాలోని ఓ బీచ్‌లో మరో ముష్కరుడు పర్యాటకులపై తూటాలు కురిపించి 28 మంది ప్రాణాలు తీశాడు.

ఫ్రాన్స్‌లో ఇంకో ఉగ్రవాది ఓ ఫ్యాక్టరీపై దాడి చేసి, ఒక వ్యక్తిని  అత్యంత కిరాతకంగా తల నరికేశాడు. ఆ తలను ఫ్యాక్టరీ గేటుకు తగిలించి రాక్షసత్వాన్ని ప్రదర్శించాడు. ఇక నిత్యం ఘర్షణలతో అట్టుడుకుతున్న  సిరియాలో రక్తం రుచి మరిగిన ఐఎస్ ముష్కరులు 146 మందిని హత్య చేశారు. ఈ ఉగ్రవాద చర్యలను ప్రధాని నరేంద్రమోదీతోపాటు పలు దేశాల అధినేతలు తీవ్రంగా ఖండించారు.

 
కువైట్ మసీదులో ఐఎస్ ఆత్మాహుతి దాడి
25 మంది మృతి.. 200 మందికి గాయాలు
కువైట్: ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాదులు కువైట్‌లో పేట్రేగిపోయారు. షియాల మసీదులో ఆత్మాహుతి దాడికి పాల్పడి 25 మందిని పొట్టనబెట్టుకున్నారు. నగరంలోని అల్-ఇమామ్ అల్-సాదిక్ మసీదులో శుక్రవారం ప్రార్థనల సమయంలో ఐఎస్ ఈ ఘాతుకానికి తెగబడింది. దాడికి పాల్పడింది తామేనని, అబు సులేమాన్ అల్-మువాహిద్ అనే మిలిటెంట్ ఆత్మాహుతి దాడి చేసినట్లు ప్రకటించుకుంది. ఈ మసీదులో సున్నీ ముస్లింలకు షియా బోధనలు చేస్తున్నారని, అందుకే దాడి చేసినట్లు ఐఎస్ అనుబంధ సంస్థ నజ్ద్ ప్రావిన్స్ తెలిపింది. 2006 తర్వాత కువైట్‌లో ఉగ్రవాద దాడి చోటుచేసుకోవడం ఇదే తొలిసారి. ఈ ఘటనలో మొత్తం 25 మంది చనిపోగా, 200 మందికిపైగా గాయాలపాలైనట్లు ప్రభుత్వ వర్గాలు వె ల్లడించాయి.
 
టునీసియా బీచ్‌లో కాల్పులు
28 మంది మృతి
టునిస్: ఉత్తరాఫ్రికా దేశమైన టునీసియాలోని ఒక బీచ్ రిసార్ట్‌లో పర్యాటకులపై ఓ దుండగుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 28 మందికి పైగా మరణించారు. అది ఉగ్రవాద దాడిగా అధికారులు నిర్ధారించారు. దేశ రాజధాని టునిస్‌కు 140 కిమీల దూరంలో  ఉన్న సౌస్సెలోని సముద్ర తీరంలో ఉన్న రిసార్ట్ మర్హబాలో శుక్రవారం మధ్యాహ్నం ఈ దారుణం చోటు చేసుకుంది. చనిపోయిన వారిలో విదేశీ పర్యాటకులు కూడా ఉన్నారన్న  టునీసియా ప్రభుత్వం.. వారి వివరాలను వెల్లడించలేదు. ఇది ఉగ్రవాద దాడేనని, ఆ ఉగ్రవాదిని భద్రతాదళాలు హతమార్చాయని హోంశాఖ అధికార ప్రతినిధి ప్రకటించారు.
 
ఫ్రాన్స్ ఫ్యాక్టరీలో శిరచ్ఛేదం
సెయింట్-క్వెంటిన్-ఫలవీర్: ఫ్రాన్స్‌లోని ఓ చిన్నపట్టణంలో అనుమానిత ఉగ్రవాది శుక్రవారం పట్టపగలు బీభత్సం సృష్టించాడు. ఓ గ్యాస్ ఫ్యాక్టరీపై దాడి చేసి ఒకరి తల నరికి, ఆ తలను ఫ్యాక్టరీ గేటుకు తగిలించాడు. అతడు జరిపిన పేలుళ్లలో  ఇద్దరు గాయపడ్డారు.   పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. లియోన్ నగరానికి 40 కి.మీ. దూరంలోని సెయింట్-క్వెంటిన్-ఫలవీర్ లో ఈ దారుణం చోటుచేసుకుంది. అమెరికా కంపెనీ ఎయిర్ ప్రొడక్ట్స్‌కు చెందిన ఫ్యాక్టరీలోకి దుండగుడు వాహనంలో దూసుకొచ్చి ఘాతుకానికి పాల్పడ్డాడని ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలండ్  తెలిపారు.  శిరచ్ఛేదానికి గురైన వ్యక్తి మృతదేహం వద్ద అరబిక్ అక్షరాల జెండా కనిపించింది. అది ఇస్లామిక్ స్టేట్‌దని వార్తలొచ్చాయి. నిందితుడిని యాసిన్ సల్హీ(35)గా గుర్తించారు. అతని భార్యనూ అరెస్ట్ చేశారు.
 
సిరియాలో ఐఎస్ నరమేధం
146 మంది పౌరుల బలి
బీరట్: సిరియాలో జిహాదీలు మారణహోమం సృష్టించారు.146 మందిని హత్య చేశారు. కొబేన్‌ప్రాంతంలోని బీరట్‌లో ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాన్ సిరియా(ఐఎస్‌ఐఎస్) తీవ్రవాదులు శుక్రవారం పట్టణంలోకి ప్రవేశించి సామూహిక హత్యాకాండకు పాల్పడ్డారు. సమీప గ్రామంలో మరో 26 మందిని చంపేశారు. గత కొన్నివారాలుగా కుర్దీష్ మిలటరీ చేపట్టిన చర్యలకు ప్రతీకారంగా జిహాదీలు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. గురువారం జిహాదీలకు చెందిన ముగ్గురు వాహనాల్లో దూసుకొచ్చి బీరట్ పట్టణ ప్రవేశమార్గంలో బాంబులతో ఆత్మాహుతి దాడులకు తెగబడ్డారు.

మృతుల్లో పిల్లలు, మహిళలు ఉన్నారు. మృతదేహాలు ఇళ్లల్లో, వీధుల్లో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. 24 గంటల వ్యవధిలో బీరట్‌లో 120 మంది, సమీపంలోని గ్రామంలో మరో 26 మంది పౌరులను ఐఎస్‌కు చెందిన తీవ్రవాదులు హత్య చేశారని సిరియా మానవ హక్కుల పరిశీలక బృందం డెరైక్టర్ రమీ అబ్దెల్ రహమాన్ తెలిపారు. కుబేన్‌లోని ప్రతి కుటుంబమూ ఒక వ్యక్తిని ఈ మారణహోమంలో కోల్పోయింది. వేలాది మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని టర్కీ సరిహద్దు ప్రాంతాల్లోకి పారిపోయారు.

మరిన్ని వార్తలు