ప్రశాంత 'విశాఖ' చిరునామా చెరిగిపోనుందా?

13 Jul, 2016 11:12 IST|Sakshi
ప్రశాంత 'విశాఖ' చిరునామా చెరిగిపోనుందా?

తూర్పు తీరంలో కీలకమైన ఉక్కు నగరం విశాఖ ఇప్పటివరకు ప్రశాంతతకు మారుపేరు. అయితే కేంద్ర నిఘావర్గాల హెచ్చరికలు చూస్తే.. ఈ నగరాన్ని ఉగ్రపీడ పట్టుకుందా?.. అన్న అనుమానాలు..ఆందోళన రేగుతున్నాయి. తూర్పు కోస్తాపై ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థల కన్నుపడిందని.. ముఖ్యంగా తూర్పు నావికాదళ ప్రధాన కేంద్రం, సబ్‌మెరైన్ కేంద్రం, పోర్టులు.. తదితర కీలకమైన వ్యవస్థలకు కేంద్రంగా ఉన్న విశాఖపై ఉగ్రనీడ పడిందని.. ఇప్పటికే స్లీపర్ సెల్స్ కార్యకలాపాలు మొదలయ్యాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అందుకు తగినట్లే మంగళవారం రాష్ట్ర డీజీపీ నగరానికి వచ్చి పర్యటించడం.. ఆ వివరాలు బయటకు పొక్కకపోవడం అనుమానాలను మరింత పెంచుతున్నాయి. ఐఎస్‌ఐఎస్ కదలికలతో హై అలర్ట్ స్లీపర్ సెల్స్ ఉన్నట్లు గుర్తించిన కేంద్రం రాష్ట్రానికి హెచ్చరికలు జారీచేసిన ఐబీ అప్రమత్తమైన జిల్లా అధికారులు అప్రమత్తం అయ్యారు.

విశాఖపట్నం : ప్రశాంత విశాఖ నగరంపై ఉగ్రవాదుల కన్ను పడింది. అంతకంటే ఆందోళనకర విషయమేమిటంటే ఇప్పటికే ఐఎస్‌ఐఎస్‌కు చెందిన స్లీపర్ సెల్స్ సిటీలో విస్తరించాయని కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేయంతో రాష్ట్ర ప్రభుత్వం మన జిల్లా అధికారులను అప్రమత్తం చేసింది. దీంతో హుటాహుటిన రంగంలోకి దిగిన జిల్లా యంతాంగం ప్రత్యేక తనిఖీలకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఎయిర్‌పోర్టు, రైల్వే స్టేషన్‌లో భద్రత కట్టుదిట్టం చేశారు. స్పెషల్ బ్రాంచ్ విభాగానికి పదును పెడుతున్నారు. కొందరు అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ముఖ్యంగా స్లీపర్‌సెల్స్‌ను గుర్తించేందుకు కసరత్తు ప్రారంభించారు. మంగళవారం డీజీపీ రాముడు విశాఖ వచ్చి అధికారులతో సమావేశం కావడం వెనక ప్రధాన కారణం కూడా ఇదేనని తెలుస్తోంది.

ఇక విశాఖ నగరం ఇప్పటికే హై సెన్సిబుల్ ఏరియాగా గుర్తింపుపొందింది. ఉగ్రవాదులు తీర ప్రాంతం గుండా నగరంలోకి ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న హెచ్చరికల నేపథ్యంలో ఈస్ట్రన్ నేవల్ కమాండ్‌తో పాటు కోస్ట్‌గార్డ్‌లను అప్రమత్తం చేశారు. ముంబయి దాడులకు సముద్ర మార్గాన్నే ఎంచుకున్న ఉగ్రవాదులు విశాఖలోనూ అదే అవకాశాన్ని వినియోగించుకోవచ్చనే హెచ్చరికలతో తీరం వెంబడి రక్షణను పటిష్టం చేశారు. బయటి నుంచి ముష్కర మూకలు నగరంలోకి రాకుండా అడ్డుకోవడం ఒకెత్తయితే ఇప్పటికే ఉన్న స్లీపర్ సెల్స్‌ను గుర్తించి మట్టుబెట్టడం మరో ఎత్తు. ఈ రెండూ కత్తిమీద సాములాంటివే. దీంతో విశాఖ పోలీసింగ్‌లో పలు కీలక మార్పులు చేయాల్సి ఉంది. డీజీపీ సమీక్షలోనూ ఇదే అంశాన్ని పలువురు ఉన్నతాధికారులు వ్యక్తం చేసినట్లు సమాచారం.

కలవరపరుస్తున్న పరిస్థితులు
నగరంపై ఉగ్రనీడ పడిందని తెలియగానే అధికారులతో పాటు, నగరవాసులూ ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా ఇక్కడి పరిస్థితులు కలవరపరుస్తున్నాయి. నగరంలో ఎక్కడా చెప్పుకోదగ్గ రక్షణ ఏర్పాట్లు లేవు. అన్నీ ఇప్పుడు కొత్తగా చేయాల్సిందే. ఎదైనా జరిగినప్పుడు హడావుడి చేయడం తప్ప అధికారులు చేపడుతున్న శాశ్వత చర్యలు ఏమీ కనిపించడం లేదు. ఉగ్రవాదులను గుర్తించే ఏర్పాట్లు కూడా లేవు. నగరమంతటా సీసీ కెమెరాలతో అత్యంత భద్రత వలయం ఏర్పాటు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం ఆ దిశగా చేస్తున్న ప్రయత్నాలు మాత్రం నామమాత్రంగానే ఉన్నాయి.

నగరంలో వందకు పైగా పెద్ద హోటళ్లు, 60కి పైగా షాపింగ్ మాల్స్, 30కి పైగా సినిమా హాళ్లు ఉన్నాయి. వీటిలో చాలా వాటికి సీసీ కెమెరాలు లేవు. కొన్నిటికి ఉన్నా సక్రమంగా పనిచేయడం లేదు. ఇక నగరంలో 128 జంక్షన్లు ఉండగా అన్ని జంక్షన్‌లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పి కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. కానీ ఇప్పటికి 47 జంక్షన్లల్లో మాత్రమే ఏర్పాటు చేశారు. మిగతా ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటులో జాప్యం జరుగుతోంది. ఉగ్రవాదులు వచ్చినా, నగరంలో స్వేచ్ఛగా తిరిగే పరిస్థితులు ఉన్నాయి. ఐబీ హెచ్చరికలతోనైనా నగర పోలీసింగ్‌లో మార్పులు జరుగుతాయేమో చూడాలి.
 
 గుంభనంగా డీజీపీ పర్యటన

రాష్ట్ర డీజీపీ జె.వి.రాముడు మంగళవారం విశాఖ వచ్చారు. ఉదయం 8.30 గంటలకు ఎయిర్ కోస్టా విమానంలో విశాఖ చేరుకున్న ఆయన కాసేపు ఇక్కడ ఉన్న అనంతరం విజయనగరం జిల్లాకు బయలుదేరి వెళ్లారు. జాయింట్ పోలీస్ కమిషనర్ సత్తార్ ఖాన్ ఎయిర్‌పోర్టుకు వెళ్లి డీజీపీకి స్వాగతం పలికారు. అయితే ఈ పర్యటనకు సంబంధించిన వివరాలను పోలీసు అధికారులు బయటకు వెల్లడించడం లేదు. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారమూ లేదు. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం విశాఖ వచ్చిన డీజీపీ ఇక్కడి పోలీసు ఉన్నతాధికారులతో పాటు ఢిల్లీ నుంచి వచ్చిన 11 మంది కేంద్ర హోంశాఖ అధికారులతోనూ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చిన పోలీస్ ఉన్నతాధికారులతోనూ గ్రేహౌండ్స్ జిల్లా కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.

ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో చేసిన హెచ్చరికల దృష్ట్యా డీజీపీ రాక ప్రాధాన్యత సంతరించుకుంది. కోస్టల్ సెక్యూరిటీతో పాటు ఉగ్రవాదుల కదలికలపైనా, మన్యంలో నక్సల్స్ సమస్యపైనా ఈ సమీక్షలో డీజీపీ చర్చించినట్లు తెలిసింది. ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులు పలు సూచనలు అందించారని, కమాండ్ కంట్రోల్ ద్వారా తీర ప్రాంత భద్రతపై సమీక్షించారని, పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారని సమాచారం. కానీ అధికారులు ఇవేవీ జరగలేదని చెబుతున్నారు. డీజీపీ విశాఖ వచ్చినా ఎలాంటి కార్యక్రమాల్లోనూ పాల్గొనలేదని నగర పోలీస్ కమిషనర్ టి.యోగానంద్ తెలిపారు.

మరిన్ని వార్తలు