-

ఇక టెస్కో మాల్స్..

18 Dec, 2013 01:05 IST|Sakshi
ఇక టెస్కో మాల్స్..

 న్యూఢిల్లీ: భారత మల్టీ బ్రాండ్ రిటైల్ మార్కెట్లో ప్రవేశించే దిశగా బ్రిటన్ రిటైల్ దిగ్గజం టెస్కో సన్నాహాలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా 110 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 680 కోట్లు) పెట్టుబడితో దేశవ్యాప్తంగా స్టోర్స్ ఏర్పాటు చేసేందుకు అనుమతుల కోసం కేంద్రానికి దరఖాస్తు చేసుకుంది. స్టోర్స్ ఏర్పాటుకు సంబంధించి టాటా గ్రూప్‌లో భాగమైన ట్రెంట్‌తో టెస్కో జతకడుతోంది. ట్రెంట్ హైపర్‌మార్కెట్లో 50 శాతం వాటాలను కొనుగోలు చేయాలని యోచిస్తోంది. స్టార్ బజార్, స్టార్ డెయిలీ, స్టార్ మార్కెట్ వంటి బ్రాండ్ పేర్లతో స్టోర్స్‌ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు టెస్కో తన దరఖాస్తులో పేర్కొంది.
 
 ముందుగా బెంగళూరులోనూ, మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లోనూ టెస్కో రిటైల్ స్టోర్స్ ఏర్పాటు చేయనుంది. పారిశ్రామిక విధాన, ప్రోత్సాహక విభాగం టెస్కో దరఖాస్తును పరిశీలించనుంది. ఆ తర్వాత విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్‌ఐపీబీ) అనుమతుల కోసం పంపుతుంది.  మల్టీ బ్రాండ్ రిటైల్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) నిబంధనలు సడలించిన తర్వాత స్టోర్స్ ఏర్పాటుకు దరఖాస్తు చేసిన తొలి విదేశీ దిగ్గజం టెస్కోనే. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద రిటైల్ సంస్థ అయిన టెస్కో.. ఇప్పటికే ట్రెంట్ భాగస్వామ్యంతో భారత్‌లో స్వల్ప స్థాయిలో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. పశ్చిమ, ద క్షిణాది రాష్ట్రాల్లో 16 అవుట్‌లెట్లను నిర్వహిస్తున్న ట్రెంట్ హైపర్‌మార్కెట్‌కి టెస్కో బ్యాక్‌ఎండ్ సహకారం అందిస్తోంది.
 
 ఏటా 3-5 స్టోర్ల ఏర్పాటు..
 ప్రతి ఆర్థిక సంవత్సరం సుమారు మూడు నుంచి అయిదు స్టోర్స్‌ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు టెస్కో తన దరఖాస్తులో పేర్కొంది. అలాగే 14 రకాల ఉత్పత్తులను విక్రయించనున్నట్లు వివరించింది. ఇందులో టీ, కాఫీ, కూరగాయలు, ఫలాలు, మాంసం, చేపలు, డెయిరీ ఉత్పత్తులు, వైన్, మద్యం, టెక్స్‌టైల్స్, ఫుట్‌వేర్, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్, ఆభరణాలు, పుస్తకాలు ఉంటాయి. టెస్కోకి ప్రస్తుతం చైనా, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్, మలే సియా, పోలాండ్,  టర్కీ తదితర దేశాల్లో టెస్కో కార్యకలాపాలు ఉన్నాయి.
 వివిధ వర్గాల అభ్యంతరాలను పక్కన పెడుతూ మల్టీ బ్రాండ్ రిటైల్‌లో 51% మేర ఎఫ్‌డీఐలను అనుమతించాలని కేంద్రం గతేడాది సెప్టెంబర్‌లో నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఎఫ్‌డీఐ నిబంధనలపై స్పష్టత కోరుతూ టెస్కో సీఈవో ఫిలిప్ క్లార్క్, ట్రెంట్ వైస్ చైర్మన్ నోయల్ టాటా ఈ ఏడాది మే లే ఆనంద్ శర్మతో భేటీ అయ్యారు. వివాదాస్పదమైన సోర్సింగ్ నిబంధనల గురించి ఇందులో చర్చించారు. ఆ తర్వాత ఆగస్టులో కేంద్రం సదరు నిబంధలను సడలించింది. స్థానిక చిన్న, మధ్య తరహా సంస్థల నుంచి 30% మేర ఉత్పత్తులను కొనుగోలు చేయాలన్న నిబంధనను వ్యాపార ప్రారంభ దశకు మాత్రమే పరిమితం చేసింది. అలాగే, పది లక్షల కన్నా తక్కువ జనాభా ఉన్న నగరాల్లో కూడా మల్టీ బ్రాండ్ స్టోర్స్ ఏర్పాటునకు అనుమతించింది.
 
 వేగంగా అనుమతులిచ్చేందుకు ప్రయత్నిస్తాం: ఆనంద్ శర్మ
 భారత మల్టీ బ్రాండ్ రిటైల్‌లో ఇన్వెస్ట్ చేయాలన్న టెస్కో నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్ శర్మ తెలిపారు. అనుమతులు వేగంగా ఇచ్చేందుకు ప్రయత్నించడం ద్వారా తమ వంతు తోడ్పాటు అందించగలమని ఆయన చెప్పారు. ‘దేశీ రిటైల్ పరిశ్రమ రూపాంతరం చెందడానికి ఇది నాంది కాగలదు.

ఈ పరిణామంతో మరిన్ని అంతర్జాతీయ దిగ్గజాలు కూడా భారత్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రాగలవు’ అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మల్టీ బ్రాండ్ రిటైల్‌లో ఎఫ్‌డీఐలను అనుమతించడానికి వెనుక ముఖ్యోద్దేశం వ్యవసాయోత్పత్తులు వృధా కాకుండా చూడటమేనని ఆనంద్ శర్మ స్పష్టం చేశారు.  మరోవైపు, భారత మార్కెట్‌పై తమకి ఉన్న అవగాహన, అంతర్జాతీయంగా రిటైల్‌లో టెస్కోకి ఉన్న అపార అనుభవం ఒకదానికి మరొకటి తోడు కాగలవని ట్రెంట్ వైస్ చైర్మన్ నోయల్ టాటా పేర్కొన్నారు. తద్వారా దేశీ మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకోగలమని చెప్పారు.
 

మరిన్ని వార్తలు